17న తుక్కుగూడ సభకు సోనియా.. పరేడ్ గ్రౌండ్ సభకు అమిత్‌షా?

7 Sep, 2023 13:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఈసారి సెప్టెంబర్‌ 17వ తేదీ.. తెలంగాణ రాజకీయాలు జాతీయస్థాయిలో చర్చకు కేంద్ర బిందువు కానుంది. కాంగ్రెస్‌-బీజేపీలు పోటాపోటీ బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్‌ తుక్కుగూడలో.. బీజేపీ సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో పెద్ద ఎత్తున జనంతో సభలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నాయి. తుక్కుగూడ సభకు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరవుతారని పార్టీ ప్రకటించగా.. పరేడ్‌గ్రౌండ్‌లో విమోచన దినోత్సవ వేడుకలకు కిందటి ఏడాదిలాగే అమిత్‌ షా హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  

ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. పది లక్షల మంది ఈ సభకు హాజరు అవుతారని కాంగ్రెస్‌ పార్టీ ముందస్తుగానే ప్రకటించింది. తుక్కుగూడను అందుకు వేదికగా ఎంచుకుంది. ఆ తేదీ, అంతకు ముందు రోజు నగరంలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగబోతున్నాయి.  సోనియా గాంధీ సైతం తుక్కుగూడ సభకు హాజరు కానున్న నేపథ్యంలో.. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది తెలంగాణ పీసీసీ.   

అయితే.. కాంగ్రెస్‌ తుక్కుగూడ సభకు పోటీగా బీజేపీ సైతం నగరంలో సభను ప్లాన్‌ చేసింది. పరేడ్‌ గ్రౌండ్‌లోనే తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను కిందటి ఏడాది తరహాలోనే కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించాలని.. ఈ క్రమంలో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. వీలైనంత ఎక్కువ జనసమీకరణ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఒకేరోజు.. అదీ తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ దినం రాగానే హైదరాబాద్‌ నగరంలో పోటాపోటీగా కాంగ్రెస్‌, బీజేపీ కార్యక్రమాలకు పోటీ పడుతుండడం.. రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇరు పార్టీలు  కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుంటాయనేది ఊహించిందే అయినప్పటికీ.. పరస్పర విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయనేది చర్చనీయాంశంగా మారిందిప్పుడు. 

ఇదీ చదవండి:  ఎటూ తేలలేదు.. 100 సీట్లలో ఒక్కో పేరే!

మరిన్ని వార్తలు