అసెంబ్లీ ఉప ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

29 Mar, 2024 19:17 IST|Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలతోపాటు జార్ఖండ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. రాజస్థాన్‌లోని బగిదోర అసెంబ్లీ నుంచి సుభాష్ తంబోలియాకు టికెట్ ఇవ్వగా, గాండే అసెంబ్లీ నుంచి దిలీప్ కుమార్ వర్మను పోటీకి దింపింది.

ఏప్రిల్ 26న రాజస్థాన్‌లోని బగిదోర అసెంబ్లీలో ఉప ఎన్నిక జరగనుండగా, గాండే అసెంబ్లీకి మే 20న ఉప ఎన్నిక జరగనుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. దాదాపు 96.8 కోట్ల మంది ప్రజలు 12 లక్షలకు పైగా పోలింగ్ స్టేషన్లలో రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి.  ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.

రాజస్థాన్‌లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ రెండు దశల్లో పోలింగ్‌ జరగనుంది. ఫేజ్ 1లో ఏప్రిల్ 19న 12 స్థానాలకు పోలింగ్ జరగనుండగా, మిగిలిన 13 స్థానాలకు రెండో దశలో ఏప్రిల్ 26న పోలింగ్ జరుగుతుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికలలో కాషాయ పార్టీ 24 సీట్లు గెలుచుకోగా రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ కేవలం ఒక  సీటు మాత్రమే పొందగలిగింది.

Election 2024

మరిన్ని వార్తలు