కేసీఆర్‌పై పోటీ చేస్తా!

13 Oct, 2023 02:22 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ 

హుజూరాబాద్‌ బరిలో కూడా ఉంటా.. 

రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం మళ్లీ రాదు  

16న హుజూరాబాద్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రాక  

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌  

హుజూరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గంతోపాటు.. అక్కడ కూడా పోటీ చేస్తానని (పరోక్షంగా సీఎం కేసీఆర్‌పై) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. తనను హుజూరాబాద్‌లో గెలిపించేందుకు కథానాయకులుగా మారి బీజేపీ శ్రేణులు పనిచేయాలని కోరారు. గురువారం ఆయన కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

‘నేను ఆరు ఫీట్ల హైట్‌ లేకపోవచ్చు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాకపోవచ్చుగానీ ప్రజల బాధలు తీర్చేవాడిని..’అని ఈటల అన్నారు. కొత్త రాష్ట్రంలో మంచి రాజకీయ వాతావరణాన్ని పాడుచేసిన దుర్మార్గపు పార్టీ.. భారత్‌ రాష్ట్ర సమితి అని ఆరోపించారు. ‘హుజూరాబాద్‌లో హోదా ఉన్నవాడితో కొట్లాడతాంగానీ సైకోతో ఏం కొట్లాడుతాం.. పొలిటికల్‌ లీడర్‌ పొలిటికల్‌గా కొట్లాడాలి..’అన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎన్నికల కమిషన్‌ చేతిలో ఉంటుందని, మొన్నటితో వారి పీడ విరగడైందని పేర్కొన్నారు. ‘కొట్టడం చేతకాక కాదు.. కార్యకర్తలు కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆగాను.

కొట్లాట నా సంస్కృతి కాదు. ఎందుకంటే నేను పొలిటికల్‌ లీడర్‌ ను. గూండాను కాదు. రౌడీని కాదు’అని అన్నారు. కొంతమంది చిల్లరగాళ్లు తను కేసీఆర్‌ కోవర్టు అని ఇంకా మాట్లాడుతుంటే బాధగా ఉందన్నారు. కేసీఆర్‌ వల్ల నరకం అంటే ఏమిటో సంపూర్ణంగా అనుభవించిన వాడినని తెలిపారు. తన శక్తిని మొత్తం బీఆర్‌ఎస్‌ ఓటమికి వినియోగిస్తానన్నారు. ఏ పోలీస్‌ ఆఫీసర్‌ అయినా బెదిరిస్తే చమడాలు తీస్తాం.. జాగ్రత్త.. అని చెప్పాలంటూ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

అధికారులు పిచ్చి పనులు చేసినా.. పక్షపాతంతో వ్యవహరించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తన వాళ్ల మీద చెయ్యి పడినా అంతు చూసేవరకూ వదిలిపెట్టేది లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం మళ్లీ రాదన్నారు. ఈనెల 16న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హుజూరాబాద్‌కు రాబోతున్నారని, సభను గొప్పగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు