నేడు కోనాయిపల్లికి కేసీఆర్‌

4 Nov, 2023 04:43 IST|Sakshi
కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయం

వేంకటేశ్వరస్వామి ఆలయంలో నామినేషన్‌ పత్రాలు ఉంచి పూజలు 

1985 నుంచీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్న కేసీఆర్‌ 

నాడు వెంకన్న ఆశీస్సులతోనే టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపన

సాక్షి, సిద్దిపేట/నంగునూరు: ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఈ ఆలయం బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సెంటిమెంట్‌. ఆయన ఏ పని చేపట్టినా మొదట ఇక్కడి వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నాకే మొదలుపెడతారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డిల నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్న హరీశ్‌రావు ఇద్దరూ తమ నామినేషన్‌ పత్రాలతో శనివారం ఈ ఆలయానికి వస్తున్నారు.

వేంకటేశ్వరస్వామి వద్ద ఆ పత్రాలను ఉంచి పూజలు చేశాక వాటిపై సంతకాలు చేయనున్నారు. వారు ఈ నెల 9న ఆలయానికి రానున్నట్టు ప్రకటించినా ముందుగానే వస్తున్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫాంహౌస్‌లో చేపట్టిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం శుక్రవారంతో ముగిసింది. దీంతో ముందుగానే కోనాయిపల్లి వెళ్లి ప్రత్యేక పూజలు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ నెల 9న కేసీఆర్‌ తన నామినేషన్లను దాఖలు చేయనున్నారు. 

వెంకన్న ఆశీస్సులతోనే ఉద్యమంలోకి.. 
2001లో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్‌ టీడీపీతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేసి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి దిగారు. ఆ సమయంలోనూ కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేశారు. హైదరాబాద్‌లోని జలదృశ్యంలో టీఆర్‌ఎస్‌ని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడేదాకా పార్టీ చేపట్టే కార్యక్రమాలను ఇక్కడి నుంచీ ప్రారంభించారు.

1985 నుంచీ సంప్రదాయంగా.. 
కేసీఆర్‌ 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే సమయంలో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఆ ఎన్నికల్లో గెలవడంతో కోనాయిపల్లి ఆల యం ఆయనకు సెంటిమెంట్‌గా మారింది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018.. ఇలా ప్రతి ఎన్నికలో ఆయన ఈ ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్‌ వేస్తూ వచ్చారు. మంత్రి టి.హరీశ్‌రావు నామినేషన్‌కు ముందు కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశాకే నామినేషన్‌ వేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు