ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు

1 Nov, 2023 03:25 IST|Sakshi

ఓ ఎంపీ కత్తిపోట్లకు గురైతే అనుచిత వ్యాఖ్యలు తగదు: మంత్రి హరీశ్‌రావు

అలాంటి పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరిక 

కొత్త ప్రభాకర్‌రెడ్డికి పరామర్శ 

రాంగోపాల్‌పేట్‌ (హైదరాబాద్‌): ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కత్తిదాడికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉంటే ప్రతిపక్ష నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. మంగళవారం ఆయన సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడి ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయనతో కొద్దిసేపు ముచ్చటించి ధైర్యం చెప్పారు.

అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. కత్తితో పొడవడంతో కత్తి 3 అంగుళాలు లోపలికి వెళ్లగా 4 చోట్ల చిన్నపేగుకు గాయమైందన్నారు. 15 సెం.మీ. చిన్న పేగును తొలగించి, మూడున్నర గంటలపాటు వైద్యులు శస్త్ర చికిత్స చేశారని చెప్పారు. ఇటువంటి సమయంలో సీనియర్‌ నాయకులు కూడా దీన్ని అపహాస్యం చేసేలా కోడి కత్తి అంటూ మాట్లాడటం దురదృష్టకరమన్నారు.

దివాళాకోరు రాజకీయాలు చేస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వ్యక్తులను నిర్మూలించి రాజకీయాలు చేయాలనుకోవడం తెలంగాణలో ఎప్పుడూ లేదని, తాము అధికారంలో ఉన్న ఏ రోజూ పగతో వ్యవహరించలేదన్నారు. పగతో రాజకీయాలు చేస్తే గతంలో హౌజింగ్‌ స్కీముల్లో స్కాములు చేసిన కాంగ్రెస్‌ నాయకులు, ఓటుకు నోటుకు కేసులో దొరికిన వాళ్లు ఎప్పుడో జైలుకు వెళ్లేవారని చెప్పారు. రాష్ట్రంలో ఏదోరకంగా అల్లర్లు చేయాలని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాలని ప్రతిపక్ష నాయకులు చూస్తున్నారని, ప్రజలు వీటిని గమనించాలని సూచించారు.

ప్రచారంలో ఉన్న అభ్యర్థులపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, అభ్యర్థులకు భద్రత పెంచాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ కేసులో కుట్రకోణం రెండు మూడు రోజుల్లో బయటకు వస్తుందని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.  ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించిన వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు,  మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

మరో నాలుగు రోజులు ఐసీయూలో 
మరో నాలుగు రోజుల పాటు ప్రభాకర్‌రెడ్డిని ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుందని సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రి హెడ్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు ప్రసాద్‌బాబు తెలిపారు. ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నాడని, మరో మూడు నాలుగు రోజులు గడిస్తేనే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందో లేదో చెప్పగలమన్నారు.

మరిన్ని వార్తలు