ఎంపీ రఘురామ ఓ బఫూన్‌ 

26 Aug, 2022 04:04 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని  

సాక్షి, రాజమహేంద్రవరం: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఓ బఫూన్‌ అని ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మండిపడ్డారు. పొద్దున లేచిన దగ్గర నుంచి మీడియా ముందు కూర్చొని సొల్లు కబుర్లు చెప్పడం తప్ప ఆయన చేయగలిగిందేమీ లేదన్నారు. సొంత కేడర్‌ కూడా లేని ఆయనకు సీఎంను విమర్శించే స్థాయి లేదని ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలోని ఎంపీ కార్యాలయంలో గురువారం ఎంపీ భరత్‌ మీడియాతో మాట్లాడారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో రెండు ఫ్‌లై ఓవర్‌లు మంజూరయ్యాయని.. ఈ విషయమైనా ఎంపీ రఘురామకు తెలుసా? అని ప్రశ్నించారు.

జాతీయ మీడియా సర్వేలన్నీ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకే విజయం దక్కుతుందని స్పష్టం చేస్తున్నాయన్నారు. దీంతో రఘురామ వాటిని తప్పుదోవ పట్టించేందుకు దొంగ సర్వేల నాటకం మొదలుపెట్టాడని దుయ్యబట్టారు. రఘురామ సొంత నియోజకవర్గానికి వెళ్తే ప్రజలే తరిమికొడతారన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు గతంలో ఏ సంక్రాంతికో తన సొంత నియోజకవర్గం కుప్పానికి వెళ్లేవారని ఎంపీ భరత్‌ గుర్తు చేశారు. ఇప్పుడు జగనన్న దెబ్బకు నెలకు మూడుసార్లు కుప్పం వెళ్తున్నారన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చే నాటికి ప్రభుత్వ ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. 14 ఏళ్లు సీఎంగా వ్యవహరించిన బాబు ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి వెళ్లడం ఏంటని నిలదీశారు. సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్తే నానా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన పర్యటనతోనే పోలవరం ఇరిగేషన్‌ అథారిటీలో కదలిక వచ్చిందన్నారు. అలాగే మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక జాతీయ రహదారులు మంజూరయ్యాయన్నారు.  

మరిన్ని వార్తలు