Amethi: హ్యాట్రిక్‌ నేతకు చుక్కలు చూపించిన మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌!

6 Mar, 2024 18:46 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌ దేశంలో రాజకీయంగా చాలా కీలకమైన రాష్ట్రం. ఇక్కడి లోక్‌సభ స్థానాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు పోటీ చేస్తున్న సీట్లు ఇక్కడే ఉన్నాయి. గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా భావించే అమేథీ స్థానం నుంచి 2024 ఎన్నికల్లో మరోసారి లోక్‌సభకు ఎన్నికయ్యేందుకు పోటీలో నిలిచారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani). 

2019 ఎన్నికల్లో స్మృతి ఇరానీ తీవ్ర ఎన్నికల పోరులో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు, వరుసగా మూడుసార్లు గెలిచిన రాహుల్ గాంధీని (Rahul Gandhi) ఓడించి సంచలనం సృష్టించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌పై ఇరానీ 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో వాయనాడ్‌ నియోజకవర్గంలో కూడా పోటీ చేసిన రాహుల్‌ గాంధీ అక్కడ నుంచి గెలిచి లోక్‌సభలోకి అడుగుపెట్టారు. 

2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేతిలో స్మృతి ఇరానీ ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత ఐదేళ్లలో తన పాపులారిటీని పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని ఓడించి చారిత్రాత్మక విజయంతో కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మరోసారి అమేథీ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే గత చారిత్రక పోరు మరోసారి పునరావృతం కానుంది.

స్మృతి ఇరానీ గురించి..
1976 మార్చి 23న జన్మించిన స్మృతి ఇరానీ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1998 మిస్ ఇండియా అందాల పోటీలో ఫైనలిస్టులలో ఒకరైన ఆమె.. ఏక్తా కపూర్ ప్రముఖ డైలీ సీరియల్‌ ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’లో తులసి విరానీ పాత్రతో ప్రత్యేక గుర్తింపు పొందారు. దీంతో మరిన్ని టీవీ షోలలోకూ ఆమె కనిపించారు.

టెలివిజన్‌లో విజయవంతమైన నటనా జీవితం తర్వాత స్మృతి ఇరానీ 2003లో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీజేపీలో చేరిన ఆమె 2004లో పార్టీ మహారాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2004 సాధారణ ఎన్నికల్లో ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబల్ చేతిలో ఓడిపోయారు. 2010లో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ఏడాది తర్వాత గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

అమేథీ లోక్‌సభ నుండి అప్పటికే రెండుసార్లు గెలిచిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై 2014 ఎన్నికల్లో స్మృతి ఇరానీ బీజేపీ నుంచి పోటీ చేశారు. గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా భావించే ఆ స్థానంలో పోటీ చేసి ఆసక్తి రేకెత్తించగలిగారు. రాహుల్ గాంధీ గెలుపు మార్జిన్‌ను 1 లక్ష ఓట్లకు తగ్గించారు. ఓటమి పాలైనప్పటికీ ఆమె మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా నరేంద్ర మోదీ మొదటి మంత్రివర్గంలో చేరారు. 38 ఏళ్ల వయసులో ప్రధాని మోదీ తొలి క్యాబినెట్‌లో ఆమె అత్యంత పిన్న వయస్కురాలు. 2014 నుండి 2019 వరకు స్మృతి ఇరానీ హెచ్‌ఆర్‌డీ, టెక్స్‌టైల్స్, ఇన్ఫర్మేషన్ & బ్రాడ్‌కాస్టింగ్ పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు.

2019లో అమేథీ నుంచి రాహుల్ గాంధీని ఓడించి సంచలనం సృష్టించారు. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ కూటమి అభ్యర్థులను నిలబెట్టకుండా రాహుల్‌ గాంధీకి మద్దతు ఇచ్చినప్పకీ, స్మృతి ఇరానీ 50,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2022 జూలై నుండి ఆమె మైనారిటీ వ్యవహారాల శాఖను కూడా నిర్వహిస్తున్నారు. స్మృతి ఇరానీ పార్సీ వ్యాపారవేత్త జుబిన్ ఇరానీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు