Miryalaguda: ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోట.. ఇప్పుడు అనాథగా..

31 Oct, 2023 09:47 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీ కంచుకోటగా గుర్తింపు పొందిన నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు అనాథగా మారిందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌కు  అక్కడ నాయకుడు లేకుండా పోయాడని, ఇందుకు కారణం పార్టీ అధినాయకత్వం వైఖరేనని అక్కడి శ్రేణులు కుమిలిపోతున్నాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన తొలి ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్‌ పార్టీనే గెలిచింది. కానీ, గెలిచిన ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించడంతో అక్కడ చాలాకాలం పాటు కేడర్‌ను నడిపించే నాయకుడు లేకుండా పోయాడు.

ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చివరి క్షణంలో బీసీ పేరుతో హైదరాబాద్‌ నుంచి ఇంకో నాయకుడిని తెచ్చి కేడర్‌ నెత్తిన పెట్టారు. ఎన్నికలు అయ్యాక ఆయన పత్తా లేడు. ఇక, ఇప్పుడు పార్టీని కాపాడుకుంటూ, కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో పొత్తు పేరుతో కామ్రేడ్లు తమ నెత్తిన కూర్చుంటున్నారని అక్కడి కాంగ్రెస్‌ కేడర్‌ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

కామ్రేడ్లకు సీట్లు ఇచ్చే విషయంలో ఇతర జిల్లాలకు చెందిన నేతలు తమ ఏరియాలో సీట్లు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటే నల్లగొండ జిల్లాకు చెందిన బడా నాయకులు మాత్రం తమకేమీ పట్టనట్టు మిర్యాలగూడను అనాథగా వదిలేశారని, కనీసం ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించాల్సిందేనని పట్టుపట్టే నాయకుడే లేకుండా పోయాడని కేడర్‌ ఆవేదన వ్యక్తం చేసింది. అదే జరిగితే, కామ్రేడ్లతో పొత్తు కుదిరితే మళ్లీ ఐదేళ్ల పాటు తాము అనాథలుగానే మిగిలిపోవాల్సి వస్తుందని నిట్టూరుస్తున్నారు. ఏం చేయగలరు.. ‘ఇండియా’ కూటమి కోసం త్యాగం చేయడం తప్ప...!  
చదవండి: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత కీలక ప్రసంగం..

మంత్రి అయినా సరే.. 
రఘునాథపాలెం: సామాన్య వ్యక్తి అయినా, మంత్రి అయినా ఎన్నికల నిబంధనల మేరకు పోలీసులు పక్కాగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వాహనాన్ని పోలీసులు, ఎన్నికల అధికారులు సోమవారం తనిఖీ చేశారు.

వాహనాల్లో ఉన్న మంత్రి, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, ఇతర ప్రజాప్రతినిధులు పోలీసులకు పూర్తిగా సహకరించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున అధికారులు తనిఖీ చేయడం సహజమని, తాను ఎప్పుడైనా సహకరిస్తానని మంత్రి పువ్వాడ అన్నారు. వారం రోజుల క్రితం పుట్టకోట క్రాస్‌ రోడ్డు వద్ద ఖమ్మం అర్బన్‌ పోలీసులు, కలెక్టర్‌ గౌతమ్‌ వాహనాన్ని సైతం తనిఖీ చేశారు.  

మరిన్ని వార్తలు