స్పీకర్‌కు రాజీనామా సమర్పణ.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

8 Aug, 2022 10:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సోమవారం ఉదయం స్పీకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ సమర్పించారు. దీనికి ముందు అసెంబ్లీ రోడ్డులోని గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తన రాజీనామా లేఖను మీడియా సమక్షంలో అందరికి చూపించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. తెలంగాణ సమాజం ఆకలినైనా సహిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని వదిలిపెట్టదని అన్నారు. కేసీఆర్‌ చేతిలో ఆత్మగౌరవం బంధీ అయ్యిందని కోమటిరెడ్డి విమర్శించారు. మునుగోడు ప్రజలు, తెలంగాణ సమాజం కోసం తన పదవిని త్యాగం చేస్తున్నట్లు తెలిపారు. కుటంబ పాలనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు స్వార్థం ఉంటే ఉప ఎన్నిక కోరుకోరని, రాజీనామా అనంతరమే మునుగోడు ఉప ఎన్నికపై ప్రజలు మాట్లాడుకుంటున్నారని అన్నారు.  రాజీనామా అనగానే కొత్తగా గట్టుప్పల్ మండలం వచ్చిందన్నారు.

సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఈ యుద్దం తన కోసం కాదని, మునుగోడు ప్రజల కోసం అని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కేసీఆర్‌కు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తప్ప ఇతరులు కనిపించడం లేదని విమర్శించారు. ఎన్నో ఆశలతో తెలంగాణ వచ్చిందని, తన రాజీనామాతోనైనా సీఎం కేసీఆర్‌ కళ్లు తెరవాలని హితవు పలికారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చి.. కేసీఆర్‌ చేతిలో చిక్కిన తెలంగాణ తల్లికి విముక్తి కలిగించాలని కోరారు.
చదవండి: చాయ్‌కీ డబ్బులు లేవు.. సీఎం స్థానిక సంస్థల సమావేశాన్ని బహిష్కరిస్తున్నా

మరిన్ని వార్తలు