పవన్‌.. చంద్రబాబు, లోకేష్‌ ఆ మాట చెప్పగలరా?

9 Dec, 2023 11:08 IST|Sakshi

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఆత్మగౌరవం గురించి మాట్లాడారు. కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం రానివ్వనని ఆయన అన్నారు. కానీ, ఇక్కడ అసలు సమస్య అదే కదా!. ఆయన తన ఆత్మాభిమానాన్ని వదలుకోవడమే కాకుండా కార్యకర్తల గౌరవాన్ని కూడా  గోదాట్లో కలుపుతున్నారనే కదా జనసైనికులు బాధపడుతున్నది. ముఖ్యమంత్రి పదవి గురించి తాను, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి కూర్చుని మాట్లాడుకుంటామని మరో మాట చెప్పారు. తాను అధికారం కోసం కాదని, మార్పు కోసం పనిచేస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

✍️విశాఖలో తన పార్టీ సానుభూతిపరుడినే ఆయన పార్టీలో చేర్చుకున్నారట. ఆ సందర్భంగా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దానికి జనం లేక వెలవెలపోవడం మరో విశేషం. నిజానికి సినిమా స్టార్ అయిన  పవన్ కళ్యాణ్ సభకు జనం ఎగబడతారని ఆయన నమ్మకం. కానీ, ఆసక్తికరంగా ఇక్కడ ఖాళీ కుర్చీలు స్వాగతం పలకడం, కాస్త జనం కోసం రెండు, మూడు గంటలు హోటల్‌లో వేచి ఉండడం ఆ పార్టీ పరిస్థితిని తెలియచేస్తుంది. దీనిని పక్కనబెడితే పవన్ కళ్యాణ్ ఏనాడైనా ఆత్మాభిమానంతో వ్యవహరించారా? తన తల్లిని లోకేష్ దూషించారని ఆయనే చెప్పారు కదా!. మరి అలాంటి వ్యక్తి నుంచి క్షమాపణ అయినా కోరారా?. అలా కోరకపోవడాన్ని ఆత్మగౌరవం అని ఎవరైనా అనుకుంటారా?. జనసేనలో ఉన్నది అలగా జనం అని అన్న బాలకృష్ణ ఎదుట అన్‌స్టాపబుల్‌గా నవ్వుతూ కూర్చున్నారే. దానిని ఏమంటారు. 

✍️టీడీపీ ఆఫీస్ నుంచి తనకు అప్పట్లో పరిటాల రవి గుండు కొట్టించారని ప్రచారం చేశారే. అయినా దానిపై చంద్రబాబు నుంచి వివరణ కోరారా? ఇవేవి చేయకుండా, టీడీపీతో స్నేహం కోసం అర్రులు చాచిన వైనాన్ని ఏమని అంటారు?. టీడీపీ వెనుక తిరగడంలేదని, పక్కన ఉంటున్నానని ఆయన చెబితే జనం ఎవరైనా నమ్ముతారా?. నిజంగానే పవన్ కళ్యాణ్ టీడీపీతో సమాన స్థాయిలో ఉన్నానని అనుకుంటే ఆ మాట టీడీపీ అధినేత చంద్రబాబుతో కానీ, ఆయన కుమారుడు లోకేష్‌తో చెప్పించగలరా?. జనసేనకు, టీడీపీకి ఫిఫ్టి, ఫిఫ్టి అంటే చెరో సగం సీట్లు అని చెప్పించగలరా?. అలా చేయగలిగితే కచ్చితంగా జనసేన గౌరవాన్ని నిలబెట్టుకున్నట్లే అని అంగీకరించవచ్చు. అలా చేయకపోగా టీడీపీవారు తిట్టినా, గిల్లినా పడి ఉండండని చెప్పడం పవన్ కళ్యాణ్‌కే చెల్లింది. దానిని ఏ రకపు ఆత్మగౌరవం అని చెబుతారు!.

✍️టీడీపీ-జనసేన పొత్తు గురించి జనసైనికులు ప్రశ్నిస్తే వారు వైఎస్సార్‌సీపీకి అమ్ముడుపోయినట్లేనని ఆయన సూత్రీకరించారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ తనను మాత్రం ఎవరు ప్రశ్నించరాదని జనసైనికులను ఆదేశిస్తున్నారు. ప్రశ్నిస్తే వైఎస్సార్‌సీపీకి అమ్ముడు పోయినట్లయితే, అదే ప్రశ్న జనసైనికులు కూడా వేయవచ్చు కదా!. టీడీపీకి ఎంతకు పార్టీని అమ్మివేశారని జనసైనికులకు సందేహం రాదా!. పవన్ ప్రత్యర్దులు  ప్యాకేజీ స్టార్ అంటే ఆయనకు కోపం వస్తుంది. అదే మాట జనసైనికులను పవన్ అనవచ్చన్నమాట! ఇది ఏ పాటి ప్రజాస్వామ్యం. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఓటములతో తనను పోల్చుకోవడం అంటే తన అభిమానులకు చరిత్ర తెలియదనుకుని పిచ్చివాళ్లను చేయడమేనని పలువురు వ్యాఖ్యానించారు. అబ్రహం లింకన్ సామాన్యుడిగా ఉండి ఎదుగుతూ వచ్చారు. కానీ, పవన్ సినిమాలలో నటించి పాపులర్ అయి, ఆ తర్వాత రాజకీయాలలోకి వచ్చారు. అంటే ఒకరకంగా పైనుంచి దిగుమతి అయినట్లన్నమాట.  

✍️తెలంగాణ ఎన్నికలలో ఎనిమిది సీట్లలో బీజేపీతో కలిసి పోటీచేసి అన్ని స్థానాల్లో డిపాజిట్లు పొగొట్టుకోవడంపై ఎందుకు వివరణ ఇవ్వలేకపోయారు?. ఆ ఎన్నికల సమయంలో ఏ ప్రాతిపదికన చంద్రబాబుతో భేటీ అయ్యారు?. అప్పుడు కనీసం ఆ ఎనిమిది మంది అభ్యర్ధులకైనా మద్దతు ఇవ్వాలని పవన్ కోరకపోవడం సొంతపార్టీ అభ్యర్ధులకు వెన్నుపోటు పొడవడం కాదా!. చంద్రబాబు మద్దతు ఇవ్వకపోగా, కాంగ్రెస్‌కు సాయం చేయడం ఎలాంటి స్నేహ ధర్మం అవుతుంది. తానేమో బీజేపీతో కలిసి పోటీ, చంద్రబాబేమో కాంగ్రెస్ వారి వద్దకు టీడీపీ జెండాలు పంపడం.. ఇది ఏపాటి విలువలతో కూడిన రాజకీయం అవుతుంది. మళ్లీ వీరిద్దరూ వచ్చి ఏపీలో పొత్తు!ఎంత అనైతికం. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నట్లా? లేనట్లా? ఇలాంటి సందేహాలు ఎవరైనా అడిగితే అది వైఎస్సార్‌సీపీకి అమ్ముడుపోయినట్లా?. ఏమి దిక్కుమాలిన రాజకీయం ఇది!. ఈయనకు  ఆత్మగౌరవం ఉంటే, ఇలా చేయగలుగుతారా?.

✍️సీఎం సీటు గురించి మాట్లాడుకోవడం ఏమిటి? అవేవి చర్చించకుండా, సీట్ షేర్ లేకుండా ఎవరైనా ఎదుటి పార్టీకి సరెండర్ అయిపోతారా?. పైగా కార్యకర్తలను కూడా అలాగే ఉండమంటారా?ఇంతకన్నా స్వార్ధ రాజకీయం ఉంటుందా?. తాను  ఓటమి బాధ చూస్తున్నానని, అందుకే ఈసారి ఎలాగైనా గెలవాలన్న భావనతో టీడీపీ వెనుక ఉన్నానని పరోక్షంగానో, ప్రత్యక్షంగానో చెబుతున్నారనిపించడం లేదా!. ఆయన  ఒక్కరు గెలిస్తే చాలా? మిగిలిన జనసేన నేతలను గాలికి వదలివేస్తారా? చంద్రబాబు, లోకేష్ కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ కూడా సీఎం అభ్యర్ధే.. తమ కూటమి అధికారంలోకి వస్తే  ఆయనకు రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని కేటాయిస్తామని ఎందుకు చెప్పడం లేదు?. ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది కాదా?.

✍️ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిది దుష్టపాలన అని విమర్శిస్తున్న పవన్ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలకన్నా ఎక్కువ ఇస్తానని  చెబుతున్నారు. అంటే అప్పుడు అది ఏ పాలన అవుతుంది. నిజానికి ఏపీలో  తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అలాంటి వ్యక్తిది దుష్టపాలన అవుతుందా? లేక తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేయని చంద్రబాబుది దుష్టపాలన అవుతుందా?. అలాంటి పాలనకు ఐదేళ్లపాటు మద్దతు ఇచ్చి, ఆ తర్వాత ఇంత అవినీతి చూడలేదని నేరుగా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేసి బయటకు వచ్చిన పవన్ ఏ ముఖంతో టీడీపీకి సపోర్టు చేస్తున్నారు?.

✍️గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడిన పవన్‌కు దానిని తాము అధికారంలోకి వస్తే వాటిని ఎత్తివేస్తామని చెప్పే ధైర్యం ఉందా!. పవన్‌ను కరివేపాకు మాదిరి వాడుకోవడానికే చంద్రబాబు, లోకేష్‌లు వ్యూహం పన్నారన్న సంగతి సామాన్యులకైనా అర్ధం అవుతుంది. జనసైనికులకు అర్ధం కాదా! పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ల తర్వాత ఆత్మగౌరవం గురించి మాట్లాడవలసి వచ్చిందంటేనే ఆయన ఇంతకాలం తప్పు చేశానని అంగీకరించినట్లే అని చెప్పాలి.


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

whatsapp channel

మరిన్ని వార్తలు