సీఎం జగన్‌ ఎంత సమర్థుడో చెప్పడానికి ఇది చాలు..

21 Dec, 2023 15:34 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. జగన్‌గా అందరి అభిమానాన్ని చూరగొంటున్న ఆయన సీఎంగా తనకు ముందు, తన తర్వాత అన్న చందంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఏపీలో గత డెబ్బై ఏళ్లలో ఎన్నడూ చేయని మార్పులు, సంస్కరణలు ఆయన తీసుకు వచ్చారు.అన్నం ఉడికిందా ?లేదా అన్నది చూడడానికి ఒక మెతుకుపట్టుకుంటే చాలని అంటారు. అలాగే జగన్ శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద నిర్మించిన డయాలిసిస్ కేంద్రం, కిడ్నీ రీసర్చ్ సెంటర్ , రెండు, మూడు నియోజకవర్గాలకు చెందిన 800 గ్రామాలకు శుద్ది చేసిన తాగునీటిని అందించిన స్కీమ్‌ను చూస్తే చాలు జగన్ ఎంత సమర్ధుడన్నది అర్ధం అవుతుంది.

✍️అంతేకాదు. ఆయన ఎంత మానవత్వంతో ఉండేది కూడా ఈ పధకం రుజువు చేస్తుంది. బలహీనవర్గాలపట్ల జగన్ కు ఎంత  అభిమానం ఉంది తెలుసుకోవడానికి ఆయన అమలు చేసిన వివిధ  సంక్షేమ స్కీములను గమనిస్తే సరిపోతుంది. ఇవే కాదు.. విజయవాడ నగరం నడిబొడ్డున పేదవర్గాలు, బలహీనవర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్  125 అడుగుల విగ్రహం , అక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ తదితర ఏర్పాట్లతో దానిని ఒక టూరిస్ట్ స్పాట్ గా తీర్చి దిద్దుతున్న వైనం చూస్తే జగన్ ఎంత కమిట్ మెంట్ తో పనిచేసేది తెలుస్తుంది.విద్యా రంగంలో జగన్ తీసుకు వచ్చిన సంస్కరణలు, స్కూళ్లను బాగు చేయడానికి ఆయన చేపట్టిన సంకల్పం గతంలో ఎన్నడూ జరగలేదన్నది వాస్తవం.

✍️అమ్మ ఒడి పేరుతో ఒక పధకాన్ని అమలు చేసి ఎవరూ స్కూల్ మానేయరాదన్న ఉద్దేశంతో  పిల్లల తల్లుల ఖాతాలలో పదిహేను వేల రూపాయలు వేస్తున్నారు. దీనిని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా అనుసరిస్తామని చెప్పడమే జగన్ సక్సెస్ కు నిదర్శనం. ఇదే  కాదు. జగన్ తీసుకు వచ్చిన పలు సంక్షేమ స్కీములను మరింత ఎక్కువ ఇస్తామని నలభైఐదేళ్ల రాజకీయ సీనియర్, పద్నాలుగేళ్ల సి.ఎమ్. అనుభవం కలిగిన చంద్రబాబు చెబుతున్నారంటే ఎవరు బాగా పనిచేశారో అర్ధం అవుతుంది. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం మరో సంచలనం. ప్రజల ఇళ్లవద్దకే డాక్టర్ లు వెళ్లేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విలేజ్ క్లినిక్స్ ద్వారా విశేష సేవలు అందిస్తున్నారు. అంతేకాక ఆరోగ్యశ్రీ కింద పేదలకు 25 లక్షల వరకు సాయం చేయడానికి వీలుగా నిర్ణయం తీసుకున్నారు.

✍️తెలంగాణలో ఇది పది లక్షల వరకే ఉంది. వృద్యాప్య పెన్షన్ లను మూడువేల రూపాయలుగా చేయడమే కాకుండా వృద్దుల ఇళ్ల వద్దకే వలంటీర్లను పంపించి అందచేస్తున్న తీరు నభూతో నభవిష్యత్ అని చెప్పాలి. వృద్దులను గౌరవిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని, ఏకైక సమాజం ఆంధ్ర సమాజం అని  ఆయన రుజువు చేశారు. నవరత్నాల పేరుతో  ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన అంశాలన్నిటిని అమలు చేసిన ఘనత జగన్ ది. అభివృద్ది, పరిశ్రమలు లేవని విపక్షం, ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ పలు సంస్థలను ఏపీకి తీసుకు వస్తున్నారు. నాలుగు ఓడరేవులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారంటేనే జగన్ విజన్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఆ ఓడరేవుల వద్ద పారిశ్రామికవాడల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. రామాయంపట్నం వద్ద అరవైవేల కోట్ల రూపాయల వ్యయంతో ఇండోసోల్ కార్పొరేషన్ సోలార్ పానెల్స్ తయారీ కర్మాగారం రాబోతోంది. ఇప్పటివరకు సుమారు లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి ఐదింటిని అప్పుడే పూర్తి చేసి మరో ఐదింటిని నిర్మిస్తున్నారు.  కరోనా రెండేళ్ల సంక్షోభాన్ని అత్యంత శ్రద్దతో ఎదుర్కుని ప్రజల మన్ననలను ఆయన పొందారు.31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి,వారికి ఇళ్లు నిర్మిస్తున్న చరిత్ర జగన్ దే.గ్రామాలలో పట్టణాలలో వివిధ సంస్థల కోసం సుమారు ఏభైవేల భవనాలను నిర్మించారు. ఇదంతా అభివృద్ది కాదని ఎవరైనా అనగలరా?అలా  అంటే వారు కళ్ళు ఉండి కూడా చూడలేని అంధులన్నమాట.

✍️పాలనను ప్రజల ఇళ్ల వద్దకు తీసుకు వెళ్లి ప్రభుత్వం అంటే ఇలా ఉండాలని దేశానికే ఒక సందేశం పంపించారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల కనీస అవసరాలు తీర్చుతున్నారు. వారికి కావల్సిన సర్టిఫికెట్లు సైతం ఇళ్లకే తీసుకు వెళ్లి ఇస్తున్నారు. గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా విశేష సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. సచివాలయం అంటే రాజధాని పేరుతో ఉన్న ప్రాంతంలోనే కాకుండా పల్లెటూరులో కూడా ఉంటుందని కొత్త నిర్వచనం ఇచ్చిన ఆలోచనాశీలి జగన్ అని చెప్పాలి.ఈ సచివాలయాలకు ఒకేసారి లక్షాపాతికవేల మందిని ఎంపిక చేసి, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రికార్డు కూడా జగన్ సొంతం.ఈ మధ్య నేను గుడివాడ సమీపంలోని పోలిమెట్ల అనే గ్రామానికి ఒక వ్యక్తిగత కార్యక్రమం కోసం వెళ్లాను. అక్కడ అనుకోకుండా కొందరు బలహీనవర్గాలవారు నన్ను చూసి గుర్తు పట్టి మాట్లాడారు. సాక్షి టీవీలో వస్తారు కదా!కెఎస్ ఆర్ లైవ్ షో నడుపుతారు కదా అని అన్నారు. ఔనని చెప్పగానే వారంతా సంతోషంగా నాతో కబుర్లు చెప్పారు.షేక్ హాండ్ ఇచ్చారు.కొందరు ఫోటోలు తీసుకున్నారు. చివరిగా ఒక పెద్దాయన నా చేయి పట్టుకుని జగన్ గారిని జాగ్రత్తగా చూసుకోండయ్యా అని చెప్పడం విని ఆశ్చర్యపోవడం నా వంతు అయింది.

✍️అంటే జగన్‌తో పరిచయం ఉన్నవారు ఎవరైనా కనిపిస్తే ఆయనతోనే మాట్లాడినంతగా సంబర పడుతున్నారన్నమాట. ఈ ఘటనతో బలహీనవర్గాల పెన్నిధిగా జగన్ ఎలా మరారో నిదర్శనపూర్వకంగా నాకు సుబోధకమైంది.నిజంగా ఇది గొప్ప విషయం. ఒకప్పుడు 1978 లో కాంగ్రెస్ చీలి, ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఐ ని ఏర్పాటు చేసుకున్నారు. కాని పెద్ద,పెద్ద కాంగ్రెస్ నేతలు, మోతుబరులు, పెత్తందారులు అంతా జనతా పార్టీ, కాంగ్రెస్ ఆర్ లోకి వెళ్లారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందన్నంతగా ప్రచారం జరిగింది.

✍️కానీ ఆశ్చర్యంగా కాంగ్రెస్ ఐ గెలిచింది. అది కూడా బంపర్ మెజార్టీతో. దానికి కారణం ఏమిటంటే పెత్తందార్లంతా జనతాపార్టీలోకి వెళితే పేద, బలహీనవర్గాలవారు అత్యధిక శాతం ఇందిరాగాంధీ పై అభిమానం చూపి ఆమెను గెలిపించారు. అంతకు ముందు ఆమె దేశ ప్రధానిగా ఉండే అమలు చేసిన వివిధ స్కీముల కింద పేదవర్గాలు లబ్ది పొందడమే ఇందుకు కారణం. అప్పట్లో మోతుబరులు అలాంటి స్కీములను వ్యతిరేకించేవారు. ఇప్పుడు ఇందిరాగాంధీని మించి జగన్ సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు. తత్ఫలితంగానే  ప్రస్తుతం బలహీనవర్గాలు మొత్తం జగన్ వైపే ఉన్నాయని పలు దృష్టాంతాలు వెల్లడిస్తున్నాయి.సామాజిక సాధికార యాత్రలు సక్సెస్ అవుతుండడం కూడా ఇందుకు ఒక ఆధారం. నిజానికి  ఇప్పుడు ఎవరో కొంత మంది పెత్తందారులు తప్ప, దాదాపు అన్ని వర్గాలు జగన్ నాయకత్వం పట్ల సంతృప్తిగా ఉన్నాయి. పేద వర్గాలైతే నూటికి నూరు శాతం జగన్ పక్షాన ఉన్నాయన్న విషయం అర్ధం అవుతుంది.అందువల్లే వైఎస్ ఆర్ కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి  వస్తుందని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జనం అంతా విశ్వసిస్తున్నారు.ఆశీర్వదిస్తున్నారు.  జగన్ కు మరోసారి  పుట్టినరోజు శుభాకాంక్షలు. అభినందనలు. మళ్లీ గెలిచి ప్రజలకు మరింత గొప్పగా సేవలందిస్తారని ఆకాంక్షిద్దాం.


కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

whatsapp channel

మరిన్ని వార్తలు