ఇండియా వరల్డ్‌ కప్‌..కేసీఆర్‌ హ్యాట్రిక్‌..కొట్టడం పక్కా: కేటీఆర్‌

17 Nov, 2023 20:18 IST|Sakshi

‍సాక్షి, హైదరాబాద్‌ : విరాట్  కోహ్లీ సెంచరీ కొట్టినట్టు బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో సెంచరీ కొట్టాలని  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. వరల్డ్ కప్‌లో ఇండియా గెలవడం పక్కా, తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో జరిగిన రోడ్‌ షోలో కేటీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీం ఇండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌పై  కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘అజారుద్దీన్ వస్తే క్రికెట్ ఆడండి. కానీ ఓటు మాత్రం బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు వేయండి. అజారుద్దీన్‌కు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఏ గల్లీ తెలియదు. ఏ మనిషి తెలియడు. అజారుద్దీన్‌ను ఉత్తరప్రదేశ్ నుంచి తన్ని తరిమేశారు. యూపీలో చెల్లని అజారుద్దీన్  హైదరాబాద్‌లో ఎలా చెల్లుతారు. కాంగ్రెస్ నాయకులకు పదవుల మీద ఉన్న మోజు తెలంగాణ ప్రజల మీద లేదు. కాంగ్రెస్ పార్టీలో 11 మంది సీఎం క్యాండిడేట్‌లు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే కల్లోలం, కాంగ్రెస్ అంటేనే అధికారం కోసం ఆరాటం. 

కాంగ్రెస్ పార్టీ మెట్రో రైలు ఎందుకు పూర్తి చేయలేక పోయింది. హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు కళ్లుండి చూడలేక పోతున్నారు. అధికారంలోకి రాగానే 18 యేళ్లు నిండిన ఆడబిడ్డలకు 3 వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం’ అని కేటీఆర్‌ తెలిపారు. 

కాగా, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా టీం ఇండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్‌ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్‌ దివంగత నేత పి.జనార్ధన్‌రెడ్డి కొడుకు విష్ణు బీఆర్‌ఎస్‌లో చేరి సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారిం‍ది. 

ఇదీచదవండి.. బీజేపీ గాలిని వాళ్లే తీసుకున్నారు : రాహుల్‌ గాంధీ

మరిన్ని వార్తలు