‘బీ’.. రె‘ఢీ’..!

15 Oct, 2023 03:48 IST|Sakshi
హుస్నాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభా స్థలి

అభ్యర్థులకు నేడు బీఆర్‌ఎస్‌ బీ ఫారాల అందజేత 

జనాకర్షక హామీలతో పార్టీ మేనిఫెస్టో సైతం విడుదల 

ఆసరా పింఛను పెంపు, ఉచిత సిలిండర్‌ లేదా భారీ సబ్సిడీతో సిలిండర్‌కు చోటు

నేడు తెలంగాణ భవన్‌లో విస్తృతస్థాయి సమావేశం... మరో ఐదుగురు అభ్యర్థుల ఎంపిక కొలిక్కి? 

ముఖ్య నేతలకు ఎన్నికల ప్రచారంపై అధినేత దిశానిర్దేశం 

అభ్యర్థులతో కలిసి మధ్యాహ్న భోజనం 

అనంతరం హుస్నాబాద్‌ తొలి ఎన్నికల ప్రచార సభకు కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌:  అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో పరుగులు పెడుతున్న భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఆదివారం మరో కీలక ముందడుగు వేస్తోంది. పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు నామినేషన్ల ప్రక్రియకు 18 రోజుల ముందే బీ ఫారాలు అందజేయనున్నారు. ప్రధాన ప్రతిపక్షాలు ఇంతవరకు తమ అభ్యర్థులనే ఖరారు చేయకపోవడం గమనార్హం. కాగా పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగే బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి భేటీలో ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్నారు.

పార్టీ అభ్యర్థులుగా ఇప్పటికే ఖరారైన వారితో పాటు రాష్ట్ర కార్యవర్గం, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఎన్నికలకు సంబంధించిన దిశా నిర్దేశంతో భేటీ ముగిసిన తర్వాత పార్టీ నేతలతో కలిసి కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం హుస్నాబాద్‌లో జరిగే తొలి ఎన్నికల ప్రచార సభకు బయలుదేరి వెళతారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి తెలంగాణ భవన్‌లో శనివారం సాయంత్రానికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

119 మంది అభ్యర్థులకు బీ ఫారాలు? 
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల పేర్లను సుమారు రెండు నెలల క్రితమే ఆగస్టు 21న కేసీఆర్‌ ప్రకటించారు. 119 స్థానాలకు గాను 115 మందితో జాబితాను విడుదల చేశారు. వీరిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడారు. దీంతో పెండింగులో ఉన్న జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్‌తో పాటు మల్కాజిగిరికి కూడా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగే భేటీలో 114 మందితో పాటు పెండింగ్‌లో ఉన్న మిగతా ఐదు నియోజకవర్గాల అభ్యర్థులకు కూడా కేసీఆర్‌ బీ ఫారాలు అందజేస్తారని సమాచారం.  

పెండింగ్‌ స్థానాల్లోనూ అభ్యర్థులు ఖరారు? 
పెండింగ్‌లో ఉన్న మల్కాజిగిరికి మర్రి రాజశేఖర్‌రెడ్డి, జనగామకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్‌కు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిల పేర్లు ఖరారయ్యాయి. నాంపల్లి నుంచి ఆనంద్‌గౌడ్, గోషామహల్‌ అభ్యర్థులుగా నందకిషోర్‌ వ్యాస్‌ పేర్లు కూడా ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్నా వారికి పార్టీ నుంచి ఇంకా సమాచారం అందలేదని తెలిసింది. ఇదిలా ఉంటే గతంలో ప్రకటించిన 114 మందిలో ఆలంపూర్‌ అభ్యర్థితో సహా ఒకరిద్దరి అభ్యర్థిత్వాన్ని మార్చే అవకాశముందనే ప్రచారం కూడా సాగుతోంది. అసంతృప్తి సద్దుమణగక పోవడం, గెలుపు అవకాశాలు, బీసీ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు ఉంటుందని భావిస్తున్నారు.  

మేనిఫెస్టో సిద్ధం 
ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తూ, విపక్షాల ఎన్నికల హామీలను కూడా దృష్టిలో పెట్టుకుని బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను సిద్ధం చేశారు. రైతులు, మహిళలు, యువత, దళిత, గిరిజనులు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని మేనిఫెస్టోకు రూపకల్పన జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జనాకర్షక హామీలతో కూడిన మేనిఫెస్టోను ఆదివారం కేసీఆర్‌ విడుదల చేయనున్నారు. రైతుబంధు, ఆసరా పింఛను మొత్తం పెంపు, గ్యాస్‌ సిలిండర్‌ ఉచితంగా ఇవ్వడం/ భారీ సబ్సిడీతో ఇవ్వడం, జర్నలిస్టులకు పింఛను వంటి అంశాలు ఇందులో ఉన్నట్లు సమాచారం.  

ప్రచార సభలు, సమన్వయంపై దిశా నిర్దేశం 
కేసీఆర్‌ ఆదివారం నుంచి వచ్చే నెల 9 వరకు 17 రోజుల్లో 41 బహిరంగ సభల్లో ప్రసంగించేలా ఇప్పటికే షెడ్యూలు ఖరారు చేశారు. పోలింగ్‌ తేదీ నాటికి ఆయన సుమారు వంద సభల్లో పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు. మరోవైపు 54 నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జిలను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం పార్టీ అభ్యర్థులతో జరిగే సమావేశంలో బహిరంగ సభల నిర్వహణ, జన సమీకరణ, సమన్వయం, ప్రచార అంశాలు తదితరాలపై కేసీఆర్‌ దిశా నిర్దేశం చేస్తారని తెలిసింది. విపక్ష పార్టీల ఎన్నికల వ్యూహాలు, ప్రచారం తదితరాలపై కూడా పలు సూచనలు చేయనున్నట్టు సమాచారం. కాగా ఆదివారం సాయంత్రం హుస్నాబాద్‌లో జరిగే తొలి ఎన్నికల ప్రచార సభలో మేనిఫెస్టోలోని అంశాలను తొలిసారిగా ప్రజల ముందు పెట్టనున్నారు. 

లక్ష మందితో సభ 
సాక్షి, సిద్దిపేట:  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో 20 ఎకరాల విస్తీర్ణంలో లక్ష మందితో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనున్నారు. 2014, 2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుస్నాబాద్‌ నుంచే కేసీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆ రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ తొలి సభను హుస్నాబాద్‌లో నిర్వహించనున్నారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్, ఎమ్మెల్యే వొడితెల సతీష్‌ కుమార్‌లు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం 4 గంటలకు హుస్నాబాద్‌కు చేరుకుని సభలో ప్రసంగిస్తారు. 

మరిన్ని వార్తలు