పీకే తీరు దుర్మార్గం.. టీడీపీ జెండాలు మోయలేం!

13 Dec, 2023 17:14 IST|Sakshi

సాక్షి, విజయవాడ: జనసేన పార్టీ ద్వారా ఎవరికైనా పూర్తిస్థాయిలో న్యాయం జరిగిందా? అంటే అది ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు మాత్రమే. పార్టీని, పవన్‌ను, ఒక స్పష్టతంటూ లేని పవన్‌ సిద్ధాంతాన్ని నమ్ముకుని పదేళ్లుగా మద్దతు ఇస్తూ వస్తోంది ఆ పార్టీ కేడర్‌. అందులో కొందరైతే తమ ఉద్యోగాలు, కెరీర్‌ను త్యాగం చేసి మరీ గుడ్డిగా పవన్‌ వెంట ఉంటూ వచ్చారు. అలాంటి వాళ్లు పవన్‌ తీరుపై  ఇప్పుడు భగ్గుమంటున్నారు. జనసేనానికి వరుస షాకులు ఇస్తున్నారు.. 

పవన్‌ కల్యాణ్‌ జనసేన శ్రేణుల్ని తన తీరుతో ఎప్పటికప్పుడు నిరుత్సాహ పరుస్తూనే వస్తున్నాడు. ఇక టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత అది తారాస్థాయికి చేరింది. పక్క పార్టీతో నడిస్తే నడవండి.. లేకుంటే బయటకు వెళ్లిపోండి అంటూ హుకుం జారీ చేశాడు. దీనికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే.. వైఎస్సార్‌సీపీ కోవర్టులుగా పరిగణించాల్సి ఉంటుందని అహం ప్రదర్శించాడు. అదీ ఇప్పుడు జనసేన డౌన్‌ఫాల్‌కు దారి తీస్తోంది. వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు మొదటి నుంచి జనసేనతో నడిచిన వాళ్లు. 

తాజాగా.. జనసేనలో తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కారు తండ్రీకూతుళ్లు.  ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు, నరసాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు ఆకుల వెంకట స్వామి జనసేనకు రాజీనామా చేశారు. పవన్‌ కల్యాణ్‌ ప్రవర్తన నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆవేదనతో చెబుతున్నారాయన. 

‘‘నా కూతురు  కళ్యాణి సాఫ్ట్ వేర్ జాబ్  వదులుకుని పార్టీ కోసం కష్టపడింది. అధినేత అప్పజెప్పిన అన్ని విధుల్లో చక్కగా పనిచేసింది. కానీ, కార్యాలయంలోని అంతర్గత కుమ్ములాటల్లో నా కూతురును తొలగించారు. పార్టీకి సేవ చేస్తే ఆఫీస్ నుంచి  వెళ్ళగొట్టారు. 

.. పవన్ కల్యాణ్ మాటలకు ఆకర్షితుడినై పార్టీలో జాయిన్ అయ్యాను. పార్టీ గుర్తించి పదవులు కేటాయించింది. కానీ, మొదట్లో పవన్‌ చెప్పిన మాటలకు.. ఇప్పటి మాటలకు పొంతన లేకుండా పోయింది. ఎప్పుడేం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. పైగా ఒకే కుటుంబానికి కొమ్ము కాస్తున్నాడు. గతంలో.. టీడీపీ అవినీతి చేసిందని విమర్శించాడు. ఇప్పుడు అదే పార్టీకి మద్దతు ఇస్తున్నాడు. ఈ నిర్ణయాన్ని తట్టుకోలేకపోతున్నాం. అందుకే రాజీనామా చేస్తున్నా అని వెంకటస్వామి తెలిపారు. 

పవనే పెద్ద కోవర్టు..
‘‘పొత్తు పెట్టుకున్న తర్వాత కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. జనసేన పార్టీలో ఉండి టీడీపీని విమర్శిస్తే అధికార పక్షం  కోవర్టులవుతారని అన్నాడు. జనసైనికులు ఎవరికీ కోవర్టులు కాదు.. చంద్రబాబుకి పవన్ కళ్యాణే పెద్ద కోవర్ట్. ఇప్పటివరకు జనసేన పార్టీ జెండాలు మోశాం. ఇప్పుడు టీడీపీ జెండాలు మోయమంటే మావల్ల కాదు.  

కాపు ఓట్లు రాలవు
కాపు యువతను పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడు. టీడీపీకి ఓట్లు వేసే పరిస్థితిలో కాపులు లేరు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కదా.. ఇప్పుడు పవన్‌ ఒక్క సీటు గెలిచినా గొప్పే. 

చెప్పకుండా బయటకు పంపారు: జయకళ్యాణి
ఆకుల జయకళ్యాణి జనసేన పార్టీ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే చెప్పాపెట్టకుండా హఠాత్తుగా పార్టీ నుంచి తొలగించడాన్ని భరించలేకపోతున్నారామె. 

‘‘పవన్ పై అభిమానంతో నా ఉద్యోగాన్ని పక్కన పెట్టి మరీ జనసేన పార్టీలో చేరాను. పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేశాను. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేక.. ఆరోగ్యం సహకరించక పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకున్నాను. ఆ సమయంలో పవన్‌ నాతో మాట్లాడి పార్టీ కోసం పని చేయించుకున్నారు. ఆపై నాకు కేటాయిస్తానని చెప్పిన పదవులు వేరే వారికి కట్టబెట్టారు. హఠాత్తుగా పార్టీ ట్రెజరర్ రత్నం  కాల్ చేసి ‘మీ సేవలు చాలు’ అన్నారు. నాతోపాటు 43 మంది ఉద్యోగులను కారణం చెప్పకుండానే బయటికి పంపించేశారు అని ఆవేదన వ్యక్తం చేశారామె.

>
మరిన్ని వార్తలు