Chhattisgarh Elections 2023: అందరి కళ్లూ ఆయనవైపే.. ఎవరీ అరుణ్‌ సావో..?

23 Nov, 2023 15:57 IST|Sakshi

రాయపూర్‌ (ఛత్తీస్‌గడ్‌): ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌ కూడా ఒకటి. ఇక్కడ ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. నవంబర్‌ 7న తొలి దశ, నవంబర్‌ 17న రెండో దశ పోలింగ్‌ జరిగింది. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా అధికార కాంగ్రెస్‌, బీజేపీల మధ్యే ప్రధానంగా పోటీ ఉంది. ఇరు పార్టీల నుంచి మహామహులు పోటీలో ఉన్నారు. 

కాగా బిలాస్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని లోర్మి అసెంబ్లీ సెగ్మెంట్‌పైనే అందరి కళ్లూ ఉన్నాయి. కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌ సావో ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం లోక్‌ సభ్యుడైన ఆయన బిలాస్‌పూర్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతేడాదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన ఆయన ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో లోర్మి స్థానం నుంచి పోటీ చేశారు. అతి తక్కువ కాలంలోనే రాజకీయాల్లో అగ్రస్థాయికి ఎదిగిన అరుణ సావో గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

బీజేపీ ఛత్తీస్‌గఢ్ చీఫ్ అరుణ్ సావో బిలాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అటల్ శ్రీవాస్తవ్‌పై సావో 1,41,763 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లోర్మీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి థానేశ్వర్ సాహుపై పోటీ చేస్తున్నారు. 2022లోనే విష్ణు దేవ్ సాయి స్థానంలో సావో ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడయ్యారు.

ఇదీ నేపథ్యం
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 1968 నవంబర్ 25న అరుణ్ సావో జన్మించారు. ఛత్తీస్‌గఢ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేసి న్యాయవాద వృత్తిని చేపట్టిన ఆయన ఆ తర్వాత బిలాస్‌పూర్‌లోని హైకోర్టులో కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తర్వాత అడ్వకేట్ జనరల్ కార్యాలయంలోనూ పనిచేశారు.

అనతి కాలంలోనే..
1996లో బీజేపీ యువజన విభాగం భారతీయ జనతా యువ మోర్చాలో చేరడంతో అరుణ్ సావో రాజకీయ జీవితం ప్రారంభమైంది. తర్వాత అనతికాలంలోనే వివిధ స్థాయిలకు ఎదిగి 2000 సంవత్సరంలోనే అదే బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. 2005లో రాయ్‌పూర్ జిల్లా పంచాయతీ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2005 నుంచి 2010 వరకు జిల్లా పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2010లో లోర్మి నియోజకవర్గం నుంచి చత్తీస్‌గఢ్ శాసనసభకు ఎన్నికయ్యారు.

2013 నుంచి 2018 వరకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత 2019లో అరుణ్‌ సావో బిలాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ లోర్మి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన గెలిస్తే పార్టీ అధిష్టానం ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుందో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు