బల్దియా టు అసెంబ్లీ

17 Nov, 2023 03:39 IST|Sakshi

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కార్పొరేటర్‌ నుంచి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా 

ఇలా ఎదిగిన నేతలెందరో..

 ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ

చెరుపల్లి వెంకటేశ్‌: కార్పొరేటర్‌ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. హైదరాబాద్‌ బల్దియా నుంచే ఇలా ఎదిగిన వారూ  చాలామంది ఉన్నారు. కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచినా, ఓడి నా  పట్టు వదలకుండా కృషి చేసి పైమెట్టు ఎక్కారు. ఎక్కువ పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలవడంతోపాటు మంత్రులైన తలసాని శ్రీనివాస్‌ యాదవ్, టి.పద్మారావుగౌడ్, సి.కృష్ణయాదవ్, ముఖేశ్‌గౌడ్‌ తదితరులు నగరపాలకసంస్థ కార్పొరేటర్లుగా పోటీచేసిన వారే. 

ఎంసీహెచ్‌ నుంచే మొదలు 
తొలిసారిగా చాలామంది ఎంసీహెచ్‌(మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌) 1986 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో మోండా డివిజన్‌ నుంచి  జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసిన  తలసాని, పద్మారావు చేతిలో ఓడిపోయారు. అనంతరం తలసాని 5 పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలిచి టీడీపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల్లో మంత్రిగా పలుశాఖలు నిర్వహించారు.

ఇక 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మారావు బీఆర్‌ఎస్‌ ప్రభు త్వంలో మంత్రిగానూ, డిప్యూ టీ స్పీకర్‌గా నూ పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన  కృష్ణయాదవ్‌ టీడీపీ హయాంలో మంత్రిగానూ, ప్ర భుత్వ విప్‌గానూ పనిచేశారు. మూడుసార్లు ఎమ్మె ల్యే అయిన ముఖేశ్‌గౌడ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తొలుత టీడీపీ కార్పొరేటర్‌గా ఉన్న రాజాసింగ్‌  బీజేపీ నుంచి  రెండు పర్యాయాలు ఎమ్యెల్యేగా ఎన్నికై మూడోసారి పోటీ చేస్తున్నారు. 

ఓటమి నుంచి గెలుపు..
దోమలగూడ, జవహర్‌నగర్‌ నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ  జి.సాయన్న, డా.కె.లక్ష్మణ్‌ తర్వాతి కాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో సాయన్న ఐదు పర్యాయాలు, లక్ష్మణ్‌  రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. లక్ష్మణ్‌ ప్రస్తు తం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు.  సాయన్న  మరణానంతరం ప్రస్తుతం ఆయన కుమార్తె లాస్య నందిత తండ్రి ప్రాతినిధ్యం వహించిన కంటోన్మెంట్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఉన్నారు.  మూసారాంబాగ్‌ కార్పొరేటర్‌గా  ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డి   2002లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో  మేయర్‌గా గెలిచారు. ఆ తర్వాత మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

సీన్‌ రివర్స్‌ 
►మోండా డివిజన్‌కు పోటీ చేసిన పద్మారావు చేతిలో శ్రీనివాస్‌యాదవ్‌  కార్పొరేటర్‌గా ఒకసారి, సికింద్రాబాద్‌ నుంచి శాసనసభ ఎన్నికల్లో ఒకసారి ఓడిపోగా,  శ్రీనివాస్‌యాదవ్‌ చేతిలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పద్మారావు ఒకసారి ఓడిపోయారు. 

►జవహర్‌నగర్‌ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గోపాల్‌  చేతిలో ఓటమిపాలైన లక్ష్మణ్, ముషీరాబాద్‌లో 2014లో గోపాల్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు.  తిరిగి  2018లో గోపాల్‌  గెలవగా లక్ష్మణ్‌ ఓడారు.  

పార్టీ అధ్యక్షులుగానూ 
కార్పొరేటర్లుగా పోటీ చేయడం నుంచి  మంత్రులు, ఎమ్మెల్యేలైన శ్రీనివాస్‌యాదవ్, కృష్ణయాదవ్‌ , సాయన్న, ముఠా గోపాల్‌ హైదరాబాద్‌ జిల్లా టీడీపీ అధ్యక్షులుగానూ పనిచేశారు. పద్మారావు టీఆర్‌ఎస్‌   గ్రేటర్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. లక్ష్మణ్‌ బీజేపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు.  

ఎంపీలుగానూ..  
ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్‌ ఒవైసీ సైతం  కార్పొరేటర్‌ నుంచి ఎంపీ స్థాయికి ఎదిగారు. బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌గా చేసిన రేణుకాచౌదరి ఎంపీగా, కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇలా బల్దియా నుంచి రాజకీయప్రస్థానం ప్రారంభించి తదనంతరం గెలిచినవారు, ఓడిన వారు ఇంకా ఎందరో  ఉన్నారు. పలువురు  వివిధ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లుగానూ పనిచేశారు. కృష్ణారెడ్డి, సు«దీర్‌రెడ్డి  హుడా చైర్మన్లుగానూ వ్యవహరించారు. 

ఈ ఎన్నికల్లో...

పోటీలో సిట్టింగ్‌ కార్పొరేటర్లు 
ప్రస్తుతం బల్దియా సిట్టింగ్‌ కార్పొరేటర్లలో  బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగదీశ్వర్‌గౌడ్‌ శేరిలింగంపల్లి నుంచి , విజయారెడ్డి ఖైరతాబాద్‌  నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. తోకల శ్రీనివాసరెడ్డి(బీజేపీ) రాజేంద్రనగర్‌  అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్‌గా ఉన్న మహ్మద్‌ మోబిన్‌ బహదూర్‌పురా నుంచి ఎంఐఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. షేక్‌పేట కార్పొరేటర్‌ రాషెద్‌ ఫరాజుద్దీన్‌ జూబ్లీహిల్స్‌ సెగ్మెంట్‌ నుంచి పోటీ  చేస్తున్నారు.  

మాజీలు సైతం.. 
మాజీ కార్పొరేటర్‌ పరమేశ్వర్‌రెడ్డి ఉప్పల్‌ నుంచి కాంగ్రెస్‌ తరపున బరిలో ఉన్నారు. ఎంఐఎం మాజీ కార్పొరేటర్‌ బి.రవియాదవ్‌ రాజేంద్రనగర్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్‌ కూడా 
జీహెచ్‌ఎంసీ మేయర్లుగా పనిచేసిన జులి్ఫకర్‌ అలీ, మాజిద్‌హుస్సేన్‌ ఎంఐఎం అభ్యర్థులుగా చారి్మనార్, నాంపల్లి నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన జాఫర్‌ హుస్సేన్‌ ఇప్పటికే రెండు పర్యాయాలు  నాంపల్లి ఎమ్మెల్యేగా చేసి మూడోసారి యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. వీరిలో జుల్ఫికర్‌అలీ, మాజిద్‌ హుస్సేన్‌లు మేయర్ల పదవీకాలం ముగిశాక  సైతం తిరిగి కార్పొరేటర్లుగానూ పనిచేశారు. మాజిద్‌ ప్రస్తుతం సిట్టింగ్‌ కార్పొరేటర్‌గా కూడా ఉన్నారు. 

  •  తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సనత్‌నగర్‌ నుంచి పోటీ చేస్తున్నారు.  
  • సుదీర్‌రెడ్డి ఎల్‌బీనగర్‌ నుంచి రెండుపర్యాయాలు గెలిచి మళ్లీ బరిలో ఉన్నారు.  
  • ముఠాగోపాల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉండి, తిరిగి పోటీ చేస్తున్నారు. 
  • పద్మారావు సికింద్రాబాద్‌లో మూడుసార్లు గెలిచారు. మళ్లీ బరిలో నిలిచారు. 
  •  హిమాయత్‌నగర్‌ నియోజకవర్గంగా ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణయాదవ్‌ రూపాంతరం చెందిన అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరి లో ఉన్నారు. 
మరిన్ని వార్తలు