బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకం

19 Oct, 2023 07:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా నియామకమయ్యారు. అలాగే, ఒడిశా గవర్నర్‌గా బీజేపీ నేత, జార్ఖండ్‌ మాజీ సీఎం రఘుబర్‌దాస్‌ నియమిస్తూ కేంద్రంలోకి బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇక, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన నల్లు ఇంద్రసేనారెడ్డి 1956లో జన్మించారు. ఆయన హైదరాబాద్‌లోని మలక్‌పేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1985, 1999 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందడమేకాగా, అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా వ్యవహరించారు. 2003-07 వరకు బీజేపీ ఉమ్మడి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2014లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. 2020లో బీజేపీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. ఇటీవలే ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, చేరికల కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు.

ఇదిలా ఉండగా, ఇప్పటికే తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్‌గా ఉన్నారు. ఇంద్రసేనారెడ్డి తరువాత దత్తాత్రేయ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక, జార్ఖండ్‌ బీజేపీ నేత అయిన రఘుబర్‌ దాస్‌ 2014-19 మధ్య ఆ రాష్ట్ర సీఎంగా ఐదేళ్ల పాటు పనిచేశారు. శిబు సొరెన్‌ హయాంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. రఘుబర్‌ దాస్‌ ప్రస్తుతం బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 

ఇది కూడా చదవండి: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో నా పేరు ఉంటుంది: రాజాసింగ్‌

మరిన్ని వార్తలు