Seema Haider: సీమా హైదర్‌కు రూ. 3 కోట్ల పరువు నష్టం నోటీసు!

5 Mar, 2024 09:24 IST|Sakshi

పాక్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి, తన ప్రియుని చెంతకు చేరిన సీమా హైదర్‌ ఇప్పుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. పాక్‌లో ఉంటున్న సీమా హైదర్‌ భర్త గులాం హైదర్‌ తాజాగా సీమా హైదర్‌, ఆమె ప్రియుడు సచిన్‌ మీనాలకు పరువు నష్టం నోటీసు పంపారు. 

సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ తరపు న్యాయవాది మోమిన్ మాలిక్ తాజాగా సీమా, ఆమె ప్రియుడు సచిన్ మీనాకు రూ. మూడు కోట్ల విలువైన పరువు నష్టం నోటీసు పంపారు. అలాగే సీమా తరపు న్యాయవాది డాక్టర్ ఏపీ సింగ్‌కు రూ. ఐదు కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. ఈ ముగ్గురికీ కోట్ల విలువైన  పరువు నష్టం నోటీసులు పంపిన ఆయన వారంతా నెల రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని కోరారు. అలాగే జరిమానా కట్టకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

పాకిస్తాన్‌లో ఉంటున్న సీమా హైదర్‌ భర్త గులాం హైదర్‌ ఇటీవల హర్యానాలోని పానిపట్‌కు చెందిన సీనియర్ న్యాయవాది మోమిన్ మాలిక్‌ను తన తరపు న్యాయవాదిగా నియమించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సీమా హైదర్‌ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు, ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్‌లన్నింటిలో సీమా హైదర్ భర్త పేరు గులాం హైదర్ అని రాసి ఉంది. ఇంతేకాదు కోర్టు నుండి ఆమె బెయిల్ పొందినప్పుడు, సంబంధిత పేపర్లలో గులాం హైదర్ భార్య సీమా హైదర్ అని రాసివుందన్నారు. ఈ విధంగా ఆమె తాను గులాం హైదర్ భార్యనని ప్రకటించుకున్నదని అన్నారు. 

అయితే సీమా తరపు న్యాయవాది ఏపీ సింగ్ ఇంకా సీమా హైదర్ సచిన్ భార్య అని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని ప్రశ్నించారు. ఈ కారణంగానే సీమా హైదర్ పాక్‌ భర్త గులాం హైదర్ ఆమెకు పరువు నష్టం నోటీసు పంపారని మోమిన్ మాలిక్‌ తెలిపారు. గులాం హైదర్‌ పంపిన నోటీసులో తాను సీమా హైదర్ నుండి ఇప్పటి వరకు చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదని, సచిన్ కారణంగానే తన నలుగురు పిల్లలు  తనకు దూరమయ్యారని, వారి చదువులు దిగజారుతున్నాయని ఆరోపించారు. 
 

whatsapp channel

మరిన్ని వార్తలు