టీపాడ్‌ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగువారి వనభోజనం

28 May, 2023 10:33 IST|Sakshi

సందడిగా మారిన పైలట్‌ నాల్‌ పార్క్‌

ఫ్లాష్‌మాబ్‌తో 2500 మందికి స్వాగతం పలికిన తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన ఆఫ్‌ డాలస్‌

డాలస్‌ మురిసేటట్టు..  ప్రకృతి పరవశించేటట్టు.. తెలుగువారి వనభోజనం అమెరికాలోని డాలస్‌ మహానగరంలో జాతరను మరిపించింది. తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన ఆఫ్‌ డాలస్‌ (టీపాడ్‌) ఆధ్వర్యంలో ఆర్గైల్‌లోని పైలట్‌ నాల్‌ పార్క్‌ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఇక్కడ స్థిరపడిన తెలుగువారి హృదయాలను ఆకట్టుకున్నది. టీపాడ్‌ బృందం సభ్యులు ఫ్లాష్‌మాబ్‌తో హుషారు నింపుతూ సుమారు 2500 మంది అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. షడ్రసోపేతమైన భోజనాన్ని వడ్డించడమే కాకుండా వీనులవిందైన సంగీతం, నయనానందకరమైన నృత్య ప్రదర్శనలతో మరపురాని వినోదాన్ని పంచారు.

అందాల సరస్సు చెంత ఏర్పాటు చేసిన ఈ ఆటవిడుపు కార్యక్రమం అందరి చింతలను పక్కనపెట్టి హాయిగొలిపిందనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత దగ్గరి బంధువులను కలుసుకున్న అనుభూతితో పాటు ప్రతి ఒక్కరిలో ఆత్మీయత ప్రస్ఫుటమైంది. అనుబంధాలను నెమరువేసుకున్నారు. చిన్నా, పెద్దా ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా టీపాడ్‌ బృందం సభ్యులు కార్యక్రమాన్ని అద్భుతంగా రూపొందించారు. విభిన్నంగా స్టేజ్‌ నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. డల్లాస్‌ యువత ఒకరిని మించి మరొకరు పోటాపోటీగా నృత్య ప్రదర్శనలిచ్చి అతిథులను అలరించారు. సరస్సు ఒడ్డున 60 ఎకరాల్లో విస్తరించిన పైలట్‌ నాల్‌ పార్క్‌... 2500 మంది తెలుగువారితో రద్దీగా, కళకళలాడుతూ కనిపించింది.

హైదరాబాదీ దమ్‌-చికెనబిర్యానీ, బగారారైస్‌, పచ్చిపులుసు, పికిల్స్‌.. తెలంగాణ టేస్ట్‌ను ఎంజాయ్‌ చేసేందుకు జనం ఉత్సాహం చూపించారు. భోజనానికి బారులు తీరకుండా, నిమిషాల తరబడి ఎదురుచూసే పరిస్థితి లేకుండా నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం అందరి ప్రశంసలు అందుకున్నది. తెలుగురాషా్ట్రల్లో జాతరలప్పుడు ప్రత్యేక దుకాణాలు కొలువుదీరిన రీతిలో.. ఇక్కడ 17 వెండర్‌బూత్‌లకు అవకాశం కల్పించారు. ఫేస్‌ పెయింటింగ్‌, మెహందీ ఆర్టిస్టులకు భలే డిమాండ్‌ లభించింది. కార్యక్రమంలో భాగంగా రఫెల్‌ ప్రైజులు అందజేశారు. టీపాడ్‌ వనభోజన కార్యక్రమానికి ఏటేటా విశేష స్పందన లభిస్తుండడంతో.. ఈ ఏడాది ఇంకా వినూత్నంగా ఆర్గనైజ్‌ చేయాలన్న టీపాడ్‌ సభ్యుల ఆరువారాల కసరత్తుకు అందరి మద్దతు దొరకడమే కాకుండా ఊహించని ఆదరణ లభించడం విశేషం. 

టీపాడ్‌ ఘనంగా నిర్వహించిన ఈ వనభోజన కార్యక్రమాన్ని రఘవీర్‌ బండారు (చైర్‌ ఆఫ్‌ ఫౌండేషన కమిటీ), సుధాకర్‌ కలసాని (చైర్‌ ఆఫ్‌ బీవోటీ), లింగారెడ్డి ఆల్వ (ప్రెసిడెంట్‌), రోజా ఆడెపు (కోఆర్డినేటర్‌) మార్గదర్శకత్వంలో మధుమతి వైశ్యరాజు సమన్వయం చేశారు. రావు కల్వల, అజయ్‌రెడ్డి, ఉపేందర్‌ తెలుగు, రవికాంతరెడ్డి మామిడి (మాజీ అధ్యక్షుడు).. ఈవెంట్‌ ఆద్యంతం సజావుగా సాగేలా నిరంతరం పర్యవేక్షించారు. ఉమ గడ్డం నేతృత్వంలో మాధవి సుంకిరెడ్డి, ఇందు పంచరుపుల, లక్ష్మి పోరెడ్డి, రూప కన్నయ్యగారి, మంజుల తొడుపునూరి, రేణుక చనుమోలు, నరేష్‌ సుంకిరెడ్డి, అశోక్‌ కొండల, విజయ్‌ తొడుపునూరి, శ్రీధర్‌ వేముల, గోలి బుచ్చిరెడ్డి స్వయంగా వండివార్చారు.

ఆడియో, వీడియో, సోషల్‌మీడియా వ్యవహారాల ఇనచార్జిగా అనురాధ మేకల (టీపాడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌) వ్యవహరించారు. మాధవి లోకిరెడ్డి సాంస్కృతిక కార్యక్రమాలను సమన్వయం చేశారు. స్వప్న తుమ్మకాల, గాయత్రి గిరి, హరిశంకర్‌ రేసు, శివ కుడిత్యాల, బాల గనపవరపు.. బహుమతులు, పూజలు, ఇతరత్రా బాధ్యతలు చూసుకున్నారు.

అతిథులందరూ లొట్టలేసుకుటూ తినేలా గ్రిల్డ్‌ స్వీట్‌కార్న్‌, చికెనబార్బిక్యూను అప్పటికప్పుడు వేడివేడిగా అందించేందుకు శ్రమించిన కరన పోరెడ్డి, రత్న ఉప్పల, శ్రీనివాస్‌ అన్నమనేని, సురేందర్‌ చింతల, ఆదిత్య గాదెలకు పలువురి నుంచి ప్రశంసలు దక్కాయి.  వనభోజనం ఆసాంతం సజావుగా, అంచనాలకు మించి విజయవంతంగా సాగడానికి కారకులైన స్పాన్సర్లకు, తెలుగువారందరికీ టీపాడ్‌ బృందం కృతజ్ఞతలు తెలిపింది.

మరిన్ని వార్తలు