Kothagudem BRS Public Meeting: ఇక 'ప్రాంతీయ' శకమే

6 Nov, 2023 04:22 IST|Sakshi
ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రి పువ్వాడ

ఎక్కడివారు అక్కడ ఉంటేనే ఆ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారు 

ఖమ్మం, కొత్తగూడెం ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ 

ప్రజల చేతిలో ఉన్న ఏకైక వజ్రాయుధం ఓటు 

అభ్యర్థుల గుణగణాలు,వారి పార్టీ చరిత్ర చూసి ఓటేయాలి 

మీ నిర్ణయాధికారాన్ని సరిగా వాడకపోతే ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది  

అధికారం ఇచ్చినప్పుడు ఎవరు ఏం చేశారనే విచక్షణతో ఓటు వేస్తే ప్రజలు గెలుస్తారు 

సాక్షిప్రతినిధి, ఖమ్మం/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘ఎవరు గెలిస్తే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు మంచిదో.. ఎవరి చేతుల్లో ఉంటే తెలంగాణ సురక్షితంగా ఉంటదో మీ అందరికీ బాగా తెలుసు. ఎన్నికలు వస్తుంటాయి.. వివిధ పార్టీల అభ్యర్థులు నిలబడతారు.. ఇప్పుడు కూడా నిలబడ్డారు. మనిషి గుణం, గణం చూడాలి. సేవ చేస్తాడా.. గెలిచిన తర్వాత టాటా చెబుతాడా..? అన్నవి పరిశీలించాలి. అంతకన్నా ముఖ్యమైన అంశం.. అభ్యర్థి వెనకాల ఒక పార్టీ ఉంటుంది. గెలిచే అభ్యర్థి ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వమే రాబోయే ఐదేళ్లు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది. మన తలరాత రాస్తుంది.

కాబట్టి ఏ పార్టీ చరిత్ర ఏమిటి?..అధికారం ఇచ్చినప్పుడు వారి నడత, సరళి ఏమిటి? ఏం చేశారనేది ఆలోచించి మీ విచక్షణతో ఓటు వేస్తే ఎన్నికల్లో ప్రజలు గెలవడం ప్రారంభం అవుతుంది. ప్రజల చేతిలో ఉన్న ఒకే ఒక వజ్రాయుధం మీ సొంత ఓటు. మీ నిర్ణయాధికారాన్ని సరైన పద్ధతిలో వాడితే మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.

రాబోయేది ప్రాంతీయ పార్టీల యుగమే. ఎక్కడి వాళ్లు అక్కడ ఉంటేనే ఆ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారు..’అని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం, కొత్తగూడెంల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పువ్వాడ అజయ్‌కుమార్, వనమా వెంకటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు.  

మీ కళ్ల ముందే అభివృద్ధి 
‘బీజేపీ, కాంగ్రెస్‌ ఎప్పుడైనా తెలంగాణ జెండా ఎత్తాయా? తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడైనా భుజాన వేసుకున్నాయా? మనం ఎత్తుకున్నప్పుడల్లా మనల్ని అవమాన పరిచారు. కాల్చి చంపారు..జైళ్లల్లో పెట్టారు. వీళ్లకెందుకు ప్రేమ ఉంటుంది? కాంగ్రెస్‌ నాయకులకు సొంతం ఉండదు కథ. ఢిల్లీలో స్విచ్‌ వేస్తేనే ఇక్కడ లైటు వెలుగుతుంది. ఈ ఢిల్లీ గులాముల కింద ఉండి మనం కూడా గులాం అవుదామా? తెలంగాణ రాకముందు 70 ఏళ్ల క్రితం ‘నా తల్లి తెలంగాణ రా.. వెలలేని నందనోద్యానమురా’అని ఖమ్మం జిల్లాకు చెందిన కవి రావెళ్ల వెంకటరామారావు పాట రాశారు.

ఖమ్మం, కొత్తగూడెం నాడు ఎలా ఉండేవి? ఐదారేళ్లలో ఎలా చేశాం? ఖమ్మం పట్టణం చూస్తే ఇప్పుడు గర్వపడుతున్నా. ఒకనాడు ఇక్కడ పాదయాత్ర చేశా. గోళ్లపాడు ఎట్లా మురికిగా ఉండేది.. ఎన్నేళ్లు ఆ మురికి కంపు భరించాం? లకారం చెరువు ఎంత వికారంగా ఉండేది.. ఇవ్వాళ ఎంత సుందరంగా తయారైంది. అభివృద్ధి మీ కళ్ల ముందే ఉంది..’అని కేసీఆర్‌ అన్నారు.  

సింగరేణిని గాడిలో పెట్టాం..లాభాలు పెంచాం.. 
‘అప్పట్లో రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సింగరేణి పేరు చెప్పి కేంద్రం నుంచి వేల కోట్ల అప్పులు తెచ్చాయి. వాటిని సకాలంలో చెల్లించలేదు. దానికి బదులు సింగరేణిలో కేంద్రానికి వాటా ఇచ్చారు. ఫలితంగా సింగరేణి సంస్థలో 49 శాతం వాటా కేంద్రానికి వెళ్లింది. తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణిని గాడిలో పెట్టాం. లాభాలను పెంచడంతో పాటు విద్యుత్‌ ఉత్పత్తి రంగంలోకి కూడా సంస్థను తీసుకువచ్చాం.

రాష్ట్రంలో కరెంటు కష్టాలు, మంచినీటి వెతలు తీరాయి. గురుకులాలతో విద్యావ్యవస్థ మెరుగైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దళితులను ఓటు బ్యాంకుగానే చూశారు. కానీ మేం ప్రతి దళిత కుటుంబానికి సాయం అందే వరకు దళితబంధు పథకం కొనసాగిస్తాం. ఇవన్నీ విచారించి.. ఆలోచించి మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి పువ్వాడ అజయ్‌కుమార్, వనమా వెంకటేశ్వరరావును గెలిపించాలి..’అని సీఎం విజ్ఞప్తి చేశారు.  

మైనార్టీలకు పెట్టిన ఖర్చు చూడండి.. 
‘మనకన్నా ముందు పదేళ్లు కాంగ్రెస్‌ పాలించింది. మైనార్టీల అభివృద్ధి కోసం కేవలం రూ.900 కోట్లు ఖర్చుచేసింది. ముస్లింలను ఓటు బ్యాంక్‌గా మార్చి ఓట్లు దండుకుంది. మనం తొమ్మిదిన్నరేళ్లలో మైనార్టీల సంక్షేమం కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశాం. దీన్ని చూస్తే ఎవరు ఏవిధంగా పనిచేస్తున్నారో అర్థమవుతుంది. మేం అందరినీ కలుపుకొని వెళ్లాలని భావిస్తున్నాం. కేసీఆర్‌ బతికి ఉన్నంత వరకు ఈ రాష్ట్రం లౌకిక రాష్ట్రంగానే ఉంటుంది. అజయ్‌కుమార్‌ను ప్రేమతో అజయ్‌ఖాన్‌ పేరుతో పిలుస్తారు. అజయ్‌ను ఆశీర్వదించండి. ఖమ్మంకు న్యాయం చేస్తాడు..’అని ముఖ్యమంత్రి చెప్పారు.  

ఖమ్మంకు వాళ్లిద్దరి పీడ వదిలింది.. 
‘ఖమ్మం జిల్లాలో ఇద్దరు కరటక దమనకులు ఉన్నారని మొన్న సత్తుపల్లి సభలో చెప్పా. పరావస్తు చిన్నయసూరి కథ చదివితే వాళ్లెవరు ఆ కథ ఏంటో తెలుస్తుంది. లేకపోతే మీ తెలుగు మాస్టర్‌ని అడగండి. ఖమ్మానికి వీళ్లిద్దరి పీడ వదిలించాం. ఇవ్వాళ ఖమ్మం శుభ్రంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో మంచి రిజల్ట్స్‌ రాబోతున్నాయి. ఒకాయన అజయ్‌ చేతిలో ఓడి మూలకు పడి ఉంటే.. నేను పిలిచి అందరినీ సమన్వయం చేద్దామని మంత్రిని చేసి జిల్లాను అప్పగిస్తే ఆయన సాధించిన ఫలితం గుండుసున్నా.

బీఆర్‌ఎస్‌ పార్టీ వారిని ఒక్కరినీ అసెంబ్లీ గడప తొక్కనీయనని ఒక అర్భకుడు మాట్లాడుతున్నాడు. ఖమ్మంను గుత్తకు పట్టినవా.. ఖమ్మం జిల్లాకు జిల్లానే కొనేశావా.. ఖమ్మం జిల్లా ప్రజలు దీన్ని సహిస్తరా?..’అంటూ పరోక్షంగా తుమ్మల, పొంగులేటిపై కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ఈ సభల్లో పువ్వాడ అజయ్‌కుమార్, వనమా వెంకటేశ్వరరావుతో పాటు ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మ«ధు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, లింగాల కమల్‌రాజ్, రేగా కాంతారావు, బానోతు హరిప్రియ, బానోతు మదన్‌లాల్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు