‘తూర్పు’లో తలకిందులు! తలో దారీ వెతుక్కుంటున్న కూటమి నేతలు

29 Mar, 2024 05:22 IST|Sakshi

తలో దారీ వెతుక్కుంటున్న కూటమి నేతలు.. పార్టీల శ్రేణుల్లో నిస్తేజం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రజల్లో ఆదరణ కోల్పోయిన తెలుగుదేశం పార్టీ తిరిగి జవసత్వాలు నిలుపుకునేందుకు జనసేన, బీజేపీతో కలిసి కట్టిన కూటమితో మొదటికే మోసం వచ్చేలా ఉందని తెలుగు తమ్ముళ్లు కలవరపడుతున్నారు. ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన దగ్గర నుంచి నియోజకవర్గాల కేటాయింపు వరకూ చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ  పునాదులు కదిలిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 21 నియోజకవర్గాల్లో దాదాపు మూడు వంతుల నియోజకవర్గాల్లో టీడీపీ మూడు ముక్కలైపోయింది.

ఆ పార్టీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు తలో దారీ వెతుక్కుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక, కూటమిలో ఉన్న బీజేపీ, జనసేనలకు సీట్ల కేటాయింపు వంటి పరిణామాలు పార్టీ నేతల మధ్య మరింత అగ్గి రాజేశాయి. వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావానికి ముందు వరకూ టీడీపీకి పట్టుగొమ్మగా నిలిచిన ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడానికి సైకిల్‌ పార్టీ తలకిందులుగా తపస్సు చేస్తోంది. తొలి నుంచీ నియోజవకర్గాల్లో పార్టీని నడిపిస్తున్న నేతలను విస్మరించి, పైసలున్న వారికే సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వడంతో నేతల మధ్య వర్గ వైషమ్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి.

వీటిని చక్కదిద్దలేక అధిష్టానం చేతులెత్తేయడంతో పార్టీ శ్రేణులు డోలాయమానంలో పడ్డాయి. ద్వితీయ శ్రేణి నాయకత్వం చెల్లాచెదురు కావడంతో క్షేత్ర స్థాయిలో టీడీపీ పేకమేడలా కూలిపోతోంది. రాజకీయాల్లో తూర్పు సెంటిమెంట్‌ను బలంగా విశ్వసించే తుని మొదలు గోదావరికి అవతల ఒడ్డున కొవ్వూరు వరకూ ఏ అసెంబ్లీ సెగ్మెంట్‌ చూసినా వర్గ వైషమ్యాలతో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీనే కనిపిస్తోంది.

► కొవ్వూరులో ఉమ్మడి అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు బరిలో ఉంటే.. పోటీగా అదే పార్టీ నుంచి మాజీ మంత్రి, టీడీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కేఎస్‌ జవహర్‌ బస్తీ మే సవాల్‌ అంటున్నారు. సీటు ఇవ్వలేదనే ఆగ్రహంతో ఉన్న జవహర్‌కు చంద్రబాబు తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. అంతటి పదవి జవహర్‌కు ఇవ్వడం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పెండ్యాల అచ్చిబాబు వర్గానికి సుతరామూ ఇష్టం లేదు. ఈ రెండు గ్రూపులతో ద్వితీయ శ్రేణి నేతలు తలోదారిలో పయనిస్తుండటంతో పార్టీ ముక్కలైంది.

► ఇదే జిల్లాలో జనసేనకు కేటాయించిన నిడదవోలులోనూ టీడీపీ ముక్కలైంది. ఇక్కడి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గ టీడీపీలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కుందుల సత్యనారాయణ గ్రూపులు నడుస్తున్నాయి. మొదట్లో బెట్టు చేసిన శేషారావు అనంతర పరిణామాల్లో దుర్గేష్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. శేషారావుతో తొలి నుంచి ఉన్న వైరుధ్యంతో కుందుల సత్యనారాయణ ఎడముఖంపెడముఖంగా ఉంటున్నారు. దుర్గేష్‌కు మాజీ ఎమ్మెల్యే శేషారావు సహకరిస్తుండటాన్ని కుందుల వ్యతిరేకిస్తున్నారు. శేషారావును నమ్ముకుంటే దుర్గేష్‌ను నట్టేట ముంచేస్తారని కుందుల వర్గీయులు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. 

► గోపాలపురం నియోజకవర్గంలోనూ వర్గపోరు కనిపిస్తోంది. ఉమ్మడి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజుకు వ్యతిరేకంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జెడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు వర్గం పని చేస్తోంది. ‘మద్దిపాటి వద్దు.. మరెవరైనా ముద్దు’ అనే నినాదంతో బాపిరాజు వర్గం మద్దిపాటిని మార్చకుంటే నాలుగు రోజుల్లో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తోంది. ఫలితంగా ఈ నియోజకవర్గంలో టీడీపీ రెండుగా చీలిపోయింది. సర్వేలో మద్దిపాటి గ్రాఫ్‌ పడిపోయిందని, అభ్యర్థిని మారుస్తున్నట్లు చంద్రబాబు చెప్పి చివరిలో మోసం చేశారని పేర్కొంటూ వ్యతిరేక వర్గం వేరుకుంపటి పెట్టింది.

► కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం సీటును పొత్తులో భాగంగా జనసేనకే కేటాయిస్తారని ఆది నుంచి ఆ పార్టీ కో–ఆరి్డనేటర్‌ శెట్టిబత్తుల రాజబాబు ఆశించి భంగపడ్డారు. చివరకు దీనిని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు కేటాయించారు. టీడీపీలో మొదటి నుంచి ఈ సీటు ఆశిస్తున్న పరమట శ్యామ్‌ రేసులో ఉన్నా ఫలితం దక్కలేదు. పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నా కనీస గుర్తింపూ లేదంటూ శ్యామ్‌ వర్గం తిరుగుబాటు జెండా ఎగురవేసి, ఆనందరావు ఓటమే ధ్యేయంగా పని చేస్తామని చెబుతోంది.

► చంద్రబాబు ఆదేశాలతో రామచంద్రపురంలో మకాం పెట్టి, సీటుపై గంపెడాశలతో దాదాపు రెండేళ్లుగా టీడీపీకి సేవ చేస్తున్న బీసీ నాయకుడు, శాసన మండలి మాజీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యానికి చివరకు మొండిచేయి చూపించారు. అకస్మాత్తుగా టీడీపీ తీర్థం పుచ్చుకున్న వాసంశెట్టి సుభాష్‌కు కేవలం ధన బలం ఉందనే కారణంతో ఈ సీటు ఇచ్చారు. దీంతో సుబ్రహ్మణ్యం వర్గం రగిలిపోతోంది. ఇక్కడ కూడా పార్టీలోని ముఖ్య నేతలంతా రెండు వర్గాలుగా విడిపోయారు.

► కాకినాడ రూరల్‌లోనూ టీడీపీ ముక్కలైంది. ఈ సీటును జనసేనకు కేటాయించారు. టీడీపీలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్యనారాయణ ఒక వర్గంగా, జెడ్పీటీసీ పేరాబత్తుల రాజశేఖర్, వాసిరెడ్డి ఏసుదాసు మరో వర్గంగా, పెంకే శ్రీనివాసబాబా మరో వర్గంగా ఉండటంతో ఇక్కడ కూడా టీడీపీ 3 వర్గాలుగా మారింది.

► పిఠాపురంలో ఉమ్మడి అభ్యర్థిగా పవన్‌కళ్యాణ్‌ పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ నెల 30న ప్రచారం కూడా ప్రారంభిస్తామని చెప్పుకున్నారు. ఆయనకు మద్దతు ఇచ్చేది లేదన్న టీడీపీ ఇన్‌చార్జి ఎస్‌వీఎ‹స్‌ఎన్‌ వర్మ తరువాత మాట మార్చి, లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించే బాధ్యత తీసుకుంటానని ప్రకటించడంతో పార్టీ నేతలను విస్మయానికి గురి చేసింది. తదనంతరం పిఠాపురంలో తనను కాద­ని నిర్ణయం తీసుకోవద్దనే హెచ్చరికలతో తెలుగు తమ్ముళ్లు దూరమై మరో వర్గంగా విడిపోయారు. ఇలా ఉమ్మడి జిల్లాలో అనేకచోట్ల టీడీపీ మూడు ముక్కలైపోవడంతో పార్టీలో నిస్తేజం ఆవరించింది.

► అనపర్తిని బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో టీడీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మొదటి జాబితాలో టీడీపీ నుంచి సీటు ప్రకటించారు. అనంతర పరిణామాల్లో చివరకు బీజేపీకి చెందిన శివరామకృష్ణరాజు పేరు ప్రకటించారు. దీంతో చంద్రబాబుపై నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు నిప్పులు చెరుగు­తూ శాపనార్థాలు పెడుతున్నారు. నల్లమిల్లితో పొసగని పెండ్యాల నళినీ­కాంత్‌ వర్గం బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజును బలపరుస్తూ, ప్రత్యర్థి వర్గాన్ని దెబ్బ తీసేందుకు యత్నిస్తోంది. దీంతో అనపర్తిలోనూ టీడీపీ నిట్టనిలువునా చీలిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

► తునిలో యనమల రామకృష్ణుడు సోదర ద్వయం మధ్య తలెత్తిన తీవ్ర విభేదాలతో టీడీపీ రెండుగా విడిపోయింది. ఇక్కడ సీటు ఆశించి భంగపడిన కృష్ణుడిని అన్న రామకృష్ణుడు, ఆయ­న కుమార్తె, ప్రస్తుత అభ్యర్థి దివ్య దూరం పె­ట్టారు. దీంతో రగిలిన వైషమ్యాలు కాస్తా పార్టీ నిట్టనిలువుగా చీలిపోయే దిశగా తీసుకెళ్తున్నాయి.

► కాకినాడ సిటీ సీటును మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు కేటాయించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న మాజీ మేయర్‌ సుంకర పావని వర్గం దూరంగా ఉంది. కొండబాబు కోసం పని చేసేది లేదని తెగేసి చెబుతోంది. మరోవైపు ఈ సీటు ఆశించిన కొండబాబు అన్న సత్యనారాయణ కుటుంబమూ పైకి సోదరుడితో కలిసి ఉన్నట్టు కనిపిస్తున్నా తెర వెనుక గోతులు తీస్తోంది. 

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers