-

బీజేపీ గ్రాఫ్ పెరిగింది.. కారు షెడ్డుకు వెళ్ళడం ఖాయం: ఎంపీ లక్ష్మణ్‌

28 Nov, 2023 13:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ బూటకపు హామీలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌ తెలిపారు. బీజేపీ మ్యానిఫెస్టో ప్రజల మ్యానిఫెస్టోనని పేర్కొన్నారు. ఆచరణకు అమలయ్యే హామీలను మాత్రమే బీజేపీ ఇచ్చిందని చెప్పారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

లక్షల కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇచ్చి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని లక్ష్మణ్‌ మండిపడ్డారు. తెచ్చుకున్న తెలంగాణ అధోగతిపాలు కావొద్దన్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇచ్చే ప్రకటనలు ఆపివేయడం హర్షించదగిన పరిణామమని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ పెయిడ్‌ సర్వేలతో ప్రజలను బూటకపు హామీలతో మోసం చేస్తోందని విమర్శించారు. కౌలు రైతులకు రైతు భరోసా అనేది సాధ్యం కాదని చెప్పారు.  సాధ్యం కాదని తెలిసీ రైతుభరోసా ఇస్తామని చెప్పి ప్రజలను ఏమార్చుతోందని మండిపడ్డారు..

తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందన్నారు లక్ష్మణ్‌. ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటనతో తెలంగాణ క్యాడర్‌లో జోష్ నింపిందని తెలిపారు. బీసీలు, మాదిగలు బీజేపీ వైపే ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. త్వరలో కారు షెడ్డుకు వెళ్ళడం... హస్తానికి మొండి చెయ్యి గ్యారంటీ అని దుయ్యబట్టారు. తెలంగాణలో ఏనాడూ కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లు రాలేదని ప్రస్తావించారు. ఆంధ్ర, రాయలసీమలో వచ్చే మెజార్టీ సీట్లతోనే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు