సీఎం వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే... మండలిలో బీఆర్‌ఎస్‌ సభ్యుల పట్టు

10 Feb, 2024 02:01 IST|Sakshi
స్పీకర్‌ పోడియం వద్ద నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు

సభ్యులపైన ఓ న్యూస్‌ చానల్‌లో రేవంత్‌ వాఖ్యలపై దుమారం 

చైర్మన్‌ పోడియం ముందు బైఠాయించి నిరసనలు

ఐదుసార్లు వాయిదా పడ్డ పెద్దల సభ

సాక్షి, హైదరాబాద్‌: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రారంభమైన శాసనమండలి తొలిరోజు రసాభాసగా మారింది. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరగకుండానే ముగిసింది. శాసనమండలి సభ్యులపైన ఓ టీవీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి హౌజ్‌లోకి వచ్చి సభ్యులకు క్షమాపణ చేప్పేవరకు సభను ముందుకు సాగనివ్వమని బీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టుబట్టారు. దీంతో శుక్రవారం నాటి సెషన్‌ ఐదుసార్లు వాయిదా పడింది.

అయినప్పటికీ బీఆర్‌ఎస్‌ సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో సభ ను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. దీంతో గవర్నర్‌ ప్రసంగం నేపథ్యంలో ధన్యవాద తీర్మానంపై చర్చ కు అవకాశం లేకుండా పోయింది. శనివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందా? లేదా? చూడాలి. 

సభ ప్రారంభంలోనే గందరగోళం  
ఉదయం సభ ప్రారంభం కాగా... చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముందుగా సభలోకి కొత్తగా వచ్చిన ఇద్దరు సభ్యులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్‌కు స్వాగతం పలికారు. అనంతరం బడ్జెట్‌ సమావేశాలనుద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అవకాశం కల్పించారు.

ఇంతలో బీఆర్‌ఎస్‌ సభ్యులు భానుప్రసాద్‌ మాట్లాడుతూ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాసనమండలి సభ్యులపైన సీఎం రేవంత్‌రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సీఎం హౌజ్‌లోకి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ సభ్యులు సైతం గొంతు కలపడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కలగజేసుకుంటూ సీఎం వాఖ్యల అంశాన్ని ప్రివిలేజ్‌ కమిటీ పరిశీలనకు పంపామనీ, సభ్యులు ఈ అంశంపై నోటీసు ఇస్తే చర్చకు అవకాశం కల్పిస్తానన్నారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళన విరమించకుండా సీఎం రావాల్సిందేనంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభను పదినిమిషాలు వాయిదా వేశారు. 

బీఆర్‌ఎస్‌కు మాట్లాడే అర్హత లేదన్న జూపల్లి 
ఆ తర్వాత సభ ప్రారంభం కాగానే బీఆర్‌ఎస్‌ సభ్యు లు అదే తీరును ప్రదర్శించారు. చైర్మన్‌ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఒకరిద్దరు సభ్యులు పోడియం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రభుత్వం తరపున మాట్లాడాలని చైర్మన్‌ కోర గా జూపల్లి స్పందిస్తూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ సభ్యులు నినాదాలతో హోరెత్తించడంతో మంత్రి వారి వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగు ్గలు కలిపే వ్యక్తికి రాజ్యసభను పంపించిన బీఆర్‌ఎస్‌కి మండలిలో మాట్లాడే అర్హత లేదన్నారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడం సాంప్రదాయమని, సభ గౌరవాన్ని కాపాడాలని కోరారు. 

పెద్దల సభకు గౌరవం ఇవ్వాలి: జీవన్‌రెడ్డి 
అనుభవం ఉన్న వ్యక్తులు మండలికి వస్తారని, పెద్ద మనుషులు ఉండే పెద్దల సభను అగౌరవం పర్చేలా బీఆర్‌ఎస్‌ సభ్యులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రివిలేజ్‌ కమిటీని ఏర్పాటు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో సభ పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega