హోటళ్లు, రెస్టారెంట్లకు తీవ్ర హెచ్చరికలు

14 Mar, 2021 13:03 IST|Sakshi

 మహారాష్ట్రలో కరోనా  మళ్లీ పంజా

నిబంధనలు పాటిస్తారా, లాక్‌డౌన్‌ విధించమంటారా : ఉద్ధవ్‌ ఠాక్రే

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మళ్లీ పంజా విసురుతోంది. రోజు రోజుకు వైరస్ కేసులు పెరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే  శనివారం తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. రాష్ట్రంలోని హోటళ్ళు, రెస్టారెంట్లు కోవిడ్‌-19 నిబంధనలను కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. కోవిడ్-19 ప్రోటోకాల్స్‌ను కఠినంగా పాటించండి, నిబంధనలు ఉల్లంఘించి కఠినమైన లాక్‌డౌన్‌ విధించే స్థితికి ప్రభుత్వాన్ని నెట్టొద్దంటూ సీఎం గట్టిగా హెచ్చరించారు. అవాంఛనీయమైన వైఖరి ఏర్పడటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇకనైనా అన్ని జాగ్రత్తలు, మార్గదర్శకాలను పాటిస్తూ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా చూడాలని  సీఎం సూచించారు.

షాపింగ్ సెంటర్లు, హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్ల ప్రతినిధులు హాజరైన వర్చువల్ సమావేశంలో ముఖ్యమంత్రి తాజా హెచ్చరికలు జారీ చేశారు.  అక్టోబర్ నుండి దశలవారీగా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పటి నుండి చాలా చోట్ల రద్దీ పెరిగిందని, రక్షణ నియమాలను పాటించడం లేదని, దీనివల్ల కేసులు బాగా పెరిగాయన్నారు. తమ ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలుకు అనుకూలంగా లేదని, కానీ ప్రస్తుత పరిస్తితుల నేపథ్యంలో అన్ని నియమాలను పాటించండి. స్వీయ క్రమశిక్షణ, ఆంక్షల మధ్య   ఉన్న తేడాను ప్రతి ఒక్కరూ గ్రహించి ప్రవర్తించాలన్నరు.న నియమాలను పాటించని కారణంగానే  కేసులు బాగా పెరుగుతున్నాయంటూ ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే కఠినమైన నిర్ణయం తీసుకోకుండా ఉండేందుకు సహకరించాలని ప్రజలను కోరారు. కాగా మహారాష్ట్రలో శనివారం నాటికి 15,602 కేసులు, 88 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 22,97,793 కు, మరణాల సంఖ్య 52,811 కు చేరుకుంది.
 

మరిన్ని వార్తలు