Delhi: జనరల్‌ టిక్కెట్‌తో ఏసీ కోచ్‌లోకి మహిళ.. ప్రతాపం చూపిన టీటీఈ!

4 Mar, 2024 09:06 IST|Sakshi

నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్ష విధించాలి.. కానీ శిక్ష పేరుతో ఒక్కోసారి అధికారులు చెలరేగిపోతుంటారు. ఇటువంటి ఉదంతమొకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఓ మహిళ జనరల్‌ టిక్కెట్‌తో రైలులోని ఏసీ కోచ్‌ ఎక్కేసింది. ఈ విషయాన్ని గమనించిన టీటీఈ ఆమెపై తన ప్రతాపం చూపాడు. ఈ ఘటన ఢిల్లీ ఎన్‌సీఆర్‌ లోని ఫరీదాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.  జనరల్‌ టిక్కెట్‌తో ఒక మహిళ జీలం ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ బోగీలోకి ఎక్కేసింది. దీనిని గమనించిన అదే రైలులోని టీటీఈ ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైలులో నుంచి తోసివేశాడు. దీంతో ఆమె రైలు- ప్లాట్‌ఫారమ్ మధ్య  చిక్కుకుపోయింది.

ఆ మహిళ ఆర్తనాదాలు విన్న పోలీసులు అతి కష్టం మీద ఆమెను కాపాడగలిగారు. బాధితురాలికి తల, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను ఝాన్సీలో ఒక వివాహానికి హాజరు కావాల్సి ఉందని, అయితే తను స్టేషన్‌కు చేరుకునే సమయానికి, రైలు నెమ్మదిగా కదులుతున్నదని, దీంతో కనిపించిన బోగీలో వెంటనే ఎక్కేశానని తెలిపింది. ఈ విషయాన్ని టీటీఈకి చెప్పినా పట్టించుకోలేదని, తగిన జరిమానా చెల్లిస్తానని తాను చెప్పినా వినకుండా రైలు నుంచి తోసివేశారని ఆమె ఆరోపించింది. కాగా ఈ ఉదంతపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

whatsapp channel

మరిన్ని వార్తలు