లోకేశ్‌ ‘రెడ్‌బుక్‌’ బెదిరింపులపై విచారణ జరపాలి  

10 Jan, 2024 05:01 IST|Sakshi

అధికారులను బెదిరించి లొంగదీసుకునేందుకు కుట్ర 

సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు, లోకేశ్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు 

రాష్ట్రంలో సామరస్య పరిస్థితులను దెబ్బతీసేందుకు పన్నాగం 

దురుద్దేశపూర్వకంగా ఉన్నతాధికారులపై నిరాధారణ ఆరోపణలు 

చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలను కట్టడి చేయండి 

కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ 

ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీ మార్గాని భరత్‌ 

సాక్షి, అమరావతి: రెడ్‌ బుక్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, యంత్రాంగాన్ని బెదిరిస్తూ భయోత్పాతానికి గురి చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్‌సీపీ కోరింది. చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అభ్యంతరకర, అసభ్యకర వ్యాఖ్యలు చేయకుండా నిరోధించాలని కోరింది.

చంద్రబాబు, లోకేశ్‌  ప్రభుత్వ అధికారులకు.. ప్రధానంగా పోలీసు అధికారులకు రాజకీయ దురుద్దేశాలు అంటగడుతూ వారిని బ్లాక్‌ మెయిల్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారని,  ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో సామరస్యపూరిత వాతావరణాన్ని దెబ్బతీ­సేందుకు కుట్ర పన్నుతున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్లింది. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌ సభలో పార్టీ విప్‌ మార్గాని భరత్‌తో కూడి­న వైఎస్సార్‌సీపీ బృందం కేంద్ర ఎన్నికల కమిషన్‌తో విజయవాడలో మంగళవారం సమావేశమైంది.

ఈ సందర్బంగా చంద్రబాబు, లోకేశ్‌ అప్రజస్వామిక విధానాలపై కమిషన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. వారు ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారని తెలిపింది. రెడ్‌బుక్‌ పేరుతో లోకేశ్‌ బెదిరింపులకు పాల్పడుతూ చేసిన ప్రసంగాలు, బహిరంగ సభల్లో చంద్రబాబు, లోకేశ్‌ ప్రసంగాలు, మీడియా, సోషల్‌ మీడియాలో టీడీపీ దు్రష్పచారానికి సంబంధించిన ఆధారాలను కూడా ఫిర్యాదుతోపాటు సమర్పించింది. ఆ ఫిర్యా­దులో పేర్కొన్న ప్రధాన అంశాలు ఇవీ.. 

♦ 2019 ఎన్నికల్లో అఖండమైన ప్రజా మ­ద్ద­తుతో ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ కుట్రలు పన్నుతోంది. టీడీపీ అధికారం కోల్పోయిందన్న దుగ్ద­తో చంద్రబాబు, లోకేశ్‌ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అస­భ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో సామరస్య పూరిత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసేందుకు అవకాశం లేకపోవడంతో వారిద్దరూ అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నా­రు. చంద్రబాబు, లోకేశ్, ఇతర టీడీ­పీ నేతలు బహిరంగ సభలు, మీడియా సమావేశాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల మన­సులను కలుషితం చేయాలన్న కుట్రతో సీఎం వైఎస్‌ జగన్‌ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు.  

♦ చంద్రబాబు జిల్లాల పర్యటనలో, లోకేశ్‌ పాదయాత్రలోనూ దురుద్దేశపూర్వకంగా ప్రభు­త్వ ఉన్నతాధికారులు, అధికార యంత్రాంగంపై నిరాధారణ ఆరో­ప­ణలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తిస్తున్న అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అధికారుల పేర్లను ఓ రెడ్‌బుక్‌లో రాస్తున్నానని, అధికారంలోకి వస్తే వారి సంగతి తేలుస్తానని లోకేశ్‌ బహిరంగ సభల్లో హెచ్చరించారు.

మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలలోనూ రెడ్‌బుక్‌ పేరుతో అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రధానంగా పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేస్తుండటం అధికార యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. బదిలీ అయి వెళ్లిపోతామని అధికారులు భావి­స్తే పొరపాటేనని, వారు ఎక్కడ ఉన్నా వదిలి పెట్టేదేలేదంటూ రెడ్‌బుక్‌ను చేతిలో పట్టుకుని చూపిస్తూ మరీ లోకేశ్‌ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 

♦  సమర్థవంతమైన పరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వ అధికారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నా­రు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు పూర్తి స్వేచ్ఛ­తో, సంతోషంగా, సమ­ర్ధవంతంగా విధులను నిర్వర్తిస్తున్నారు. పోలీ­సు అధికార యంత్రాంగం పూర్తిగా చట్టబద్ధంగా వ్యవహరిస్తూ శాంతిభద్రతలు, సామరస్య పూరిత వాతావరణాన్ని పరిరక్షిస్తోంది. అటువంటి ఉన్నతాధికారులు, ప్రత్యే­కించి పోలీసు అధికారులపై చంద్రబాబు, లోకేశ్‌ నిరాధార ఆరోపణలు చేస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు.

అందుకోసం ప్రత్యే­క బృందాలను నియమించి మరీ కుట్రపూరిత విధా­నాలతో పోలీసు అధికారులు విధులను సక్ర­మంగా నిర్వర్తించకుండా ఆటంకాలు సృష్టించేందుకు యత్ని­స్తు­న్నారు. పోలీ­సు అధికారులపై ప్రైవే­టు ఫిర్యా­దులు ఇప్పిస్తూ, అనుకూల మీడియా­లో వారిపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. టీడీపీకి కొమ్ము కాసే పత్రికలు, ఛానళ్లలో అధికారులపై తీవ్రస్థాయిలో విష ప్రచారం చేస్తూ వారిని బెదిరిస్తున్నారు. 

♦  గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా చంద్ర­బాబు, లోకేశ్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ రాజకీయ దురుద్దేశంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న వారిద్దరినీ  కట్టడి చేయాలని కోరుతున్నాం. దేశంలో ప్రజాస్వా­మ్య విలువలు, సంప్రదాయాలను పాటించాల్సిన బాధ్యత టీడీపీపై ఉంది. కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సమాజంలో సామరస్యపూరిత పరిస్థితులను టీడీపీ దెబ్బతీస్తోంది. ప్రజాస్వామ్య ప్రమాణాలను ధ్వంసం చేసేలా లోకేశ్‌ వ్యవహరిస్తున్నారు.  

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega