కంటి డాక్టర్‌కు పొలిటికల్‌ కష్టాలు

5 Nov, 2023 20:41 IST|Sakshi

సాక్షి, జగిత్యాల : ఆయనో నేత్ర వైద్యుడు. ఎంతో ఓపికగా కళ్ళ ఆపరేషన్లు చేస్తారు. కాని ఎమ్మెల్యేగా ఆయన సహనం కోల్పోతుంటారు. తప్పుల్ని ఎత్తి చూపినవారిని ఆవేశంతో బెదిరిస్తారు. తనమీద ఫిర్యాదులు చేస్తే మళ్ళీ బెదిరిస్తారు. తప్పుల మీద తప్పులు చేస్తున్నారయన. ఎన్నికల వేళ ఆయన చేస్తున్న తప్పులు ఎక్కడికి దారి తీస్తాయో అని అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన చేస్తున్న తప్పులు ఏంటి? ఎవరిని బెదిరిస్తున్నారు? 
 
ఎన్నికలు జరిగే తేదీలతో ఒకసారి షెడ్యూల్ విడుదలయ్యాక ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికల నిబంధనావళి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులెవ్వరికైనా ఒకేవిధంగా వర్తిస్తాయి. ఒకరికెక్కువ, ఇంకొకరికి తక్కువ అనే మినహాయింపులేమీ ఉండవు. కానీ జగిత్యాల అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ నేత్ర వైద్యుడు డాక్టర్ సంజయ్‌కుమార్‌ ఎలక్షన్ కోడ్‌ తనకు వర్తించదన్నట్లుగా వ్యవహరిస్తూ కష్టాలు కోరి తెచ్చుకుంటున్నారు. ఎన్నికల వేళ ఓట్ల వేట కొనసాగిస్తూ.... తన కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నారు. అసలు పార్టీ కార్యాలయంలో ఆ చెక్కులుండటమే తప్పంటే.. చెక్కుల పంపిణీపై ఫిర్యాదు చేసిన వారిని సదరు ఎమ్మెల్యే బెదిరించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ గురించి గుంటి జగదీశ్వర్ అనే ఓ లాయర్ జిల్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు ఎన్నికల కమిషన్ నోటీసులిచ్చింది. అది కాస్తా ఆ నేత్రవైద్యుడిలో అసహనానికి కారణమైంది. దాంతో.. జగిత్యాల శివార్లలోని రాజేశుడి గుట్ట ఆలయంలో పూజారిగా కూడా పనిచేసే సదరు అడ్వకేట్ గుంటి జగదీశ్వర్ దగ్గరకు హుటాహూటీన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెళ్లారు. అక్కడున్న మీడియా కెమెరాలను రికార్డ్ చేయొద్దంటూ హుకుం జారీ చేశారు. దైవ నామస్మరణతో మారుమ్రోగుతున్న మైకులనూ ఆపేయించారు. ఎన్నికల వేళ ఎమ్మెల్యే ఆఫీస్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడమే తప్పంటే.. గుడికెళ్లి రాజకీయాలు మాట్లాడుతూ తనను ఎమ్మెల్యే బెదిరించాడని లాయర్ కమ్ పూజారి గుంటి జగదీశ్వర్ చెబుతున్నారు.

నేత్ర వైద్యుడిగా ఎంతో ఓపికతో కళ్ల ఆపరేషన్స్ చేసే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.. రాజకీయాలకు వచ్చే వరకు అసహనంతో, ఆగ్రహంతో ఎందుకు సహనాన్ని కోల్పోతున్నారనే చర్చ జగిత్యాల సర్కిల్స్ లో మొదలైంది. ఇప్పటివరకూ జగిత్యాలలో టఫ్ ఫైట్ ఉంటుందనుకుంటున్న సమయంలో.. ఎమ్మెల్యే ఆగ్రహావేశాలు పార్టీకి నష్టం మరింతగా జరుగుతుందనే అభిప్రాయాలు గులాబీ వర్గాల్లోనే చర్చకొస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఎన్నికల నుంచి అనర్హుడిగా ప్రకటించాలని ఆయన బాధితుడు గుంటి జగదీశ్వర్ ఎన్నికల కమిషన్ ను కోరుతున్నాడు.

డాక్టర్ సంజయ్ కుమార్ గతంలోనూ ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్నారు. మెడికల్ కళాశాల భవనానికి భూమిపూజ చేస్తున్న సమయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు, కోరుట్ల శాసనసభ్యుడైన విద్యాసాగర్ రావు నేతృత్వంలో పనులను ప్రారంభించారు. ఆ శిలాఫలకంపై క్యాబినెట్ హోదా కల్గిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావా వసంత పేరును ముద్రించకపోవడం వివాదానికి కారణమైంది. అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు స్వయంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని ఈవిషయమై మందలించారు. జడ్‌పీ చైర్ పర్సన్‌ పేరు ముద్రించాకే శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తన ఎమ్మెల్యే సీటుకి అడ్డు పడుతుందన్న నాటి ప్రచారం నేపథ్యంలో.. ప్రోటోకాల్‌ను కూడా ఉల్లంఘించి దావా వసంత పేరును శిలాఫలకంపై ముద్రించకపోవడంపై జగిత్యాల ఎమ్మెల్యే గురించి బీఆర్ఎస్ వర్గాల్లోనే పెద్ద చర్చ జరిగింది. 

గతంలోనూ పలుమార్లు తానేం మాట్లాడుతున్నానో తనే గుర్తించలేని స్థితిలో.. చెప్పాలనుకునేదొకటి, చెప్పేదొకటన్నట్టు మీడియా అటెన్షన్‌కు డాక్టర్ సంజయ్ కుమార్ టార్గెట్‌గా మారారు. తీరా ఇప్పుడు ఎన్నికల వేళ తత్తర పడుతున్న సీన్స్ పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. కానీ, ఈ విషయాలు ఎమ్మెల్యేకు చెబితే మళ్లీ దాని గురించి ఏమనుకుంటారోనని.. ఆయన్ను బాగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్న ఆయన శ్రేయోభిలాషులు కూడా చెప్పడానికి సందేహిస్తున్నారట. మొత్తంగా గెలుపు అవకాశాలున్న చోట.. కోడ్ ఉల్లంఘనలు.. పైగా అహంకారపు బెదిరింపులు.. తప్పుల మీద తప్పులు చేస్తూ.. ఎలక్షన్‌ టైమ్‌లో ఇవేం తలనొప్పులని బీఆర్ఎస్ శ్రేణులు వాపోతున్నాయట. 
 

మరిన్ని వార్తలు