Parliament elections 2024: రాయ్‌బరేలీ, అమేథీల్లో సమరమే!

9 Jan, 2024 05:22 IST|Sakshi

యూపీలో కాంగ్రెస్‌ పార్టీ కంచుకోటల్లో పోటీకి సమాజ్‌వాదీ పార్టీ సన్నద్ధం

‘ఇండియా’ కూటమిలోకి బీఎస్పీ రాకను వ్యతిరేకిస్తున్న అఖిలేశ్‌ యాదవ్‌  

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి వారి కంచుకోటలుగా పేరొందిన లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సమాజ్‌వాదీ పారీ్ట(ఎస్పీ) సిద్ధమవుతోంది.  ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పొత్తు విఫలమైంది.

ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోకి బీఎస్పీని ఆహా్వనించాలన్న ప్రతిపాదనను సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, అఖిలేశ్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. యూపీలోని 80 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీలను నియమించింది. ప్రస్తుతం యూపీలో రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ), అప్నాదళ్‌ (కమేరావాదీ)తో సమాజ్‌వాదీ పార్టీ పొత్తు కొనసాగిస్తోంది.

సర్వశక్తులూ ఒడ్డుతాం: అఖిలేశ్‌
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి సర్వశక్తులూ ఒడ్డుతామని, సంక్రాంతి తర్వాత పొత్తులపై మాట్లాడుతామని అఖిలేష్‌ యాదవ్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ పారీ్టతో స్నేహాన్ని వదులుకొని, తమ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవలి మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తమను బాగా అవమానించిందన్న భావన ఆయనలో ఉందంటున్నారు.

యూపీలో కాంగ్రెస్‌ కంచుకోటలుగా పేరొందిన రాయ్‌బరేలీ, అమేథీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ నుంచి అభ్యర్థులను బరిలో దింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ రెండు నియోజకవర్గాల్లో సమాజ్‌వాదీ పారీ్టకి బలమైన క్యాడర్‌ ఉంది. అమేథీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీకి ఇద్దరు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌ పారీ్టకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. రాయ్‌బరేలీ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీకి నలుగురు, బీజేపీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు.

కాంగ్రెస్‌ అగ్రనేత, సిట్టింగ్‌ ఎంపీ సోనియా గాంధీ ఇక్కడి నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేకపోయారు. రాయ్‌బరేలీ నుంచి ఉంచాహర్‌ ఎమ్మెల్యే మనోజ్‌ పాండేను, అమేథీ నుంచి గౌరీగంజ్‌ ఎమ్మెల్యే రాకేశ్‌ ప్రతాప్‌సింగ్‌ను బరిలో దింపే యోచనలో అఖిలేశ్‌ ఉన్నట్లు సమాచారం. నిజానికి కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు లేనప్పుడు రాయ్‌బరేలీ, ఆమేథీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను పోటీ చేయించలేదు. ఈసారి మాత్రం పోటీకి సై అంటుండడం ఆసక్తికరంగా మారింది. సమాజ్‌వాదీ అభ్యర్థులు పోటీ చేస్తే రెండు కీలక నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం చెమటోడ్చక తప్పదు.

>
మరిన్ని వార్తలు