ప్రజలు పట్టించుకోవట్లేదు.. కరోనా ఉధృతి తగ్గలేదు 

12 Jul, 2021 00:24 IST|Sakshi

తొమ్మిది జిల్లాల్లో ఇప్పటికీ కరోనా ఉధృతి తగ్గలేదు 

రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అదుపులోనే కోవిడ్‌ 

కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారి సంజయ్‌ ఓక్‌ వెల్లడి

 ముంబై: కరోనా రెండో వేవ్‌ ఇంకా తగ్గలేదని అందరూ జాగ్రత్త వహించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పినా ప్రజలు నిబంధనలు అతిక్రమిస్తున్నారని కరోనా టాస్క్‌ఫోర్స్‌ ప్రధాన అధికారి డా.సంజయ్‌ ఓక్‌ అన్నారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ తొమ్మిది జిల్లాల్లో మాత్రం ఇంకా కరోనా ఉధృతి కొనసాగుతోందని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య స్థిరంగా ఉంటున్నా కొల్హాపూర్, సతారా, సాంగ్లీ, రాయ్‌గఢ్, పుణే, రత్నగిరి, సింధుదుర్గ్, పాల్ఘర్, బుల్డాణా జిల్లాల్లో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని తెలిపారు.  

రోజుకు పదివేల కేసులు.. 
దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మహారాష్ట్రలో మాత్రం ప్రతిరోజు 9 నుంచి 10 వేల వరకు కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అందులో కొల్హాపూర్‌ జిల్లాలో పాజిటివిటీ రేట్‌ అత్యధికంగా 10.24 శాతంగా ఉండగా, సతారా 9.94, సాంగ్లీ 8.81 ఉంది. మరోవైపు రాయగఢ్‌ 7.88, పుణె 7.68, రత్నగిరి 7.29, సింధుదుర్గ్‌ 6.55, పాల్ఘర్‌ 5.26, బుల్డాణా 4.57 శాతం పాజటివిటీ రేటుతో కరోనా సంక్రమణ కొనసాగుతోంది. కొల్హాపూర్, సతారా, సాంగ్లీ, పుణే జిల్లాల్లో కరోనా సంక్రమణ రేటు జూన్‌ చివరి వారంలో కాస్త తగ్గినట్లు అనిపించినా, జూన్‌ 27 నుంచి మళ్లీ పెరుగుదల కనిపిస్తోందని డా. సంజయ్‌ ఓక్‌ అన్నారు.

ఈ జిల్లాల్లో కరోనా వ్యాప్తిని నియంత్రించే బాధ్యతను ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్థానిక పరిపాలనా సంస్థలకే అప్పగించారు. గురువారం నిర్వహించిన జిల్లాధికారుల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టంచేశారు. కరోనా మొదటి వేవ్‌ కంటే రెండో వేవ్‌ సుదీర్ఘంగా కొనసాగుతోంది. మొదటి వేవ్‌ మార్చ్‌ 2020లో ప్రారంభమై అక్టోబర్‌ వరకు తగ్గుముఖం పట్టింది. నవంబర్‌ 2020 వరకు మొదటి వేవ్‌ నిమ్నస్థాయికి తగ్గిపోయింది. అక్టోబర్‌ 2020 నుంచి డిసెంబర్‌ 2020 మధ్యకాలంలో కరోనా బాధితుల సంఖ్య దాదాపు 70 శాతం వరకు తగ్గింది. కరోనా రెండో వేవ్‌ ఫిబ్రవరి 2021 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్‌లో ఇది తీవ్రంగా వ్యాపించింది. మే నుంచి కాస్త తగ్గుదల కనిపించినప్పటికీ జూన్‌ నుంచి మాత్రం కరోనా బాధితుల సంఖ్య స్థిరంగా ఉంటోంది.  

పరీక్షలు తగ్గిస్తే కేసులు పెరుగుతున్నాయి.. 
దేశవ్యాప్తంగా కరోనా సంక్రమణ వేగం తగ్గుముఖం పట్టినప్పటికీ మహారాష్ట్రలో కేసుల సంఖ్య తగ్గడం లేదు. రాష్ట్రంలో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన అలసత్వం మొదలైంది. మాస్క్‌లు ధరించకుండానే బయటకు వెళ్లడం, రద్దీ ప్రాంతాల్లో తిరగడం, సురక్షిత దూరాన్ని పాటించకపోవడం కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో కరోనా ప్రొటోకాల్స్‌ను పాటించాలని, ముఖ్యమంత్రితో సహా ప్రముఖులంతా హెచ్చరిస్తున్నప్పటికీ ప్రజలు పట్టించుకోవడం లేదని టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు డా. సంజయ్‌ ఓక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కరోనా బాధితుడి వెనక కనీసం 20 మందిని ట్రేస్‌ చేయాల్సి ఉంటుందని, కానీ అది అమలు కావడం లేదన్నారు. కరోనా పరీక్షలు తగ్గించడం వల్ల కూడా సంక్రమణ వేగం పెరుగుతోందని తెలిపారు. ఈ రెండు అంశాలపై అత్యధిక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, కరోనా నిబంధనలను కూడా కఠినంగా అమలు చేయాలని డా.సంజయ్‌ ఓక్‌ అన్నారు.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు