సెటైర్లు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లు

17 Dec, 2023 05:18 IST|Sakshi

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వాడీవేడిగా అసెంబ్లీ 

బీఆర్‌ఎస్‌పై దాడితో ప్రసంగం మొదలుపెట్టిన రేవంత్‌..  అందెశ్రీ కవితను ప్రస్తావిస్తూ సెటైర్లు 

ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం, దామోదర కూడా  అదే దారిలో. 

దీటుగా తప్పికొడుతూ కేటీఆర్, హరీశ్‌రావు విమర్శలు 

పరస్పరం వ్యంగ్య వ్యాఖ్యానాలు, ఛలోక్తులు, వాదోపవాదాలు 

నేరుగా ఒకరినొకరు ఎత్తిపొడుచుకున్న రేవంత్, కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల పర్వం మొదలైంది. అభ్యంతరాలు, వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, వ్యంగ్య వ్యాఖ్యలతో రోజంతా సభ ఆసక్తికరంగా సాగింది. సభలో ప్రతిపక్షానికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తామంటూనే అధికార పక్షం బీఆర్‌ఎస్‌పై దాడికి దిగింది.

దీనికి ప్రతిగా బీఆర్‌ఎస్‌ పక్షాన సీనియర్‌ సభ్యులు కేటీఆర్, హరీశ్‌ ఇద్దరూ దూకుడుగా కాంగ్రెస్‌ సర్కారుపై ఎదురుదాడి చేశారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ను కట్టడి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌ తదితరులు ప్రయతి్నంచారు. కుటుంబ పాలన, వరి పంటకు మద్దతు ధర, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, 50ఏళ్ల కాంగ్రెస్‌ పాలన అవస్థలు, ఆ పార్టీ సీఎంలను ఎంపిక చేసిన తీరు తదితర అంశాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ సభ్యులు పరస్పరం వ్యంగ్య విమర్శలు, వాదోపవాదాలకు దిగారు. 

మొదట సీఎం దాడి.. 
సీఎం రేవంత్‌ తన ప్రసంగం ప్రారంభంలోనే బీఆర్‌ఎస్‌పై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చినా బీఆర్‌ఎస్‌లో మార్పు రాలేదంటూ మండిపడ్డారు. ఇక ‘మేనేజ్‌మెంట్‌ కోటా’పేరిట జరిగిన చర్చ ఆసక్తికరంగా సాగింది. ‘‘మేనేజ్‌మెంట్‌ కోటాలో వచ్చిన వారు కేబినెట్‌ నిర్ణయాలు, చట్టబద్ధత కల్పించడంపై తేడాను గమనించాలి’’అని రేవంత్‌ వ్యాఖ్యానించగా.. కేటీఆర్‌ ప్రతిస్పందిస్తూ..‘‘ఢిల్లీని మేనేజ్‌ చేసి పీసీసీ అధ్యక్ష పదవి, సీఎం పదవి తెచ్చుకున్న వ్యక్తి మేనేజ్‌మెంట్‌ గురించి మాట్లాడుతున్నారు’’అని ఎద్దేవా చేశారు.

దీంతో.. ‘‘గవర్నర్‌ ప్రసంగం చూసి సిగ్గుపడుతున్నానని కేటీఆర్‌ అన్నారు. నిజంగా గత పదేళ్ల పాలనపై ఆయన సిగ్గుపడాల్సిందే..’’అని రేవంత్‌ సెటైర్‌ వేయగా.. ‘పంటల బీమాకు, రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి సీఎంగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా’నని కేటీఆర్‌ విమర్శించారు. దీనికి ప్రతిగా ‘మేనేజ్‌మెంట్‌ కోటాలో వచ్చిన వ్యక్తి.. ప్రజల నుంచి వచ్చి సీఎం కుర్చిలో కూర్చున్న వారిపై కుళ్లుకుంటున్నారు’అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఇక 50ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో చీకట్లు, రైతుల ఆత్మహత్యలేనని బీఆర్‌ఎస్‌ సభ్యులు విమర్శించగా.. గత పాలనలో అన్యాయం జరిగిందనే అందరం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని, ఇప్పుడు గత పదేళ్ల పాలన గురించి మాట్లాడుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. 

హరీశ్‌రావుకు మైక్‌ నిరాకరణపై నిరసన 
ధన్యవాద తీర్మానంపై సీఎం ఇచ్చిన సమాధానానికి బీఆర్‌ఎస్‌ పక్షాన హరీశ్‌రావు వివరణ కోరడం కూడా అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న కేటీఆర్‌కే వివరణ కోరే అవకాశం ఇస్తామని స్పీకర్‌ పలుమార్లు ప్రకటించారు. అయి నా చివరికి హరీశ్‌రావుకు మైక్‌ ఇచ్చారు. ‘‘సీఎం పలు అంశాలపై హుందాతనం లేకుండా విమర్శలు చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినట్లుగా ఇప్పుడు సీఎం అయినా గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ బిడ్డ పీవీ చనిపోతే చూసేందుకు కాంగ్రెస్‌ నేతలెవరూ రాలేదు’’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి కల్పించుకుంటూ.. బీఆర్‌ఎస్‌ వాల్లు పదేళ్ల నుంచీ అదే చెప్తున్నారని, ఇంకెన్నాళ్లు చాచా నెహ్రూ, పీవీ నర్సింహారావుల గురించి మాట్లాడుతారని ప్రశ్నించారు.

ఇదే సమయంలో ధన్యవాద తీర్మానం తీర్మానాన్ని ఆమోదించినట్టు స్పీకర్‌ ప్రకటిస్తూ, శాసనసభను బుధవారానికి వాయిదా వేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు తమకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వలేదని నినాదాలు చేస్తూ సభ నుంచి బయటికి వచ్చారు.

>
మరిన్ని వార్తలు