కజిరంగా నేషనల్‌ పార్కులో మోదీ విహారం

10 Mar, 2024 04:45 IST|Sakshi
కజిరంగా నేషనల్‌ పార్కులో ప్రధాని మోదీ జీప్‌ సఫారీ

జోర్హాట్‌: అస్సాంలోని ప్రఖ్యాత కజిరంగా నేషనల్‌ పార్కు, టైగర్‌ రిజర్వ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. శుక్రవారం సాయంత్రం అస్సాం చేరుకున్న మోదీ శనివారం ఉదయం ఈ పార్కులో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్యాంట్, షర్టు, జాకెట్, హ్యాట్‌ ధరించారు. ‘ప్రద్యుమ్న’ అనే ఏనుగుపై స్వయంగా విహరించారు. ఇక్కడి ప్రకృతి అందాలను, వన్యప్రాణులను ప్రత్యక్షంగా తిలకించి పరవశించిపోయారు. వాటిని తన కెమెరాలో బంధించారు. దాదాపు రెండు గంటలపాటు పార్కులో గడిపారు.

ఎలిఫెంట్‌ సఫారీ, జీపు సఫారీని ఆనందించారు. ‘యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌’ అయిన కజిరంగా జాతీయ ఉద్యానవనాన్ని మోదీ సందర్శించడం ఇదే మొదటిసారి. ఏమాత్రం అలసట లేకుండా వనంలో ఉత్సాహంగా కలియదిరిగారు. జీపుపై విహారిస్తూ అధికారులను ఇక్కడి విశేషాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చాలా జంతువులు ఆయన కంటబడ్డాయి. మూడు ఏనుగులకు మోదీ తన చేతులతో చెరుకు గడలు తినిపించారు. ఫారెస్టు గార్డులు ‘వనదుర్గల’తో, ఏనుగు మావటీలతో, అటవీ శాఖ అధికారులతో మాట్లాడారు. ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి చెందిన కజిరంగా నేషనల్‌ పార్కులో పెద్దసంఖ్యలో గజరాజులు, ఇతర అరుదైన వన్య ప్రాణులు ఉన్నాయని మోదీ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. సంబంధిత చిత్రాలను కూడా పంచుకున్నారు. వనదుర్గలు అందిస్తున్న సేవలను ప్రశంసించారు.  
 

Election 2024

మరిన్ని వార్తలు