ఢిల్లీలో నేడు, రేపు రాత్రి కర్ఫ్యూ!

31 Dec, 2020 12:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు టీకా రావడంతో దేశ ప్రజలంతా ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. మహమ్మారిని అరికట్టేందుకు మందు రావడంతో ఇక న్యూ ఇయర్‌ వేడుకలను వైభవంగా జరపుకుంటూ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న దేశ రాజధాని ప్రజలకు చేదు అనుభవం ఎదురైంది. డిసెంబర్‌ 31, రాత్రి, జనవరి 1 తేదీల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆప్‌ ప్రభుత్వం ప్రభుత్వం‌ ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. బ్రిటన్‌ కొత్త స్ట్రైయిన్‌ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక రాత్రి కర్ఫ్యూ సమయంలో ఎవరూ కూడా కొత్త సంవత్సరం వేడుకలను ఇళ్ల బయట జరుపుకోకూడదని, బహిరంగ స్థలాల్లో గుంపులుగా ఉండటం, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా కర్ఫ్యూ సమయంలో బయటకు వస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది. (చదవండి: న్యూ‍ ఇయర్‌.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ) 

అయితే భారత్‌లో బ్రిటన్‌ కొత్త స్ట్రైయిన్‌ కేసులు బయటపడటంతో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించే పనిలో పడ్డాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా కఠిన ఆంక్షలు విధించాయి. బహిరంగ ప్రదేశాలు, ఫంక్షన్ హాల్స్ తదితర ప్రదేశాల్లో వేడుకలపై నిషేధం విధించాయి. అంతేగాక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికితే చర్యలు తప్పవని హెచ్చరించాయి. కాగా ఈ కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ తొలిసారిగా యూకేలో  వెలుగు చూసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ వైరస్‌ చాలా వేగంగా వ్యాపిస్తూ మన దేశంతో పాటు పలు దేశాలకు కూడా విస్తరించింది. ఈ వైరస్ కంట్రోల్ దాటిపోయిందంటూ యూకే ఆందోళన వ్యక్తం చేయడంతో న్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో అన్ని దేశాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. (చదవండి: యూకే స్ట్రెయిన్‌: మరో ఐదుగురికి పాజిటివ్‌)

>
మరిన్ని వార్తలు