స్పుత్నిక్ వీ: సీరంకు డీసీజీఐ గ్రీన్‌ సిగ్నల్‌ 

5 Jun, 2021 12:17 IST|Sakshi

దేశ ప్రజలందరికీ టీకా: శరవేంగా కేంద్రం అడుగులు

రష్యా టీకా తయారీకీ సీరంకు అనుమతులు

91.6 శాతం  సామర్థ్యంతో స్పుత్నిక్‌ వీ 

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌వేవ్‌తో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం మరో ఊరటనిచ్చింది.  రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ తయారీకి  అతిపెద్ద టీకా తయారీదారు  సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ)కు భారత ఔషధ నియంత్రణ సంస్థ  (డీసీజీఐ) అనుమతినిచ్చింది. మహారాష్ట్ర పుణేలోని  హడాస్పార్‌ తయారీ కేంద్రంలో ఈ టీకాను పరీక్షించి, విశ్లేషించి, తయారు చేస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందుకు సీరంకు ప్రాథమిక అనుమతినిచ్చామనీ, తయారీకి కొన్ని నెలలు పడుతుందని వెల్లడించింది. అయితే ఈ టీకాలను విక్రయించుకునేందుకు సీరం అనుమతి లేదని వెల్లడించాయి. దేశీయంగా  అదర్ పూనావాలా నేతృత్వంలోని సీరం  ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా టీకా కోవీషీల్డ్‌ను తయారు చేస్తోంది.

వ్యాక్సిన్‌ తయారీకి రష్యాలోని మాస్కోలో ఉన్న గమాలియా పరిశోధనా సంస్థ, సీరంతో జత కట్టింది. దీనికి సంబంధించిన పత్రాలను ఆ కంపెనీ ఇటీవల డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. వ్యాక్సిన్‌ తయారీకి డీసీజీఐ అనుమతి ఇవ్వడంతో జెనెటిక్‌ మానిపులేషన్‌ రివ్యూ కమిటీ (ఆర్‌సీజీఎం) సీరమ్‌కు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. సెల్‌ బ్యాంక్‌ను దిగుమతి చేసుకోవడం, వైరస్‌ స్టాక్‌ వివరాలను ఎలా సేకరించి భద్రపరుస్తారన్న విషయం ఆర్సీజీఎంకు తెలపాలి. అయితే ఈ అనుమతుల కోసం సీరమ్‌ గత నెల 18నే ఆర్‌సీజీఎమ్‌కు దరఖాస్తు పెట్టుకుంది. కాగా భారతదేశంలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్‌, కోవీషీల్డ్‌  వ్యాక్సిన్లతో పోలిస్తే స్పుత్నిక్‌ వీ  టీకా 91.6 శాతం సామర్థ్యం ఉందని గమాలియా ఇదివరకే ప్రకటించింది.

చదవండి:  vaccine: మినహాయింపులపై సీరం కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు