బతుకమ్మ పండగకు అరుదైన గౌరవం,గవర్నర్‌ ఆదేశాలు జారీ

28 Oct, 2023 11:38 IST|Sakshi

అట్లాంటా: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ‘బతుకమ్మ’ పండగకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని జార్జియాలో బతుకమ్మ పండగను గుర్తిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్‌ బ్రెయిన్‌ పి.కెంప్‌ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్‌ 3వ వారాన్ని బతుకమ్మ వారంగా ప్రకటించారు. ఈ ప్రకటనపై పలువురు తెలంగాణ అసోసియేషన్‌ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆడపడుచులంతా ఒక్కచోట చేరి ఎంతో ఘనంగా పండగను జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా అక్టోబర్‌ 15 నుంచి ఈనెల 23 వరకు 9రోజుల పాటు బతుకమ్మ పండగను జరుపుకున్న సంగతి తెలిసిందే.తెలంగాణ అస్తిత్వానికి,సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ సంబరాలు ఏటా పెతర అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.

ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పూలతో కూడిన అమరిక బతుకమ్మ.బతుకమ్మను పేర్చడంలోని తీరొక్క పువ్వుకు తీరొక్క శాస్త్రీయత కనబడుతుంది. ప్రకృతిలోని పూలన్నింటికి ఔషధ గుణాలుంటాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. బతుకమ్మను చెరువులోగానీ కుంటలోగాని నిమజ్జనం చేసినప్పుడు రోగ నిరోధక శక్తితో నీరు ఔషధ గుణాలు పొందుతుందని అంటారు. కాకతీయుల కాలం అంటే సుమారు  12 వ శతాబ్దం నుంచి ఈ పండుగ ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి.  కాలంలో పువ్వులను బతుకుగా భావించి పూజించేవారు.

ఇప్పటికీ అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు.తొమ్మిదిరోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు 9 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. విదేశాల్లో ఉన్నా తెలంగాణ ఆడపడుచులంతా ఒకచోట చేరి బతుకమ్మ ప్రాముఖ్యతను చాటుకుంటారు.  జార్జియాలోనూ ప్రతి ఏడాది జార్జియా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా బతుకమ్మ పండగను జరుపుకుంటారు. 

మరిన్ని వార్తలు