రెండో డోస్‌ టీకా వేయించుకోని 3.86 కోట్ల మంది

20 Aug, 2021 06:12 IST|Sakshi

ఆర్‌టీఐ దరఖాస్తుకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాల రెండో డోస్‌ను నిర్ణీత సమయంలో వేయించుకోని వారు 3.86 కోట్ల మంది ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం వరకు దేశంలో 44,22,85,854 మంది కోవిడ్‌ టీకా మొదటి డోస్‌ తీసుకోగా, 12,59,07,443 మంది రెండో డోస్‌ వేయించుకున్నట్లు వివరించింది. కోవిడ్‌ను సమర్థంగా అడ్డుకునేందుకు మొదటి డోస్‌ తీసుకున్న తర్వాత కోవిషీల్డ్‌ టీకా అయితే 84–112 రోజుల్లో, కోవాగ్జిన్‌ 28–42 రోజుల మధ్య రెండో డోస్‌ తీసుకోవాలి.

ఆగస్టు 17వ తేదీ నాటికి దేశంలో కోవిషీల్డ్‌ టీకా మొదటి డోస్‌ తీసుకుని, రెండో డోస్‌ను ప్రభుత్వం సూచించిన సమయంలో తీసుకోని వారు కోవిడ్‌ పోర్టల్‌ వివరాలను బట్టి 3,40,72,993 మంది ఉన్నట్లు తెలిపింది.  కోవాగ్జిన్‌ మొదటి డోస్‌ వేయించుకుని, సకాలంలో రెండో డోస్‌ వేయించుకోని వారు 46,78,406 మంది ఉన్నారు.  రెండో డోస్‌ను ఎప్పుడు వేయించుకోవాలో సూచించామనీ, అయితే, సకాలంలో రెండో డోస్‌ తీసుకోని వారు మళ్లీ రెండు డోస్‌లు తీసుకోవాలా అనే విషయంలో తామెలాంటి సూచనలు చేయలేదని పేర్కొంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు