MP Ganeshamurthi Death: టికెట్‌ నిరాకరణ.. పురుగుల మందు తాగిన తమిళనాడు ఎంపీ కన్నుమూత

28 Mar, 2024 10:48 IST|Sakshi

చెన్నై:  లోక్‌సభ ఎన్నికల కోసం ఆ సిట్టింగ్‌ ఎంపీకి సీటు దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించారు ఆయన కుటుంబ సభ్యులు. అయినా మృత్యువు ఆయన్ని వదల్లేదు. ఈ ఉదయం గుండెపోటుతో ఆయన ఆస్పత్రిలోనే కన్నుమూశారు.  

మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే) పార్టీ ఎంపీ గణేశమూర్తి గురువారం ఉదయం 5.05 గంటలకు మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మార్చి 24వ తేదీన గణేశమూర్తి ఆత్మహత్య ప్రయత్నం చేయగా.. ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. 
 

డీఎంకే పార్టీతో పొత్తులో భాగంగా ఈసారి ఈరోడ్ పార్లమెంట్‌ ఎంపీ టికెట్ కేటాయించక పోవడంతో మనస్తాపం చెందారాయన. పరుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న ఆయన్ను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షల అనంతరం ఆయన్ను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరులోని ప్రై‍వేట్‌ ఆస్పత్రికి తరలించారు. 

చికిత్స పొందుతున్న సమయంలో ఆయన  గురువారం ఉదయం కార్డియాక్‌ అరెస్ట్‌కు గురై మృతి చెందారు. 2019లోక్‌సభ ఎన్నికల్లో ఈరోడ్  పార్లమెంట్‌ స్థానం నుంచి గణేశమూర్తి డీఎంకే టికెట్‌పై గెలుపొందారు. ఆయన మృతి వార్త తెలియగానే అనుచరులు స్థానికంగా బంద్‌కు పిలుపు ఇచ్చారు.

రాజకీయ నేపథ్యం:
1947 జూన్‌లో జన్మించిన గణేశమూర్తి.. 1993 నుంచి ఎండీఎంకే పార్టీలోనే ఉన్నారు. ఆయన 1998లో తొలిసారి పళని పార్లమెంట్‌ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఈరోడ్‌ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకే కూటమిలో భాగంగా ఎండీఎంకేకు ఈరోడ్‌ స్థానం దక్కింది. దీంతో ఇక్కడ దాదాపు 2 లక్షల భారీ మేజార్టీతో గెలుపొందారు.

Election 2024

మరిన్ని వార్తలు