TS Assembly Session: బీఆర్‌ఎస్‌ ఇంకా మారలేదు: సీఎం రేవంత్‌

16 Dec, 2023 16:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిపక్ష నేతగా ఎవరికైనా సీనియర్లకు అవకాశమిస్తారేమో అనుకున్నామని, కానీ బీఆర్‌ఎస్‌ పార్టీ  కుటుంబ పాలనకే పరిమితమవుతుందని మరోసారి నిరూపించారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో బీఆర్‌ఎస్‌ తరపున అసెంబ్లీలో కేటీఆర్‌ మాట్లాడడంపై రేవంత్‌ ఈ విమర్శలు చేశారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో రేవంత్‌రెడ్డి రిప్లై ఇచ్చారు. 

‘కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. అయినా బీఆర్‌ఎస్‌ మారలేదు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ప్రతిపక్షంలోకి కాదు బయటికి పంపిస్తారు. ప్రగతిభవన్‌ గేట్లు బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించాం. ప్రజాభవన్‌లో ప్రజావాణిని బీఆర్‌ఎస్‌ నేతలు భరించలేకపోతున్నారు. హోం మంత్రిని ప్రగతిభవన్‌ లోపలికి రానివ్వలేదు. గద్దరన్నను ఎండలో నిలబెట్టిన ప్రగతిభవన్‌ గేట్లను బద్దలు కొట్టాం. నాటి సీఎం దగ్గరకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు అనుమతి లేదు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ స్వేచ్ఛను ఇచ్చింది. ఆరు గ్యారెంటీలపై అసెంబ్లీలో చర్చించి చట్టం చేస్తాం’ అని సీఎం తెలిపారు.  

‘తెలంగాణ అమరుల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. వారిని ఇంటికి పిలిచి మాట్లాడలేదు. కొడుకు, కూతురు, అల్లునికి పదవులిచ్చుకున్నారు. తెలంగాణ కోసం డీఎ‍స్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి ఏ పదవి ఇవ్వలేదు. శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకు ప్రగతిభవన్‌లో ఏనాడు అన్నం పెట్టలేదు. ఉద్యమకారులపై ఇంకా కేసులు ఎత్తివేయలేదు. ధర్నాచౌక్‌ తొలగించి నిర్బంధాన్ని అమలు చేశారు’అని సీఎం అన్నారు. 

‘ఈ ప్రభుత్వం రైతును రాజును చేశామని చెప్పుకుంది. నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో లెక్కల ప్రకారం తెలంగాణలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేశారు. రైతుబీమా లెక్కల ప్రకారమే 1లక్షా21వేల మంది రైతులు చనిపోయారు. రైతు బతికుండడానికి మద్దతివ్వడం కాకుండా రైతు చనిపోతే  బీమాఇచ్చిన చరిత్ర గత ప్రభుత్వానిది. వరి వేస్తే ఉరేస్తే అని గత ముఖ్యమంత్రి అన్నారు. కానీ ఫాంహౌజ్‌లో 150 ఎకరాల్లో వరి పండించి క్వింటాల్‌కు రూ.4500కు అమ్ముకున్నారు’ అని సీఎం ఆరోపించారు. 

ఇదీచదవండి..కాంగ్రెస్‌ పార్టీకి ఇంత మిడిసిపాటు వద్దు: కేటీఆర్‌

>
మరిన్ని వార్తలు