సాధ్యంకాని హామీలు

14 Nov, 2023 01:17 IST|Sakshi
సోమవారం వరంగల్‌ జిల్లా నర్సంపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజం

ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తారట!.. ధరణిని బంగాళాఖాతంలో కలుపుదామా? కాంగ్రెస్‌నా?

రైతుబంధు లాంటివి ఎలా అమలు చేస్తారంటే సమాధానం లేదు

అన్నీ పరిశీలించి ఓటు వేస్తే బతుకులు బాగు పడతాయన్న సీఎం

భద్రాద్రి, వరంగల్‌ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం 

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ సాక్షి, వరంగల్‌/నర్సంపేట: ‘సాగుకు సంబంధించి బాగోగులు తెలియని కాంగ్రెస్‌ నేతలు వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలని చెబుతున్నారు. 3 గంటల కరెంటు ఇస్తే ఒక్క మడి కూడా తడవదు. ఒకవేళ కాంగ్రెస్‌ చెప్పినట్టు చేస్తే రైతులు 10 హెచ్‌పీ మోటార్లు వినియోగించాలి. అది సాధ్యమయ్యే పనేనా? వీటిని రైతులకు ఎవరు కొనుగోలు చేసి ఇస్తారు? మీ అయ్యలు ఇస్తారా? ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తమ రాష్ట్రంలో 5 గంటల విద్యుత్‌ ఇస్తున్నామంటూ సవాల్‌ చేశారు. కానీ తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నాం.

అయితే ప్రధాని మోదీ రాష్ట్రమైన గుజరాత్‌లో 24 గంటల విద్యుత్‌ లేదు. ఎలాగైనా గెలవాలనే తపనతో గోల్‌మాల్‌ మాటలు చెబుతున్నారు. ఆ మాటలు విని మోసపోవద్దు..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ధరణి పోర్టల్‌తోనే రైతుల భూములకు రక్షణ అని పునరుద్ఘాటించారు. తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని కూడా కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని, బంగాళాఖాతంలో కలపాల్సింది ధరణినా? కాంగ్రెస్‌ పార్టీనా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, దమ్మపేట మండలాల్లో, వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. 

రైతులకు మేలు చేయడం దుబారానా?
‘ప్రభుత్వాల తోడ్పాటు లేనిదే ప్రపంచ వ్యాప్తంగా కూడా వ్యవసాయం ముందుకు నడిచే పరిస్థితి లేదు. ఆ దృష్టితోనే రైతుబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చాం. అయితే పన్నుల రూపంలో వచ్చిన డబ్బులు రైతుబంధు పేరుతో దుబారా చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు అంటున్నారు.  రైతులకు మేలు చేయడం దుబారా ఎలా అవుతుంది?  రైతు సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే మేం రైతుబంధు, నీటి తీరువా రద్దు, రైతుబీమా అందుబాటులోకి తెచ్చాం. 7,500 కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తున్నాం..’ అని కేసీఆర్‌ తెలిపారు. 

ధరణితో అన్ని హక్కులూ రైతులకే..
‘గతంలో ప్రభుత్వ భూములపై రెవెన్యూ పెత్తనం ఉండేది. ప్రతి పనికీ వీర్వోలు.. ఎమ్మార్వోల మీద ఆధారపడాల్సి వచ్చేది. కానీ ధరణి వచ్చిన తర్వాత భూములపై అన్ని రకాల హక్కులు రైతులకే బదలాయించాం. రైతు వేలిముద్ర లేకుండా ఇంచు భూమి కూడా బయటకు పోదు. అంతేకాదు ప్రభుత్వం అందించే ప్రతి ఆర్థిక సాయం నేరుగా రైతు ఖాతాలోకే చేరిపోతుంది. ఈ మేరకు మొబైల్‌ ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయి.

ఇలాంటి ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తానంటూ కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్, ఆ పార్టీ జాతీయ నేత రాహుల్‌గాంధీ అంటున్నారు. అసలు రాహుల్‌ సహా కాంగ్రెస్‌ నేతలకు వ్యవసాయం గురించి, రైతుల కష్టాల గురించి ఏం తెలుసు? ధరణిని రద్దు చేస్తే రైతుబంధు లాంటి పథకాలు ఎలా అమలు చేస్తారంటే వారి వద్ద సమాధానం లేదు. ధరణిని తీసేస్తే మళ్లీ రెవెన్యూ పెత్తనం పెరుగుతుంది. దళారులు, లంచగొండులు, పైరవీకారులు పుట్టుకొస్తారు..’ అని సీఎం హెచ్చరించారు.  

రూ.2 వేల పింఛను ఇచ్చేది తెలంగాణ, ఏపీ మాత్రమే..
‘వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛను అందించడం సామాజిక బాధ్యత. రాష్ట్రం వచ్చిన కొత్తలో పెన్షన్‌ రూ.200 ఉండేది. అప్పుడు పింఛను పెంచాలని అధికారులకు చెబితే, వారు రూ.600 ఇస్తే సరిపోతుందంటూ సిఫారసు చేశారు. కానీ మేం ఆ మొత్తాన్ని రూ.1000కి పెంచాలని నిర్ణయించాం. ఇప్పుడు దేశం మొత్తం మీద రూ.2 వేల పింఛను అందిస్తున్న రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే..’ అని కేసీఆర్‌ తెలిపారు.

ఇంత అహంకారమా?
‘ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నాయకుడు (పొంగులేటి).. ఒక్క బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనూ అసెంబ్లీ గేటు తాకనివ్వనని అంటున్నాడు. ఇంత అహంకారంతో కూడిన మాటలు మాట్లాడొచ్చా? ధనబలంతో ప్రజాస్వామ్యాన్ని కొంటారా? పక్క రాష్ట్రం నుంచి వచ్చి డబ్బు కట్టలు పంచుతున్నారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలి. గ్రామాలకు వచ్చే టూరిస్టులకు ఓటు వేయొద్దు..’ అని కోరారు.

ఆషామాషీగా ఓటేయొద్దు
‘తెలంగాణ రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు డయాలసిస్‌ సెంటర్లు ఉండేబి. కానీ ఇప్పుడు 103 ఉన్నాయి. ఇంటింటికీ తాగునీరు అందుతోంది. రైతుబంధుతో పాటు దళిత బంధు కూడా వచ్చింది. నా కంటే పొడుగు, దొడ్డు ఉన్నోళ్లు రాష్ట్రాన్ని పరిపాలించినా ఎవరూ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదు. కానీ బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. ఇక్కడి ప్రజల సంక్షేమమే మా ధ్యేయం. అందుకే గతంలో ఎన్నడూ లేని పథకాలు అమలు చేశాం. ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు ఆషామాషీగా నిర్ణయం తీసుకోవద్దు.

పోటీలో నిలిచే అభ్యర్థులు, వారి వెనక ఉన్న పార్టీ, ఆ పార్టీ వి«ధానాలు, ప్రజల పట్ల ఆ పార్టీకి ఉన్న నిబద్ధత.. అన్నీ పరిశీలించి ఓటు హక్కును వినియోగించుకుంటేనే జీవితాలు బాగుపడతాయి..’ అని కేసీఆర్‌ అన్నారు. ఆయా సభల్లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, పార్టీ అభ్యర్థులు రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు, తెల్లం వెంకట్రావు, పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు