వ్యాక్సినేషన్‌లో ఇదే వేగం కొనసాగించండి

27 Jun, 2021 02:18 IST|Sakshi

అధికారులకు మోదీ సూచన

పరీక్షల సంఖ్య ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గడానికి వీల్లేదు

కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌పై ఉన్నతస్థాయి సమీక్ష

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌లో ఈవారంలో పెంచిన వేగం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే వేగాన్ని ఇకపైనా కొనసాగించడం చాలా ముఖ్యమని చెప్పారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను మరింత విస్తృతం చేయడానికి ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు(ఎన్జీవోలు), ఇతర సంస్థలను సైతం భాగస్వాములను చేయాలని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై ప్రధాని మోదీ తాజాగా అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో టెస్టింగ్‌(పరీక్షలు) చాలా కీలకమని చెప్పారు. పరీక్షల సంఖ్య ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గడానికి వీల్లేదన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల అధికారులతో కలిసి పని చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులకు సూచించారు. వ్యాక్సినేషన్‌ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కోవిన్‌ పోర్టల్‌పై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని అధికారులు ఈ సందర్భంగా మోదీ దృష్టికి తీసుకొచ్చారు. అలాంటి దేశాలకు అవసరమైన సాయం అందించాలని ప్రధానమంత్రి చెప్పారు. వ్యాక్సిన్ల సరఫరాపై అధికారులు ప్రధానమంత్రికి ఒక ప్రజంటేషన్‌ ఇచ్చారు.


దేశంలో గత ఆరు రోజుల్లో 3.77 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు ఇచ్చినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మలేషియా, సౌదీ అరేబియా, కెనడా తదితర దేశాల్లోని జనాభా కంటే ఇది అధికమని స్పష్టం చేసింది. 45 సంవత్సరాల వయసు దాటిన వారి విషయంలో దేశవ్యాప్తంగా 128 జిల్లాల్లో 50 శాతానికిపైగా వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు తెలిపింది. ఇదే వయస్సు విభాగంలో 16 జిల్లాల్లో 90 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని పీఎంఓ పేర్కొంది.

మరిన్ని వార్తలు