డాలస్‌లో బతుకమ్మ వేడుకలు, స్పెషల్‌ అట్రాక్షన్‌గా సంయుక్తా మీనన్‌

28 Oct, 2023 14:45 IST|Sakshi

డాలస్‌ నగరంలో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డాలస్‌ (టీపాడ్‌) ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించింది. సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను సంయుక్తంగా ఫ్రిస్కో పట్టణ పరిధిలోని కొమెరికా సెంటర్‌లో వైభవంగా జరిపించింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన కార్యక్రమం ఆసాంతం జనం రాకతో సందడిగా మారింది. సుమారు 12వేల మంది ఈ వేడుకల్లో భాగస్వాములైనట్టు టీపాడ్‌ బృందం తెలిపింది. ఫౌండేషన్‌ కమిటీ చైర్‌ రఘువీర్‌ బండారు, బీవోటీ చైర్‌ సుధాకర్‌ కలసాని, ప్రెసిడెంట్‌ లింగారెడ్డి అల్వ, కోఆర్డినేటర్‌ రోజా ఆడెపు నేతృత్వంలో నిర్వహించిన ఈ సంబరాల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. 

బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్‌ సంయుక్తామీనన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మగువలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సెంట్రల్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. అనంతరం దుర్గామాతను ప్రతిష్టించి నిర్వాహకులు శమీపూజలు నిర్వహించి అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు. దసరా పండుగ రోజు బంగారంలా భావించే శమీపత్రాలను ఒకరినొకరు పంచుకుని అలయ్‌బలయ్‌ తీసుకున్నారు.

ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన
అనంతరం కళాకారుల బృందం అమ్మవారి మహాశక్తిని నృత్యరూపకంగా ప్రదర్శించి గూస్‌బంప్స్‌ తెప్పించింది. అటు డ్యాన్సర్లు, ఇటు గాయకుల అలుపెరగని ప్రదర్శనతో కార్యక్రమం మరింత కనులవిందుగా, వీనులవిందుగా మారింది. సింగర్స్‌ సమీర భరద్వాజ్‌, పృథ్వీ, ఆదిత్య, అధితీ భావరాజు.. దాదాపు 3 గంటల పాటు తమ పాటలతో మనసునిండా పండుగ తృప్తితో పాటు సాంత్వన కలిగిస్తూ కొత్త శక్తిని నింపారు. 

జాతరను తలపించిన కొమెరికా సెంటర్‌
కార్యక్రమంలో భాగంగా బైక్‌రాఫెల్‌, 10 గ్రాములు, 5 గ్రాములు, 2 గ్రాముల గోల్డ్‌రాఫెల్‌ను సినీనటి సంయుక్తామీనన్‌ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. జాతరకు ఏమాత్రమూ తీసిపోదన్నట్టు వెలిసిన వెండర్‌బూతలు ఆసాంతం రద్దీతో కనిపించాయి. కొమెరికా సెంటర్‌లోకి అడుగుపెట్టేందుకు తొక్కిసలాట జరగకుండా నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు