ఈ ఇండిపెండెంట్‌ అభ్యర్థి డిపాజిట్‌ ఎలా కట్టాడో తెలుసా?

21 Mar, 2024 07:19 IST|Sakshi

ప్రతి ఎన్నికలలోనూ ఇండిపెండెంట్‌ అభ్యర్థులు చర్చనీయాంశం అవుతూ ఉంటారు. ఏదో ఒక అంశంలో ప్రత్యేకత చాటుతూ ఉంటారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న జబల్‌పూర్‌ వ్యక్తి కూడా ఇలాగే వార్తల్లో నిలిచారు.  

స్వతంత్ర అభ్యర్థిగా జబల్‌పూర్‌లో ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్న వినయ్ చక్రవర్తి ఎన్నికల డిపాజిట్‌ను చిల్లర నాణేల రూపంలో చెల్లించారు. నామినేషన్ ఫారమ్‌ కోసం సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించడానికి రూ. 25,000 నాణేలతో బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లారు. రూ. 10, రూ. 5, రూ. 2 నాణేల రూపంలో రూ.25,000 సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించారు.

లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నానని, కలెక్టర్‌ కార్యాలయంలో డిజిటల్‌, ఆన్‌లైన్‌ విధానంలో డిపాజిట్‌ చెల్లించే సౌకర్యం లేదని అందుకే తన వద్ద ఉన్న నాణేల రూపంలో డిపాజిట్‌ చెల్లించానని చక్రవర్తి తెలిపారు. 

దీనిపై జబల్‌పూర్ జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా విలేకరులతో మాట్లాడుతూ, అభ్యర్థి నాణేలలో రూపంలో చెల్లించిన డిపాజిట్‌ను స్వీకరించి దానికి సంబంధించిన రశీదును అతనికి అందించినట్లు చెప్పారు.

లోక్‌సభ తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లోని అరడజను స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers