Parliament Huge Security Breach: ఇంతకీ పార్లమెంట్‌ భద్రత ఎవరి బాధ్యతో తెలుసా?

13 Dec, 2023 20:01 IST|Sakshi

అది దేశ చట్టసభ్యులు సమావేశం అయ్యే చోటు. అత్యున్నత చట్టాల రూపకల్పన..  పాత వాటికి సవరణలు జరిగే చోటు. కాబట్టి.. దేశంలోనే కట్టుదిట్టమైన భద్రత ఉండొచ్చని అంతా భావించడం సహజం. కానీ, రెండు దశాబ్దాల కిందట పార్లమెంట్‌ మీదే జరిగిన ఉగ్రదాడి భారత్‌కు మాయని మచ్చని మిగిల్చింది. మళ్లీ అదే తేదీన, కొత్తగా హైటెక్‌ హంగులతో తీర్చిదిద్దిన పార్లమెంట్‌ వద్ద మళ్లీ అలాంటి అలజడే ఒకటి చెరేగింది. ఏకంగా దిగువ సభ లోపల ఆగంతకులు దాడికి దిగడంతో ‘పార్లమెంట్‌లో భద్రతా తీవ్ర వైఫల్యం’ గురించి చర్చ నడుస్తోంది. 

ఇక్కడ దాడి జరిగింది లోక్‌సభలోనా? రాజ్యసభలోనా? అనేది ఇక్కడ ప్రశ్న కాదు. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం అనేది తీవ్రమైన అంశం. ఇంత విస్తృతమైన భద్రత ఉన్నప్పటికీ ఇద్దరు వ్యక్తులు లోపలికి ఎలా ప్రవేశించగలిగారు? భద్రతా ఉల్లంఘనకు ఎలా పాల్పడ్డారు? అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.. లోక్‌సభ ఘటనపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యక్తం చేసిన ఆందోళన. ఈ వాదనకు రాజ్యసభ చైర్మన్‌  జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ సైతం సానుకూల స్థాయిలోనే స్పందించడం గమనార్హం. ఇంతకీ పార్లమెంట్‌ భద్రతను పర్యవేక్షించాల్సింది ఎవరు?.. ఢిల్లీ పోలీసులా? కేంద్ర బలగాలా?.. 

మొత్తం దానిదే!
తాజా పార్లమెంట్‌ దాడి ఘటన నేపథ్యంలో ఓ సీనియర్‌ ఢిల్లీ పోలీస్‌ అధికారి ఈ అంశంపై స్పందించారు.  పార్లమెంట్‌ బయట వరకే భద్రత కల్పించడం ఢిల్లీ పోలీసుల బాధ్యత. ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్ల వద్ద భద్రత మాత్రం ఢిల్లీ పోలీసుల పరిధిలోకి రాదు. అయితే లోపలి భద్రతను మొత్తం పర్యవేక్షించేది పార్లమెంట్‌ సెక్యూరిటీ సర్వీస్‌(Parliament Security Services..PSS).  పీఎస్‌ఎస్‌ సీఆర్‌పీఎఫ్‌గానీ, మరేయిత కేంద్ర బలగాల సమన్వయంతో అంతర్గత భద్రత పర్యవేక్షిస్తుంటుంది. బహుశా ఇవాళ్టి ఘటనలో నిందితుల్ని వాళ్లే అదుపులోకి తీసుకుని ఉండొచ్చని వ్యాఖ్యానించారాయన. ఈ అధికారి వ్యాఖ్యలకు తగ్గట్లే.. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చేదాకా నిందితులు పార్లమెంట్‌ భద్రతా సిబ్బంది అదుపులోనే ఉన్నారు. ఆపై వాళ్లకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ఇంతకీ భద్రతా సంస్థల కలగలుపు  పీఎస్‌ఎస్‌ ఎలా పని చేస్తుందంటే.. 

పీఎస్‌ఎస్‌ చరిత్ర పెద్దదే..
1929 ఏప్రిల్‌ 8వ తేదీన అప్పటి పార్లమెంట్‌ భవనం సెంట్రల్‌ లెజిస్టేటివ్‌ అసెం‍బ్లీలో బాంబు దాడి జరిగింది. ఆ దాడి తర్వాత అప్పుడు సీఎల్‌ఏకు అధ్యక్షుడిగా ఉన్న విఠల్‌భాయ్‌ పటేల్‌ చట్ట సభ, అందులోని సభ్యుల భద్రత కోసం సెప్టెంబర్‌ నెలలో ‘వాచ్‌ అండ్‌ వార్డ్‌’ పేరిట ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్‌ సర్‌ జేమ్స్‌ క్రెరార్‌ ‘డోర్‌ కీపర్‌ అండ్‌ మెసేంజర్స్‌’ పేరిట 21 మంది సిబ్బందిని చట్టసభ కాంప్లెక్స్‌లో నియమించాలని  ప్రతిపాదించారు. భద్రతతో పాటు చట్ట సభ్యులకు ఏదైనా సమాచారం అందించాలన్నా వీళ్ల  సేవల్ని వినియోగించుకోవాలని సూచించారాయన. అయితే.. 

 ఆ ప్రతిపాదనకు తగ్గట్లే అప్పటి ఢిల్లీ మెట్రోపాలిటన్‌ పోలీస్‌ వ్యవస్థ నుంచి పాతిక మందిని సిబ్బందిగా, వాళ్లను పర్యవేక్షించేందుకు  ఓ అధికారిని నియమించారు. అలా ఏర్పడిన భద్రతా విభాగం.. ఆ తర్వాత స్వతంత్ర భారతంలోనూ దశాబ్దాల తరబడి కొనసాగింది. క్రమక్రమంగా అందులో సిబ్బంది సంఖ్య పెరగడం, ఇతర బలగాలతో సమన్వయం వాచ్‌ అండ్‌ వార్డ్‌ తన విధుల్ని కొనసాగిస్తూ వచ్చింది. చివరకు..


అన్నింటా కీలకంగా..
.. 2009 ఏప్రిల్‌ 19వ తేదీన వాచ్‌ అండ్‌ వార్డ్‌ను పార్లమెంట్‌ సెక్యూరిటీ సర్వీస్‌గా పేరు మార్చారు. భారతదేశ చట్ట సభ పార్లమెంట్‌ భవనం భద్రతను పూర్తిగా పర్యవేక్షించేది పీఎస్‌ఎస్‌. పార్లమెంట్‌ లోపలికి వచ్చే వాహనాలను.. వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం దగ్గరి నుంచి బయటకు వెళ్లేదాకా పూర్తి పనులు కూడా ఈ విభాగం పరిధిలోకే వస్తాయి.  స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాల సమయంలో భారత సైన్యం, ఢిల్లీ పోలీసులతో కలిసి పీఎస్‌ఎస్‌ భద్రత కల్పిస్తుంది. రాష్ట్రపతుల ప్రమాణ స్వీకార సమయంలో రాష్ట్రపతి భవన్‌ వద్ద.. అలాగే ఎట్‌ హోమ్‌ కార్యక్రమాలకు భద్రత ఇచ్చేది పీఎస్‌ఎస్సే.  రాష్ట్రపతి ఎన్నికల సమయంలో దీని పాత్ర గురించి ఎక్కువ చెప్పుకోవాలి. ఎన్నికల సంఘం, విమానాయన శాఖ(చట్ట సభ్యుల రాకపోకలు.. బ్యాలెట్‌ బాక్సుల తరలింపు), భద్రతా బలగాలతో కలిసి రాష్ట్రపతి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో పీఎస్‌ఎస్‌దే కీలక పాత్ర.  అలాగే.. ఎంపీలతో పాటు పార్లమెంట్‌కు వచ్చే వీఐపీలు, వీవీఐపీల భద్రత, స్టడీ టూర్ల మీద వచ్చే విద్యార్థులు, సందర్శించే విదేశీయులు, సాధారణ సందర్శకుల భద్రత కూడా పీఎస్‌ఎస్‌ చూసుకుంటుంది. 

స్వతంత్రంగా పని చేయదు..
పీఎస్‌ఎస్‌ అనేది పార్లమెంట్‌ భవనం పూర్తి కాంప్లెక్స్‌ భద్రతను పర్యవేక్షించే ఒక నోడల్‌ భద్రతా సంస్థ. ఢిల్లీ పోలీసులు, పార్లమెంట్‌ డ్యూటీ గ్రూప్‌/సీఆర్‌పీఎఫ్‌, ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ఎస్పీజీ, ఎన్‌ఎస్‌జీలు పార్లమెంట్‌ పరిధిలో  పీఎస్‌ఎస్‌ సమన్వయంతోనే పని చేస్తుంటాయి. అలాగని ఇది స్వతంత్రంగా పని చేయదు.  పార్లమెంట్‌ భద్రతా విభాగం సంయుక్త కార్యదర్శి పీఎస్‌ఎస్‌కు హెడ్‌గా ఉంటారు. లోక్‌సభ సెక్రటేరియట్ అదనపు సెక్రటరీ (సెక్యూరిటీ), రాజ్యసభ సెక్రటేరియట్‌ అదనపు సెక్రటరీ(సెక్యూరిటీ) విడివిడిగా వాళ్ల వాళ్ల పరిధిలో పీఎస్‌ఎస్‌ పనితీరును పర్యేవేక్షిస్తారు. 

పీఎస్‌ఎస్‌లో సిబ్బందిని డిప్యూటేషన్‌ మీద ఇతర విధులకు కూడా పంపిస్తుంటారు. అయితే అది పార్లమెంట్‌ పరిధిలోనే. పార్లమెంట్‌ విరామ సమయాల్లో సందర్శన కోసం వచ్చే విద్యార్థులకు, విదేశీయులకు పార్లమెంట్‌ చరిత్ర, గొప్పదనం గురించి, అలాగే అక్కడ ఏర్పాటు చేసే మహోన్నత వ్యక్తుల విగ్రహాల(వాళ్ల గురించి..) వివరించడం లాంటి బాధ్యతలు అప్పగిస్తుంటుంది.  పార్లమెంటరీ గార్డ్‌ డైరెక్టరేట్‌తో పాటు సభ లోపలి మార్షల్స్‌ కూడా పీఎస్‌ఎస్‌ పరిధిలోకే వస్తారు. 

మూడంచెల తనిఖీలు..
పార్లమెంట్‌ భవనం చుట్టూ పటిష్ఠమైన భద్రతా వలయం ఉంటుంది. ఎంపీలు మినహా పార్లమెంట్‌కు వచ్చే సిబ్బంది, విజిటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. సందర్శకులు విజిటర్స్‌ గ్యాలరీకి వెళ్లాలంటే మూడంచెల భద్రతా వ్యవస్థను దాటాలి. తొలుత పార్లమెంట్‌ ప్రాంగణంలోని ప్రవేశ ద్వారం వద్ద సందర్శకులను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత పార్లమెంట్‌ భవనం వద్ద ఉన్న ఎంట్రీ గేట్‌ వద్ద మరోసారి చెకింగ్స్‌ నిర్వహిస్తారు. చివరగా విజిటర్స్‌ గ్యాలరీ వెళ్లే మార్గంలోని కారిడార్‌లో మూడోసారి తనిఖీలు చేస్తారు.

ఇక, పార్లమెంట్‌లో పనిచేసే ప్రతి సెక్యూరిటీ గార్డుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వారు తోటమాలి, స్వీపర్లు సహా పార్లమెంట్‌లో పనిచేసే ప్రతి సిబ్బందిని గుర్తించేలా శిక్షణ ఇస్తారు. పార్లమెంట్‌లో పనిచేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిత్యం ఐడీకార్డులు ధరించాలి. ఇక, సమయానుసారం సిబ్బందికి కూడా భద్రతా తనిఖీలు చేస్తారు. ఇక మెటల్‌ డిటెక్టర్లు, వాహనాల రాకపోకలను నియంత్రించే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్‌లు, బాడీ స్కానర్ల వంటి అధునాతన గ్యాడ్జెట్స్‌తో పార్లమెంట్‌ పరిసరాల్లో భద్రతను ఏర్పాటు చేశారు.

అలా ఎలా..?
సాధారణ విజిటర్‌ పాస్‌ల మీదే సందర్శకులు పార్లమెంట్‌కు వస్తుంటారు. ఈ పాస్‌లు జారీ చేసేముందు బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌ కచ్చితంగా జరుగుతుంది. అందులో ఏమాత్రం లోటుపాట్లు కనిపించినా పాస్‌లు జారీ చేయరు. ప్రస్తుత దాడి ఘటనలో ఓ ఎంపీ పేరు మీద ఒక నిందితుడి పాస్‌ తీసుకున్నట్లు తేలింది. ఆ సంగతి పక్కన పెడితే.. పార్లమెంట్‌ భవనం లోపల సెక్యూరిటీ చెకింగ్‌లు, స్కానర్‌లు ఉండనే ఉంటాయి. హైసెక్యూరిటీ జోన్‌ పరిధిలో ఉండే పార్లమెంట్‌ భవనం అన్ని వైపులా సీసీ కెమెరాలు నిఘా ఉంటుంది. మరి  ఇన్నీ దాటుకుని ఆ ఇద్దరు స్మోక్‌ షెల్స్‌తో ఎలా రాగలిగారనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఇప్పుడు. 

నాడు జరిగింది ఇదే.. 
2001 డిసెంబర్‌ 13వ తేదీ గుర్తుందా?.. పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన రోజు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. 2001 డిసెంబరు 13న లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ ముఠాలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంట్‌ ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. వీరిలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు కాగా.. ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముష్కరులను హతమార్చారు. అప్పటి నుంచి పార్లమెంట్‌ భవనం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉంటోంది. అయితే డిసెంబర్‌ 13, 2023 నాటి ఘటన కొత్త పార్లమెంట్‌ భవనంలో జరిగింది. అదీ హైటెక్‌ హంగులతో, అత్యాధునిక సెక్యూరిటీ ఏర్పాట్లతో ఉంది. అయినా ఈ దాడి జరగడంపైనే తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

>
మరిన్ని వార్తలు