సీఎం జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

25 Feb, 2023 08:58 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి

కాసు బ్రహ్మానందరెడ్డికి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వటం సంతోషం, ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి

దాచేపల్లి: పల్నాటికి గుండెకాయలాంటి అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేకి కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌వేగా నామకరణం చేయటం శుభపరిణామం అని గురజాల శాసనసభ్యుడు కాసు మహేష్‌రెడ్డి అన్నారు. దాచేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కాసు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు దివంగత సీఎం కాసు బ్రహ్మనందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌వేగా నామకరణం చేయటాన్ని యావత్తు పల్నాడు ప్రజానీకం హర్షిస్తుందని చెప్పారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ తాము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని అన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన బ్రహ్మనందరెడ్డి రాజకీయంగా ఎదిగారని గుర్తు చేశారు. నాగార్జునసాగర్‌, పోచంపాడు ప్రాజెక్ట్‌లకు అత్యధికంగా నిధులు తెచ్చి సకాలంలో పూర్తిచేసేలా కృషి చేశారని, హైదరాబాద్‌లాంటి మహానగరంలో భారీ పరిశ్రమలు రావటానికి బ్రహ్మనందరెడ్డి కృషి చేశారని చెప్పారు.

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపనకు నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని తీసుకువచ్చిన ఘనత బ్రహ్మనందరెడ్డికే దక్కుతుందని, పేదవారికి ఇళ్లు కట్టించేందుకు ఎల్‌ఐసీ ద్వారా రుణాలు తీసుకువచ్చి పేదల సొంతింటి కలను సాకారం చేశారని పేర్కొన్నారు. సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్‌ కొప్పుల సాంబయ్య, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, ఎంపీపీ కటకం జయశ్రీ, వైస్‌ ఎంపీపీలు కందుల జాను, తండా అబ్దుల్‌సత్తార్‌, వైస్‌ చైర్మన్‌ షేక్‌ ఖాదర్‌బాషా, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోట కృష్ణ, షేక్‌ సుభానీ, మాజీ సర్పంచ్‌ బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డి, యార్డు మాజీ చైర్మన్‌ మునగా నిమ్మయ్య, కౌన్సిలర్లు చాట్ల క్రాంతికుమార్‌, మందపాటి వీరారెడ్డి, నాగుబండి గురువులు, ఈదా వెంకటరెడ్డి, నాయకులు కుందురు తిరుపతిరెడ్డి, ముశ్యం వెంకటేశ్వర్లు, సూర్రెడ్డి తదితరులున్నారు.

మరిన్ని వార్తలు