పార్లమెంట్‌ ఘటన కేసు: ఢిల్లీ పోలీసుల అదుపులో మాజీ డీఎస్పీ కొడుకు!

21 Dec, 2023 10:37 IST|Sakshi

బెంగళూరు/ఢిల్లీ: పార్లమెంట్‌లోకి చొరబాటు.. లోక్‌సభ దాడి ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన ఓ మాజీ పోలీసు అధికారి కొడుకును ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి భాగల్‌కోట్‌లో నివాసంలో అతన్ని ప్రశ్నించిన పోలీసులు.. ఆపై అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. అతని ల్యాప్‌ట్యాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

పోలీసుల అదుపులో ఉన్నవ్యక్తి పేరు సాయికృష్ణ జగలి.  బెంగళూరుకు చెందిన ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడని  పోలీసులు ప్రకటించారు. పార్లమెంట్‌లో అలజడి సృష్టించిన మనోరంజన్‌.. సాయికృష్ణ ఇద్దరూ ఇంజినీరింగ్‌లో బ్యాచ్‌మేట్స్‌.. రూమ్‌మేట్స్‌ కూడా. సాయికృష్ణ తండ్రి డీఎస్పీగా రిటైర్‌ అయిన అధికారిగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. సాయికృష్ణ అరెస్ట్‌పై ఆమె సోదరి స్పందన స్పందించారు. తన సోదరుడు ఎలాంటి తప్పు చేయలేదని ఆమె అంటున్నారు. ‘‘ఢిల్లీ పోలీసులు మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమే. వాళ్లు సాయిని ప్రశ్నించారు. ఎంక్వయిరీకి పూర్తిగా మేం సహకరించాం. సాయికృష్ణ ఎలాంటి తప్పు చేయలేదు. మనోరంజన్‌, సాయి రూమ్‌మేట్స్‌ అనే మాట వాస్తవం. ప్రస్తుతం నా సోదరుడు వర్క్‌ఫ్రమ్‌ హోంలో ఉన్నాడు’’ అని తెలిపారామె. మరోవైపు ఈ కేసుకు సంబంధించి యూపీకి చెందిన ఓ వ్యక్తిని కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

పార్లమెంట్‌ ఘటనలో బుధవారం వరకు.. ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మణిపూర్‌ ఘటన, దేశంలో నిరుద్యోగం, రైతు సమస్యలు.. వీటన్నింటిపై కేంద్రానికి నిరసన తెలిపేందుకు తాము ఈ పని చేశామని నిందితులు అంటున్నారు. అయితే.. అన్నీ కోణాల్లోనూ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఢిల్లీ పోఈసులు అంటున్నారు. 

లోక్‌సభలో వెల్‌లోకి దూసుకెళ్లే యత్నం చేయడంతో పాటు కలర్‌ స్మోక్‌ షెల్స్‌ తెరిచి అలజడి రేపినందుకుగానూ మనోరంజన్‌తో పాటు సాగర్‌ శర్మను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అదే సమయంలో పార్లమెంట్‌ బయట నినాదాలు చేస్తూ నిరసన చేసిన అమోల్‌ షిండే, నీలం ఆజాద్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలపై కేసులు నమోదు అయ్యాక దర్యాప్తులో లలిత్‌ ఝా అనే వ్యక్తిని(ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు), అతనికి సహకరించిన రాజస్థాన్‌వాసి మహేష్‌ కునావత్‌ను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

>
మరిన్ని వార్తలు