‘బండి’ నెట్టుకొస్తారా..?

5 Nov, 2023 20:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కమలదళం రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ పార్టీని పరుగులు పెట్టించారు. కాని బీజేపీ హైకమాండ్‌ బండిని పక్కకు జరిపి.. ఆతర్వాత చేతులు కాల్చుకుంది. జరగాల్సిన నష్టం జరిగాక దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. రెండో స్థానం అనుకున్న పార్టీ మూడో స్థానానికి వెళ్ళిపోవడంతో..మళ్ళీ రెండో స్థానం కోసం పోరాడుతోంది. అందులో భాగంగానే బండి సంజయ్‌ను ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించింది. ఆయనకు ఓ హెలికాప్టర్‌ను కూడా రెడీ చేసింది. స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర మంతటా తిరగాల్సిన బండి తాను పోటీ చేస్తున్న కరీంనగర్‌కు న్యాయం చేయగలరా? కరీంనగర్‌లో బీజేపీ పరిస్థితి ఏంటి? 

కరీంనగర్ ఎంపీగా ఉన్న, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌..అసెంబ్లీ బరిలో దిగేందుకు అంత ఆసక్తి చూపడంలేదు. అయితే పార్టీ హైకమాండ్‌ ఆయన పేరు ప్రకటించడంతో పోటీ చేయక తప్పడంలేదు. గతంలో అసెంబ్లీలో ఓడినా...ఎంపీగా విజయం సాధించారు. బండికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం అసలు ఇష్టం లేదంటూ కరీంనగర్‌ పార్టీ సర్కిల్స్‌లో చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఇందుకు చాలా కారణాలు చెబుతున్నారు. బండి సంజయ్ కి, సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూ మధ్య కుటుంబాల పరంగా మంచి సంబంధాలున్నాయి. ఈసారి ఇద్దరి మధ్యా కుదిరిన లోపాయికారీ ఒప్పందాల ప్రకారం ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా బరిలో ఉండాలనుకున్నారంటూ జనంలో బాగా ప్రచారంలోకి వచ్చాయి. ఇదేకాకుండా..ఇప్పటికిప్పుడు బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేకపోవడం.. ఎమ్మెల్యేగా కష్టపడి గెల్చినా ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావడమే తప్ప ఒరిగేదేమీ లేదనే బండి అసెంబ్లీ బరిలో దిగేందుకు ఆసక్తి చూపడంలేదు. పైగా ప్రధాని మోదీ హవాతో రెండోసారి ఎంపీగా గెలవడం తేలికగా ఉంటుందని కూడా బండి సంజయ్‌ భావిస్తున్నారు.

ఎన్నికల ఖర్చులు తడిసి మోపెడవుతున్న తరుణంలో గంగుల కమలాకర్‌ను తట్టుకోవడం సాధ్యమా అనే ఆందోళన కూడా బండిని వెంటాడుతోంది. ఇప్పుడు ఎమ్మెల్యేగా బరిలో ఉండి, ఆ తర్వాత మళ్లీ ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే ఖర్చులు భారీగా చేయాల్సి వస్తుందని కూడా ఆయన ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేగా ఓటమిపాలైతే.. రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి, ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తన ఉనికికి ఏమైనా ప్రమాదమా అనే సందేహాలు ఆయనకు కలుగుతున్నాయి. నేరుగా ఎంపీగా బరిలోకి దిగి గెలిస్తే ఇప్పటికే తనకు వచ్చిన ఇమేజ్ తో కేంద్రమంత్రి కావచ్చని కూడా బండి సంజయ్ ఆశిస్తున్నారు. తాననుకున్నంత బలంగా కరీంనగర్ లో క్యాడర్ క్షేత్రస్థాయిలో ఉందో, లేదోనన్న అనుమానం..ఇప్పటికే కొందరు పార్టీ కార్పొరేటర్లు కారెక్కేయడం వంటి అనేక కారణాలు.. బండిని అసెంబ్లీ బరిలో నిలవడానికి వెనుకంజ వేసేలా చేస్తోందనే చర్చ జరుగుతోంది.

కరీంనగర్ అసెంబ్లీ బరిలో నిలవడానికి పలు కారణాలతో వెనుకాముందవుతున్న బండి.. స్టార్ క్యాంపెయినర్ గా బీజేపీ పెద్దలు ఏర్పాటు చేసిన హెలిక్యాప్టర్ సుడిగాలి పర్యటనలు చేయడం వల్ల..మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ ఏమైనా బలపడుతుందా..? బీజేపీ కచ్చితంగా ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల్లోనైనా గెలిచే అవకాశాలుంటాయా..? అనే చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో బండిని రాష్ట్రాధ్యక్షుడి బాధ్యతల నుంచి పక్కకు జరిపిన ఎఫెక్ట్.. స్టార్ క్యాంపెయినర్ గా బండి పర్యటనలపై ఉంటుందా..? రాష్ట్రాధ్యక్షుడి స్థాయిలో కేడర్‌ను, ప్రజల్ని ప్రభావితం చేసినంతగా.. స్టార్‌ క్యాంపెయినర్ గా  బండి సంజయ్ చేయగలరా..? హెలికాప్టర్‌లో సుడిగాలి పర్యటనలతో స్టార్ క్యాంపెయినర్ పాత్ర పోషించనున్న బండి సంజయ్.. తాను నిల్చునే నియోజకవర్గంపై ఎంత వరకు ఫోకస్ చేయగలరు..? బండి కాలికి బలపం కట్టుకుని తిరిగినా..మంత్రి గంగుల కమలాకర్‌పై గెలవడమంటే సవాలే. తాను రాష్ట్రమంతా తిరగడం వల్లే కరీంనగర్ లో కాన్సంట్రేట్ చేయలేకపోయానని ఆ తర్వాత చెప్పుకోవడానికి ఈ స్టార్ క్యాంపెయినర్ పదవి ఉపయోగపడుతుందా..? అంటే అనేక ప్రశ్నలతో కూడిన విశ్లేషణలు కరీంనగర్‌లో జరుగుతున్నాయి.

తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నపుడు పార్టీని పరుగులు తీయించిన బండి...స్టార్ క్యాంపెయినర్‌గా కూడా ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేరుస్తారా? అసలు కరీంనగర్‌లో స్వయంగా ఆయన గెలుస్తారా? అనే చర్చ కమలదళంలో ఆసక్తికరంగా చర్చలు సాగుతున్నాయి. అటు రాష్ట్ర పార్టీ విషయంలో...ఇటు స్వంత నియోజకవర్గంలో ఎదురయ్యే సవాళ్ళను బండి ఎలా ఎదుర్కొంటారనే డిస్కషన్ కూడా జరుగుతోంది.
 

మరిన్ని వార్తలు