కేరళ గవర్నర్‌కు జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రత పెంపు.. ఎందుకంటే?

27 Jan, 2024 16:39 IST|Sakshi

తిరువనంతపురం: సీపీఐ(ఎం) అనుబంధ సంస్థ స్టూడెంట్‌ ఫెడెరేషన్‌ ఆఫ్‌ ఇండియా విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌కు సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో Z+ కేటగిరి భద్రతను మరింత విస్తరిస్తున్నామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేరళ రాజ్‌భవన్‌కు తెలియజేసింది. ఈ విషయాన్ని కేరళ రాజ్‌భవన్‌ ‘ఎక్స్‌’ ట్విటర్‌లో పేర్కొంది.  ​

సీపీఐ(ఎం) అనుబంధ సంస్థ అయిన స్టూడెంట్‌ ఫెడెరేషన్‌ ఆఫ్‌ ఇండియా(SFI) శనివారం కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌కు వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసనకు దిగారు. గవర్నర్‌ ఆరిఫ్‌ కొట్టారక్కర జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరుకావటానికి వెళుతున్న సమయంలో పెద్ద ఎత్తున ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. విద్యార్థుల నిరసనతో విసిగిపో​యిన గవర్నర్‌ ఆరిఫ్‌.. అనూహ్యంగా రోడ్డు పక్కన్న ఉన్న ఓ షాప్‌ ముందు బైఠాయించారు.

తనపై నిరసన తెలుపుతున్న ఎస్‌ఎఫ్ఐ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకొని.. అరెస్ట్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన కొల్లాం జిల్లాలో జరిగింది. గవర్నర్‌  అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పోలీసులకు తెలియజేశారు.

నిరసన ఘటనపై గవర్నర్‌ ఆరిఫ్‌ .. ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌పై విమర్శలు చేశారు. పినరయ్‌ విజయన్ ప్రభుత్వం.. రాష్ట్రంలో అధర్మం, అశాంతిని ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడితో సహా పలువురి నాయకులపై కోర్టుల్లో క్రిమినల్‌ కేసులు ఉన్నా సీఎం పినరయ్‌ విజయన్‌ వారిని కాపాడటానికి పోలీసులకు దిశానిర్ధేశం చేస్తున్నారని విమర్శించారు. ఇక కొంత కాలంగా కేరళ సీఎం, గవర్నర్‌ మధ్యలు విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా గతంలో ఎస్‌ఎఫ్‌ఐ  విద్యార్థులు సైతం గవర్నర్‌ ఆరిఫ్‌పై పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు.

చదవండి:  తలొగ్గిన సర్కార్‌.. మరాఠా రిజర్వేషన్ల ఆందోళనకు ఫుల్‌స్టాప్

whatsapp channel

మరిన్ని వార్తలు