బతకలేం, తిరిగి పనిలోకి వచ్చేస్తాం

11 Oct, 2020 09:05 IST|Sakshi

పాత పనిప్రదేశాలకు తిరిగి వచ్చేస్తామంటున్న కార్మికులు 

ఇన్ఫెరెన్షియల్‌ సర్వే స్టాటిస్టిక్స్, రీసెర్చ్‌ ఫౌండేషన్‌ అధ్యయనంలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: తాము గతంలో పనిచేసిన ప్రాంతాలకు తిరిగొచ్చేందుకు వలసకార్మికులు సంసిద్ధులవుతున్నారు. వివిధ రాష్ట్రా ల్లోని తమ సొంత ప్రాంతాలకు వెళ్లిన వారిలో 70% వరకు మళ్లీ నగరాలు, గతంలో పనిచేసిన చోట్లకు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు అకస్మాత్తుగా విధించిన లాక్‌డౌన్‌తో కొన్నిరోజుల పాటు అనేక కష్టాలు ఎదుర్కొని వలస కార్మికులు తమ సొంతూళ్లకు చేరుకున్న సం గతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఒక కోటి 4 లక్షల మంది వలసకార్మికులు తమ ఊళ్లకు చేరుకున్నట్టుగా సర్వేలో వెల్లడైంది.

తాము పనిచేస్తున్న చోట్ల ఉపాధి దొరకక, ఎలాంటి ఆదాయం లేకపోవడంతో కుటుంబాలను పోషించలేక, ఇళ్ల అద్దెలు కట్టలేక సొంత గ్రామాలకు వెళ్లిపోయినవారికి తమ నైపుణ్యాలకు తగ్గట్టు పనిదొరకక, ఇంకా కొందరికి సరైన పనులు లభించక లాక్‌డౌన్‌ సమయంలోనే 94% ఆదాయాలు తగ్గిపోయినట్టుగా తాజా సర్వేలో వెల్లడైంది. అయితే వీరిలో దాదాపు 70% వలసకార్మికులు తిరిగి పాత పనిప్రాంతాలకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సర్వే నివేదిక పేర్కొంది.

మాజీ ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తల ఆధ్వర్యంలో ‘మైగ్రెంట్‌ వర్కర్స్‌: ఏ స్టడీ ఆన్‌ దెర్‌ లైవ్లీహుడ్‌ ఆఫ్టర్‌ రివర్స్‌ మైగ్రేషన్‌ డ్యూటు లాక్‌డౌన్‌’శీర్షికతో నిర్వహించిన ఇన్ఫెరెన్షియల్‌ సర్వే స్టాటిస్టిక్స్, రీసెర్చ్‌ ఫౌండేషన్‌ అధ్యయనంలో ఇంకా అనేక అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఫౌండేషన్‌ను నేషనల్‌ శాంపిల్‌సర్వే ఆఫీస్‌ రిటైర్డ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ బి.బి.సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మాజీ ఆర్థిక సలహాదారు ఎన్‌కే సాహు తదితరులు స్థాపించారు. 

కోవిడ్‌ ప్రభావం వారిపై తీవ్రం 
వలస కార్మికులపై కోవిడ్‌ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్రంగా పడినట్లు సర్వే వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచే ఎక్కువ సంఖ్యలో కార్మికులు వలస వస్తున్న నేపథ్యంలో.. ఈ రాష్ట్రాల్లోనే ఈ అధ్యయనం నిర్వహించారు. సొంతూ ళ్లకు వెళ్లిన వారిలో నెల లేదా రోజువారీ వేతనం పొందేవారిపై ఈ ప్రభావం తీవ్రంగా ఉందని, వ్యవసాయేతర రంగాల్లోని క్యాజువల్‌ కార్మికులపై ఇది తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. సొంతూళ్లకు చేరుకున్న వారి ఆదాయాలను గతంలో పనిచేసిన చోట్ల ఆదాయంతో పోలిస్తే సగటున 85% తగ్గిపోయాయి.

ఇక జార్ఖండ్,యూపీల్లో అయితే 94% మేర ఆదాయం తగ్గిపోయింది. గతంలో వివిధ మార్గాల్లో స్వయం ఉపాధి పొందే వలసకార్మికుల్లో ప్రస్తుతం 86% మేర ఆదాయం (ఆరు రాష్ట్రాల్లో కలిపి)కోల్పోయారు. గ్రామాల్లో ఆదాయమార్గాలు లేక పట్టణాలకు వెళితే ఏదో ఒక ఉపాధి దొరుకుతుందనే ఆశాభావంతో 41 శాతం మంది ఉన్నారు. గతంలో పనిచేసిన యజమానుల నుంచి వస్తున్న వేతనం పెంపుదలకు స్పందించి 33 శాతం మంది తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది. 

జార్ఖండ్, యూపీల నుంచే ఎక్కువ  
నగరాలు, గతంలో తాము పనిచేసిన ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు 70% వలసకార్మికులు సుముఖంగా ఉండగా, వారిలో జార్ఖండ్‌ నుంచి 92.31%, యూపీ నుంచి 89.31%, ఒడిశా నుంచి 59 శాతంమంది సిద్ధమౌతున్నారు. పశ్చిమబెంగాల్‌ నుంచి మాత్రం 35 శాతంమందే మళ్లీ నగరాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని తాజా నివేదిక వెల్లడించింది.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు