బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల దుష్ప్రచారం నమ్మొద్దు

12 Feb, 2024 04:04 IST|Sakshi
చందుర్తి మండలం కట్టలింగంపేటలో విలేకరులతో మాట్లాడుతున్న బండి సంజయ్‌

బీఆర్‌ఎస్‌ నాయకుల అవినీతిపై కాంగ్రెస్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు

పాదయాత్రలో బండి సంజయ్‌

చందుర్తి (వేములవాడ): రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుస్తుందని సర్వేలు చెబుతుండడంతో రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. దీనిని ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఆదివారం బండి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కట్టలింగంపేటలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు కుట్రలు చేస్తున్నాయని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకుంటాయన్న ప్రచారం నమ్మొద్దని కోరారు.

స్వయం ప్రకటిత మేధావి గత ఎన్నికల్లో ఎక్కడి నుంచో వచ్చి కరీంనగర్‌లో పోటీ చేశాడని, ఇప్పుడు సైతం ఇక్కడ ఎంపీగా గెలుస్తానని కలలు కంటున్నాడని విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టు నాణ్యత లోపించి కూలేందుకు సిద్ధమైందని చెబుతున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, అవినీతి, అక్రమాలకు పాల్పడిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ రెండు నెలల పాలనతో ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి మోసపోయామని భావి స్తున్నారని తెలిపారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలకు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega