కాంగ్రెస్‌తో చీకటి రోజులే!

21 Nov, 2023 05:02 IST|Sakshi

ఇందిరమ్మ రాజ్యమంటే.. దోపిడీ రాజ్యం–దొంగల రాజ్యమే 

స్టేషన్‌ఘన్‌పూర్, నకిరేకల్, నల్లగొండ, మానకొండూరు సభల్లో సీఎం కేసీఆర్‌ 

కాంగ్రెస్‌తో 58 ఏళ్లు గోసపడ్డం.. ఆ రాజ్యం మళ్లీ కావాలా? వాళ్లది ‘భూమేత’.. మళ్లీ దళారులు, లంచాల రాజ్యం ఎన్నికలు కాగానే ఆర్టీసీ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ పూర్తి ఆటోరిక్షాలపై ఫిట్‌నెస్, పర్మిట్‌ ట్యాక్స్‌ రద్దు డబుల్‌ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేస్తాం.. మానకొండూరులో హుజూరాబాద్‌ తరహాలో దళితబంధు అమలు చేస్తామని హామీ 

ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఇల్లు కట్టిస్తాం 
రాష్ట్రంలో డబుల్‌ బెడ్రూం ఇళ్లు కొందరికి అందలేదు. ఇకపై అలా ఉండదు. ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం. రాబోయే రోజుల్లో ఓ ప్రాజెక్టు తరహా టాస్‌్కగా తీసుకుని ఇల్లులేని ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టిస్తాం. రాష్ట్రంలో ఇల్లు లేని మనిషి ఉండొద్దు. సొంత జాగా ఉన్న వారికి గృహలక్ష్మి అమలు చేస్తాం. 

ఆటోలపై ఫిట్‌నెస్, పర్మిట్‌ ట్యాక్స్‌ రద్దు 
దేశవ్యాప్తంగా ఆటోరిక్షాలకు ట్యాక్స్‌ ఉంటే.. తెలంగాణలో మినహాయింపు ఇచ్చాం. అయితే ఆటో ఫిట్‌నెస్‌ కోసం పోతే ఏడాదికి రూ.1,200 కట్టాలి. దీనిని కూడా ఎన్నికలు ముగియగానే రద్దు చేస్తాం. ప్రభుత్వానికి రూ.100 కోట్ల వరకు నష్టం వచ్చినా భరించి.. ఫిట్‌నెస్‌ ట్యాక్స్, పర్మిట్‌ ట్యాక్స్‌ రద్దు చేస్తాం.

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కాంగ్రెస్‌ పాలన అంటే చీకటి రోజులేనని, ఇందిరమ్మ రాజ్యమంటే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యమని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మెల్లమెల్లగా అభివృద్ధి చేసుకుంటుంటే.. కాంగ్రెస్‌ వాళ్లు తెస్తమంటున్న ఆ దిక్కుమాలిన ఇందిరమ్మ రాజ్యం మనకు కావాలా అని ప్రశ్నించారు.

అభ్యర్థులతోపాటు వారి వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూడాలని.. బాగా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, నల్లగొండ జిల్లా నకిరేకల్, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లా మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. వివరాలు

ఆయన మాటల్లోనే.. 
‘‘కాంగ్రెస్‌ నేతలు మళ్లీ మోసం చేయాలని చూస్తున్నరు. ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. ఏం జరిగింది ఇందిరమ్మ పాలనలో మనకు తెలియ దా? కరువు కాటకాలు, ఆకలి చావులు, ఎమర్జెన్సీ, నక్సల్స్‌ ఉద్యమం, యువత అటవీబాట, ఎన్‌కౌంటర్లు.. ఇవే కదా అప్పుడు జరిగింది. అది దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం. ఆ దిక్కుమాలిన రాజ్యంలో బలిసినోడు బలిసిండు.

తిండికిలేనోడు లేనిలెక్కనే బతికిండు. ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే ఎన్టీఆర్‌ టీడీపీ పుట్టకపోయేది. రూ.2కు కిలోబియ్యం ఇచ్చే పరిస్థితి వచ్చేది కాదు. ప్రజలు ఆగమాగం కాకుండా ఆలోచించాలి. ఆచరణ సాధ్యంకాని హామీలు, మోసపూరిత మాటలు చెప్తున్న పారీ్టలకు బుద్ధి చెప్పాలి. రైతాంగ సాయుధ పోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణను నాడు ఆంధ్రలో కలిపి తీరని నష్టం కలిగించింది కాంగ్రెస్‌. వాళ్లకు తిరిగి అధికారమిస్తే కరువు కాటకాలు పునరావృతమవుతాయి. 

వెంటనే రెగ్యులరైజ్‌ చేస్తాం 
ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు ఉద్యోగం పోతదో తెలియని అభద్రతాభావంలో ఉంటే బిల్లు పాస్‌ చేశాం. గవర్నర్‌ ఆలస్యం చేయడం వల్ల ఆగింది. ఎన్నికలు అయిపోయిన తెల్లారే ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసి గవర్నమెంట్‌ ఉద్యోగులుగా చేస్తాం. మూడోసారి అధికారంలోకి వస్తే.. ఆహార రంగానికి పెద్దపీట వేస్తాం. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండుతున్న నేపథ్యంలో ఎక్కడిక్కడ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. 
నల్లగొండను పట్టుబట్టి అభివృద్ధి చేస్తున్నం 

నల్లగొండ జిల్లా వట్టికోట ఆళ్వార్‌స్వామి 
పుట్టిన జిల్లా. చైతన్యవంతమైన ఉద్యమాల గడ్డ. కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో ఇక్కడ మంచినీళ్లు వచ్చే వి కావు. కరెంట్‌ ఉండేది కాదు. పోచంపల్లి చేనేత కార్మికుల ఆకలిచావులు, రైతుల ఆత్మహత్యలు జరిగేవి. నేను నల్లగొండను దత్తత తీసుకున్న. పట్టుబట్టి అభివృద్ధి చేస్తున్నాం. రూ.1,400 కోట్ల అభివృద్ధి పనులు కళ్ల ముందు జరుగుతున్నాయి.

రెండు దశాబ్దాలు పనిచేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాలంలో మంచినీటి సమస్య, కరెంట్‌ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఒక్క మెడికల్‌ కాలేజీ కట్టలేదు. బీఆర్‌ఎస్‌ సర్కారు వచ్చాక 3 మెడికల్‌ కాలేజీలు కట్టుకున్నాం. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తి కావచ్చింది. నల్లగొండ ఇంకా నా దత్తతలోనే ఉంది. మరింత అభివృద్ధి చేస్తా.. 

మానకొండూరులో అందరికీ దళితబంధు 
స్వాతంత్య్రం వచ్చాక దళితుల స్థితిగతులు మార్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీ లేదు. హుజూరాబాద్‌ తరహాలో మానకొండూరు నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందిస్తాం. నాది హామీ, నేను స్వయంగా వచ్చి ప్రారంభిస్తా. రసమయి బాలకిషన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి..’’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ సభలో ఎంపీ పసునూరి దయాకర్, కడియం శ్రీహరి, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి.రాజయ్య.. మానకొండూరు సభలో మంత్రి గంగుల, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

ధరణి తీసేసి దళారులను తెస్తరట 
కాంగ్రెస్‌ నాయకులు ధరణిని బంగాళాఖాతంలో కలిపి మళ్లీ దళారులను తెస్తమంటున్నరు. వారు తెచ్చే పథకం భూమాత కాదు భూమేత! మళ్లీ వీఆర్వోలు, అగ్రికల్చర్‌ ఆఫీసర్ల సంతకాలు, సర్టీఫికెట్ల పేరిట లంచాలు, దళారుల రాజ్యం వస్తుంది. పహాణీ కావాలన్నా రూ.లక్షకు రూ.40 వేలు వసూలు చేస్తరు. ఆలోచించాలి. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలి. రైతులు బాగుపడాలి. అందుకే నీటి తీరువా రద్దు చేశాం. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం. రైతుబంధు సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతాం. కమ్యూనిస్టు సోదరులను కోరుతున్నా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించండి. 

మరిన్ని వార్తలు