కేసీఆర్‌ సరే.. మీ సంగతేంటి చంద్రబాబు!

13 Dec, 2023 11:39 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల ఫలితంపై ఒక వ్యాఖ్య చేశారు. తుపాను బాధితులను పరామర్శ పేరుతో సాగించిన రాజకీయ పర్యటనలో ఒక సభలో ఆయన మాట్లాడుతూ మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, విర్రవీగితే తెలంగాణలో ఏం జరిగిందో చూశామని అన్నారు.

కోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ, తన కేసును ప్రస్తావిస్తూ, తను సాంకేతికంగా, చట్టపరంగా దొరకనని చెప్పారు. తప్పు చేయకపోయినా ఏభై రెండు రోజులు జైలులో ఉంచారని ఆయన తెలిపారు. తన కోసం ప్రపంచం అంతా పోరాడిందని కూడా చంద్రబాబు చెప్పుకున్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించకూడదా? మీరు ప్రశ్నించినా కేసులు పెడతారని ఆయన అన్నారు.

అలాగే, జనసేన-టీడీపీ పొత్తు, వచ్చే ఎన్నికలలో ప్రభావం గురించి కూడా మాట్లాడారు. ఇంతకీ చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విర్రవీగడం వల్లే ఓటమి చెందారని నమ్ముతున్నారా? అదే నిజమైతే తాను 2004లోనూ, అలాగే 2019లోనూ ఓడిపోవడానికి కారణం విర్రవీగడమేనని ఒప్పుకుంటున్నారా అన్న  ప్రశ్న  వస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు అనుసరించిన విధానాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా టోకరా వేసిన తీరు, ఆయన వ్యవహార శైలికి నిరసనగానే టీడీపీని ఓడించారు. అందుకే ఆ పార్టీకి కేవలం 23 సీట్లే  వచ్చాయి.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన విషయంలో మరీ అంత విమర్శలు లేవు. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో అభివృద్ది చేయడం కూడా గమనించిన ప్రజలు ఈ ప్రాంతంలో అన్ని సీట్లను బీఆర్ఎస్‌కు కట్టబెట్టారు. తెలంగాణ శాసనసభలో 119 సీట్లకు గాను, కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్‌కు 39 సీట్లు వచ్చాయి. ఏపీలో 175 సీట్లకు గాను చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీకి కేవలం 23 స్థానాలే దక్కాయి. దీని గురించి ఏమంటారు!.

అదే సమయంలో కేసీఆర్ యాటిట్యూడ్ ప్రాబ్లమ్ కూడా ఉన్న మాటనిజమే. ఇది ఎవరి విషయంలో అయినా వర్తిస్తుంది. ఆ సంగతి మర్చిపోయి, తానేదో ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినట్లు.. తనను ఓడించింది విర్రవీగినందువల్ల కాదనట్లు మాట్లాడడమే ప్రత్యేకత. చంద్రబాబు ఏ అంశంలో అయినా ద్వంద్వ ప్రమాణాలు పాటించగల నేర్పరి. అలాగే కేసీఆర్ విషయంలోకూడా చేశారు. మొన్నటివరకు కేసీఆర్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని చెబుతుండేవారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ఏదైనా విమర్శ చేయదలిస్తే  తెలంగాణ పాలనను అప్పుడప్పుడు పొగుడుతుండేవారు. ఇదే  చంద్రబాబు 2014లో కేసీఆర్‌కు అసలు పాలన గురించి ఏం తెలుసని ప్రశ్నించేవారు. 

ఓటుకు నోటు కేసు తర్వాత కేసీఆర్ దెబ్బకు భయపడి చెప్పాపెట్టకుండా పెట్టే బేడా సర్దుకుని చంద్రబాబు విజయవాడకు వచ్చేశారు. ఆ తర్వాత ఆయన కేసీఆర్‌పై విమర్శలు చేయడం అంటేనే గజగజలాడేవారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో కలిసి పొత్తుపెట్టుకున్నప్పుడు కేసీఆర్‌పై ఆరోపణలు చేసినా, టీఆర్ఎస్ గెలిచేసరికి మళ్లీ మౌనంలోకి వెళ్లిపోయారు. ప్రధానమంత్రి మోదీ గురించి కూడా అంతే. మోదీని వ్యక్తిగతంగా కూడా దూషించేవారు. ఆయన 2019లో తిరిగి అధికారం చేపట్టడంతో మళ్లీ పొగడటం ఆరంభించారు. ఇప్పుడు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారంటే  ఆయన ఓడిపోయారులే అన్న భావన తప్ప ఇంకొకటి కాదు. కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ విర్రవీగారని అనడం ద్వారా చంద్రబాబు మరో సంగతి స్పష్టం చేశారని వెల్లడైందన్న విశ్లేషణలు వచ్చాయి. 

తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు ఇచ్చిందన్న సంగతి తేటతెల్లమైందని అంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ను, సోనియాగాంధీని కూడా పరుష పదజాలంతో చంద్రబాబు దూషించేవారు. తదుపరి వారితో పొత్తుపెట్టుకున్నారు. ఓటమి తర్వాత కాంగ్రెస్‌ను గాలికి వదలివేశారు. కనుక చంద్రబాబు.. ఎప్పుడు ఏదీ ప్రస్తుతమో అదే చేస్తుంటారు. ఈరోజు నాకేంటి అని తప్ప ఇంకొకటి ఆలోచించరని ఆయనను బాగా దగ్గరగా చూసిన ఒక ప్రముఖుడు వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా అంతే చేశారు. తన కేసు గురించి కూడా ప్రస్తావించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్న వ్యాఖ్యలు  వచ్చాయి. తాను తప్పు చేయకపోయినా జైలులో పెట్టారని అంటున్నారు. నిజంగానే తప్పు జరగకపోతే తన మాజీ పీఎస్‌ను అమెరికా పారిపోయేలా ఎందుకు చేశారు?. 17ఏ కింద కేసును కొట్టివేయాలని అంటున్నారే తప్ప, నిధుల దుర్వినియోగం చేయలేదని ఎందుకు వాదించలేకపోతున్నారు. ఇదే కేసులో ఈడీ నలుగురు వ్యక్తులను ఎలా అరెస్టు చేసింది? ఈ ప్రశ్నలకు ఎన్నడూ సమాధానం ఇవ్వడం లేదు.

ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. ఈ మధ్య ఎస్ఐ పరీక్షలకు సంబంధించి కొందరు అభ్యర్ధులు తమ ఎత్తు విషయమై హైకోర్టుకు వెళ్లారు. గౌరవ న్యాయమూర్తులు స్వయంగా వారి ఎత్తును కొలిపించి తీర్పు ఇచ్చారు. మరి అదే చంద్రబాబు కేసులో ఒక ప్రైవేటు ఆస్పత్రి ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా ఆయనకు గుండె జబ్బు, తదితర వ్యాధులు ఉన్నాయని నిర్దారణకు వచ్చి బెయిల్ ఇచ్చేసింది. ప్రైవేటు ఆస్పత్రి రిపోర్టును మరో ప్రముఖ ప్రభుత్వ సంస్థకు పంపి వారి అభిప్రాయం ఎందుకు తీసుకోలేదని ఎవరికైనా సందేహం వస్తే ఏం చెబుతాం?. తీరా బెయిల్ వచ్చాక, ఇప్పుడు చంద్రబాబు తనకు ఎలాంటి గుండె జబ్బు లేదన్నట్లుగా శుభ్రంగా తిరుగుతున్నారే. మంచిదే. కానీ, తప్పుడు సర్టిఫికెట్ ఆధారంగా బెయిల్ పొందారేమో, కోర్టును తప్పుదారి పట్టించారేమో అన్న అభిప్రాయం రాకుండా ఉంటుందా?. ఏది ఏమైనా చంద్రబాబు జైలుకు వెళ్లకముందు తనను ఎవరు ఏమీ చేయలేరని, ముఖ్యమంత్రి  జగన్ తనను ఏం చేస్తారని ఇష్టారీతిన మాట్లాడేవారు. 

ప్రస్తుతం మాత్రం స్వరం మార్చి తనను అన్యాయంగా జైలులో పెట్టారని చెబుతున్నారు. తనకోసం ప్రపంచం అంతా కష్టపడిందని చిత్రమైన స్టేట్ మెంట్  ఇస్తూ ప్రజలను భ్రమ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. జనసేన పొత్తు గురించి మాట్లాడుతున్నారు  కానీ, ఒకవేళ  అధికారం వస్తే, పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది లేనిదీ మాత్రం ప్రస్తావించడం లేదు. అందుకే మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. జనసేన క్యాడర్‌కు, పవన్‌కు మధ్య యుద్దం జరుగుతోందని ఆయన అన్నారు. తనకు కావాల్సింది  జేజేలు, చప్పట్లు కాదని, ఓట్లు అని  పవన్ అంటున్నారని, ఓట్లు సరే.. అధికారం సంగతేమిటని జనసైనికులు ఆయనను ప్రశ్నిస్తున్నారని జోగయ్య పేర్కొన్నారు. జనసేనను గెలిపిస్తే అధికారం అదే వస్తుందని పవన్ చెబుతున్నారని, కానీ అధికారం వస్తుందని నమ్మిస్తేనే ఓట్లు వేస్తారని జనసేన నేతలు అంటున్నారని ఆయన విశ్లేషించారు.

కనీసం అరవైసీట్లు అయినా జనసేన తీసుకోవాలని జోగయ్య సూచించారు. జనసేన వెంట టీడీపీ ఉందని కార్యకర్తలలో విశ్వాసం కలిగిస్తేనే ఫలితం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మరి దీనికి చంద్రబాబు అంగీకరిస్తారా? జనసేనకు అరవై సీట్లు ఇస్తారా? ముఖ్యమంత్రి పదవిలో షేరింగ్ ఉంటుందా? ఉండదా? ఇవేవి తేల్చకుండా చంద్రబాబు జనసేన కార్యకర్తలను కలలోకంలో ఉంచాలని చూస్తున్నారు. పవన్‌కు రాజకీయంగా వ్యూహాలు  లేని పరిస్థితిని, తెలంగాణలో జనసేనకు ఎదురైన చేదు అనుభవాలను తనకు అనుకూలంగా మలచుకుని ఆ పార్టీని తన చెప్పుచేతలలో ఉంచుకోవాలని చంద్రబాబు యత్నిస్తున్నారు. దీనికి ఆత్మాభిమానం ఉండే జనసైనికులు అంగీకరించడం కష్టమేనని జోగయ్య వ్యాఖ్యలను బట్టి అర్ధం అవుతుంది. ఎందుకంటే  ఒక్కసారి అధికారం వస్తే చంద్రబాబును పట్టుకోవడం కష్టమని, ఆయన విర్రవీగుతారన్నది జనసేన వారి భయం. జనసేనకు మొండి చేయి చూపినా చేయగలిగేది ఏమీ ఉండదన్నది వారి అనుమానం.


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

>
మరిన్ని వార్తలు